ఎనిమిదేళ్ల క్రితం తప్పిపోయి.. ఇంటికి చేరిన బాలిక

28 Jun, 2022 07:22 IST|Sakshi

వెంగళరావునగర్‌: దాదాపు ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన ఓ బాలిక సోమవారం తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. ఓ టీవీ కార్యక్రమం ఆ బాలిక పాలిట వరంలా మారి..అనాథ జీవితానికి తెర పడింది. వివరాల్లోకి వెళ్తే..ఈసీఐఎల్‌ కమలానగర్‌కు చెందిన పిన్నమోని కృష్ణ, అనూరాధ దంపతులకు నలుగురు కుమార్తెలు. వీరిలో ఇందు, సింధు కవలలు. 2014లో వినాయక ఉత్సవాలకు వెళ్ళిన సందర్భంగా ఇందు అనే మూడున్నరేళ్ల కుమార్తె తప్పిపోయింది. ఆ సమయంలో ఆ పాపను ఓ మహిళ తీసుకెళ్లినట్టుగా సీసీ టీవీలో కూడా కనిపించింది.

దాంతో తల్లిదండ్రులు నాటి నుంచి చాలా ప్రాంతాల్లో గాలించారు. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. ఇటీవల ఓ టీవీ చానల్‌ కార్యక్రమంలో ఆ పాప కనిపించడంతో తల్లిదండ్రులు గుర్తించి తమ కుమార్తెలాగానే ఉందని అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై ఆరా తీశారు. టీవీ కార్యక్రమంలో ఎవరెవరు పాల్గొన్నారు. ఎక్కడ నుంచి వచ్చారనే విషయాన్ని తెలుసుకున్నారు. ఈ క్రమంలో రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ కమిటీ అధికారులను కలిసి విషయం తెలిపారు. వారి సాయంతో కిస్మిత్‌పూర్‌లోని చెరిస్‌ అనాథ బాలికల సంరక్షణ కేంద్రాన్ని చేరుకున్నారు.

అక్కడ ఉన్న పిల్లల్లో తమ కుమార్తె ఉండటంతో తల్లిదండ్రులు గుర్తించి అధికారులకు తెలియజేశారు. దాంతో రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రంగారెడ్డి, జిల్లా బాలల హక్కుల చైర్మన్‌ నరేందర్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా బాలల సంరక్షణ అధికారి ప్రవీణ్‌కుమార్, మహిళా శిశుసక్షేమశాఖ అధికారులు తల్లిదండ్రుల వద్ద వివరాలను, ఆ బాలిక వివరాలను పరిశీలించారు. ఎనిమిదేళ్ల కిందట తప్పిపోయిన పాప, అనాథాశ్రమంలో ఉన్న పాప ఒక్కరే అని నిర్ధారణకు వచ్చారు. సోమవారం స్థానిక మధురానగర్‌లో ఉన్న రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ ప్రధాన కార్యాలయంలో తల్లిదండ్రులకు తమ కుమార్తెను అప్పజెప్పారు. తప్పిపోయిన తమ కుమార్తె తిరిగి తమ  వద్దకు చేరడంతో తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.  

(చదవండి: మూడు నెలల క్రితం ప్రేమించి పెళ్లి.. వంట విషయంలో గొడవపడి)

మరిన్ని వార్తలు