మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? పెనం మీద నుంచి పొయ్యిలోకి!

26 Feb, 2023 04:39 IST|Sakshi

పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యింది ప్రపంచం పరిస్థితి ఇప్పుడు!  కోవిడ్‌ నుంచి గట్టెక్కామని ఊపిరి పీల్చుకుంటుండగానే బోలెడన్ని ఇతర సమస్యలు చుట్టుముట్టేస్తున్నాయి! రెండేళ్ల వృద్ధిని అందుకొనే క్రమంలో కర్బన ఉద్గారాలు పెరిగిపోతూండటం ఒకవైపు... రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధం పుణ్యమా అని అదుపుతప్పిన ద్రవ్యోల్బణం ఇంకోవైపు... పలు దేశాల ఆర్థిక విధానాల్లో  మార్పుల కారణంగా పేద, ధనిక అంతరాలూ పెరిగిపోతున్నాయి! ఈ నేపథ్యంలో మనిషి ఇప్పుడు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏమిటి? రానున్న రెండేళ్లలో ఏమైనా మార్పులొస్తాయా?  దీర్ఘకాలం అపరిష్కృతంగా ఉండే చిక్కుల మాటేమిటి? ఈ అంశాలన్నింటిపై ఇటీవలే వరల్డ్‌ ఎకనామిక్‌  ఫోరం ఒక సర్వే నిర్వహించింది. గ్లోబల్‌ రిస్క్‌ పర్‌సెప్షన్‌ సర్వే ప్రకారం ఇప్పటి ప్రధాన సమస్య ఏమిటో తెలుసా? బతకడానికయ్యే ఖర్చుల్లో పెరుగుదల!  కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌! 

రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధానికి ఏడాది పూర్తయ్యింది. కోవిడ్‌ అనంతర పరస్థితుల్లో మొదలైన ఈ యుద్ధం అనేక రంగాల్లో ప్రపంచ స్థితిగతులను మార్చేసిందనడంలో సందేహం లేదు. పైగా ఇప్పుడిప్పుడే యుద్ధం ముగిసే సూచనలు కనపడని నేపథ్యంలో ప్రపంచం మొత్తం మీద పెరిగిపోతున్న జీవన వ్యయంపై ప్రజల్లో తీవ్రమైన ఆందోళన నెలకొందని గ్లోబల్‌ రిస్క్‌ పర్‌సెప్షన్‌ సర్వే చెబుతోంది. ఇంకో రెండేళ్లపాటు పరిస్థితి ఇలాగే ఉంటుందని సర్వేలో పాల్గొన్న అధికులు అభిప్రాయపడ్డారు. కోవిడ్‌కు ముందు పరిస్థితులన్నీ బాగున్నప్పుడు పరిశ్రమలకు, కంపెనీలకు బ్యాంకుల ద్వారా చాలా సులువుగా అప్పులు పుట్టేవని, ఇప్పుడా స్థితి లేకపోవడం, మాంద్యం భయంతో ఐటీ కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తుండటం కూడా కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌పై ఆందోళనలు పెరిగేందుకు కారణమైందని ఆ సర్వే తేల‍్చింది. ఈ నేపథ్యంలో గ్లోబల్‌ రిస్క్‌ పర్‌సెప్షన్‌ సర్వే రాగల రెండేళ్లు, పదేళ్ల కాలవ్యవధుల్లో ఎదుర్కొనే అవకాశమున్న ఐదు అతిపెద్ద ముప్పులపై ప్రజల అభిప్రాయాలు తెలుసుకుంది.  

వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం సిద్ధం చేసిన గ్లోబల్‌ రిస్క్‌ పర్‌సెప్షన్‌ సర్వే 40కిపైగా దేశాల్లోని వివిధ రంగాల నిపుణుల నుంచి సమాచారాన్ని సేకరించారు. విద్య, వ్యాపార రంగాలతోపాటు ప్రభుత్వ అధికారులు పలువురు నిపుణుల బృందంలో ఉన్నారు. ఈ సర్వేలో రిస్క్‌ లేదా ముప్పుగా పరిగణించిన అంశాలు ప్రపంచ స్థూల ఉత్పత్తిపై లేదా ప్రజలు, ప్రకృతి వనరులపై దుష్పభావం చూపగలిగేవి. రానున్న రెండేళ్లలో ఈ ముప్పుల తీవ్రత, పరిణామాలు, ప్రభుత్వాల సన్నద్ధత వంటి అంశాలను కూడా ఈ సర్వేలో పొందుపరిచారు.  

