Global Peace Rally: 2న జింఖానా మైదానంలో ప్రపంచ శాంతి సభ

23 Sep, 2022 14:31 IST|Sakshi

విజయవంతం చేయండి

పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు

మునుగోడు ఎన్నికల బరిలో ఉంటాం

ప్రముఖుల పేర్లను పరిశీలిస్తున్నాం

ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ 

సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌ జింఖానా మైదానంలో అక్టోబర్‌ 2వ తేదీన ప్రపంచ శాంతి సభను నిర్వహించనున్నట్లు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కె.ఎ.పాల్‌ వెల్లడించారు. 2న సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకు సభ జరిగే సభను విజయవంతం చేయాలని కోరారు. సికింద్రాబాద్‌లోని హరిహరకళా భవన్‌లో శాంతి సభ పోస్టర్‌ను ప్రజా గాయకుడు గద్దర్, ప్రొఫెసర్‌ కోదండరాంతో కలిసి ఆయన ఆవిష్కరించారు. 

ఈ సందర్భంగా కేఏ పాల్‌ మాట్లాడుతూ... శాంతి సభలకు 25 పార్టీల్లో 19 పార్టీలు మద్దతు ప్రకటించి రానున్నారని ఆయన వెల్లడించారు. ఆర్థిక అసమానతలను రూపు మాపేందుకు, ప్రపంచ శాంతి కోసం ఈ సభలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఈ సభలకు ముఖ్య అతిథిగా ఆహ్వానిస్తున్నామని... ఆయన వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని రాకపోతే ప్రజలు, దేవుడి తీర్పుకు అంగీకరించాల్సి వస్తుందని ఆయన పేర్కొన్నారు.

మునుగోడు ఎన్నికల్లో ప్రజాశాంతి పార్టీ పోటీలో ఉందని ప్రజా గాయకులు గద్దర్‌తో పాటు మరికొంత మంది పేర్లు పరిశీలిస్తున్నామని చెప్పారు. సెప్టెంబర్‌ 25న తన పుట్టిన రోజు సందర్భంగా 59 మంది మునుగోడు నియోజకవర్గ నిరుద్యోగులకు, అక్టోబర్‌ 2వ తేదీన సభకు వచ్చిన నిరుద్యోగుల్లో లాటరీ ద్వారా అమెరికాలో ఉద్యోగాల కోసం పాస్‌ పోర్టుతో పాటు వీసాను కూడా అందిస్తామని చెప్పారు. 

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్‌ కోదండరాం మాట్లాడుతూ... ప్రజలందరూ సమానంగా, సమాన హక్కులు పొందడం అనేది ప్రజాస్వామ్య దేశం లక్ష్యమన్నారు. ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే లౌకికవాదాన్ని పదికాలాలపాటు సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాము ఈ శాంతి సభలకు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు. కార్యక్రమంలో తెలంగాణ క్రిష్టియన్‌ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ రవికుమార్, కన్వీనర్‌ జీ శ్యాం అబ్రహాం, వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లు, సంఘ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు, బిషప్‌లు పాల్గొన్నారు. (క్లిక్ చేయండి: ఉప ఎన్నిక కోసమే ‘గిరిజన బంధు’)

మరిన్ని వార్తలు