అన్ని ప్రియమవుతున్న వేళ
కోవిడ్‌ కంటే ముందు కూడా ప్రపంచవ్యాప్తంగా కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ పెద్ద సమస్యగానే ఉండేది. కానీ మహమ్మారి పుణ్యమా అని సరఫరాలు నిలిచిపోవడం, డిమాండ్, సరఫరాల మధ్య అంతరం పెరగడంతో పరిస్థితి మరింత దిగజారింది. గతేడాది చివరి నాటికి ద్రవ్యోల్బణం కారణంగా సమాజంలోని అట్టడుగు వర్గాలకు ఆహారం, నివాసం వంటి కనీస అవసరాలు కూడా అందనంత స్థాయికి చేరుకున్నాయి.

రష్యా ఉక్రెయిన్‌ యుద్ధంతో ఇంధన సరఫరాలపై పలు దేశాలు నియంత్రణలు విధించాయి. ఇది ద్రవ్యోల్బణం తద్వారా కనీస అవసరాల ఖర్చులు పెరిగిపోయేలా చేసింది. నల్ల సముద్రం నుంచి ఆహారధాన్యాల ఎగుమతికి చేసుకున్న ఒప్పందం నుంచి రష్యా తొలగిపోయేందుకు సిద్ధమవుతుండటంతో భవిష్యత్తులో పరిస్థితి మరింత దిగజారుతుందని యూరప్‌ దేశాల సమాఖ్య ఇటీవల ఆందోళన వ్యక్తం చేసింది. గతేడాది మార్చిలో ప్రపంచం సాధారణ ద్రవ్యోల్బణం అత్యధిక స్థాయికి చేరినట్లు గణాంకాలు చెబుతున్నాయి.

ఈ ఏడాది విషయానికి వస్తే ఇంధన ధరలు గతేడాది జనవరితో పోలిస్తే దాదాపు 46 శాతం వరకూ ఎక్కువగా ఉండనున్నట్లు తెలుస్తోంది. చైనాలో కోవిడ్‌ నియంత్రణలను సడలించడం వల్ల వినియోగం మరింత పెరిగి ఇంధన, ఆహార ధరలు ఇంకా పెరుగుతాయని, ఇది బ్యాంకుల వడ్డీరేట్ల పెంపునకు కారణమవుతుందన్న భయాందోళనలు అధికమవుతున్నాయని అంతర్జాతీయ ఆర్థిక సంస్థ బ్లూమ్‌బర్గ్‌ పేర్కొనడం గమనార్హం. 

వాణిజ్య యుద్ధాలతో తీవ్ర నష్టం
ఒకప్పుడు దేశాల మధ్య యుద్ధాలు ఆయుధాలతో జరిగేవి. ఇప్పుడు వాణిజ్య ఆర్థికాంశాలపై ప్రత్యర్థులను దెబ్బకొట్టేందుకు ప్రాధాన్యమిస్తున్నారు. దీని ప్రభావం ఆయా దేశాలకే పరిమితం కావడం లేదు. ఇతర దేశాలతోపాటు అనేక రంగాలకు విస్తరిస్తోంది. రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధం సందర్భంలో భారత్, రష్యా నుంచి ముడిచమురు కొనుగోలు చేయడం ఎంత దుమారం రేపిందో తెలియనిది కాదు.

రానున్న పదేళ్లలో దేశాల మధ్య ఘర్షణలు మరింత పెరుగుతాయని, అవి వాణిజ్య యుద్ధాలకు దారితీస్తాయని గ్లోబల్‌ రిస్క్‌ పర్‌సెప్షన్‌ సర్వేలో పాల్గొన్న నిపుణులు భావిస్తున్నారు. కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వస్తుండటం, దేశాలు తమ రక్షణ వ్యయాన్ని పెంచుతుండటాన్ని దీనికి నిదర్శనంగా వారు చూపుతున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం నేపథ్యంలో రష్యాపై అమెరికా నియంత్రణలు, నిషేధాలు విధించినట్లే భవిష్యత్తులోనూ ఆర్థికాంశాలపై దాడులు తీవ్రతరం కానున్నాయని అంచనా.

ఆసియా, తూర్పు ఆసియా ప్రాంతాల్లోనూ ఇలాంటి పరిస్థితి ఏర్పడనుంది. సమాజంలో వైషమ్యాల పెరుగుదల విలువలు, సమానత్వాల మధ్య అంతరం పెరిగిపోతుండటం కూడా స్వల్పకాలిక ముప్పుగా పరిగణిస్తున్నారు. సామాజిక, ఆర్థిక రంగాల్లో వచ్చే విభజన క్రమేపీ రాజకీయాలకు విస్తరిస్తుందని, వలసలు, లింగవివక్ష, జాతి, కులం, మతం ఆధారంగా ఘర్షణలు పెరిగేందుకు కారణమవుతుందని అంచనా.

ప్రపంచం నలుమూలలా పలు దేశాల్లో ఘర్షణలు, ఉద్యమాలు పెరిగిపోతుండటం ఇందుకేనని చెబుతున్నారు. ధరల నియంత్రణలో వైఫల్యం, అక్రమ ఆర్థిక వ్యవహారాలపై అదుపు లేకపోవడం వల్ల సమాజం తీవ్రమైన మానసిక సమస్యలను ఎదుర్కొవాల్సి వస్తుందని అత్యధికులు ఆందోళణ వ్యక్తం చేశారు. 

వాతావరణ మార్పులు
వాతావరణ మార్పులను ఎదుర్కొనే విషయంలో జరుగుతున్న జాప్యాన్ని ప్రపంచం ఇప్పుడు అతిపెద్ద ముప్పుగా పరిణమిస్తోంది. సుమారు 30 ఏళ్లుగా చర్చలు జరుగుతున్నా చెప్పుకోదగ్గ ముందడు ఏదీ ఇప్పటిదాకా పడలేదు. వాతావరణంలో ఈనాటి కర్బన ఉద్గారాలను పరిగణనలోకి తీసుకుంటే భూమి సగటు ఉష్ణోగ్రతలను 1.5 డిగ్రీల సెల్సియస్‌ కంటే ఎక్కువ స్థాయికి పెంచరాదన్న లక్ష్యం నెరవేరే అవకాశం కనిపించట్లేదు.

గ్లోబల్‌ రిస్క్‌ పర్‌సెప్షన్‌ సర్వేలో పాల్గొన్న వారిలో 70 శాతం మంది వాతావరణ మార్పులపై ప్రస్తుత స్థితిని తప్పుబట్టారు. 2030 నాటికే సగటు ఉష్ణోగ్రతలు 1.5 డిగ్రీల సెల్సియస్‌కు చేరే అవకాశాలు ఇప్పుడు 50 శాతమని ఐపీసీసీ అంచనా వేస్తుండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. మరోవైపు పరిస్థితిని ఎదుర్కొనేందుకు జీ–7 దేశాలు చేస్తున్న ప్రయత్నాలు ఒక కొలిక్కి రావడం లేదు.

పారిస్‌ ఒప్పందాన్ని ధనిక దేశాలే తుంగలో తొక్కిన కారణంగా 2050 నాటికే ఉష్ణోగ్రతలు 2.7 డిగ్రీ సెల్సియస్‌ కంటే ఎక్కువకు చేరుకొనే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. వాతావరణ మార్పులను ఎదుర్కొనేందుకు శాస్త్రీయంగా చేయాల్సిన పనులు కాకుండా రాజకీయంగా ఉపయోగకరమైన వాటిపైనే దేశాలు ఆధారపడటం పరిస్థితిని దిగజారుస్తోంది. యూరోపియన్‌ యూనియన్‌ తాజాగా శిలాజ ఇంధన ఆధారిత ఫ్యాక్టరీల మరమ్మతులకు, ఇంధనాల కోసం ఏకంగా 5000 కోట్ల యూరోలు ఖర్చు చేస్తుండటం ఇందుకు తార్కాణం.

ఈ పరిస్థితి రానున్న రెండేళ్లలోనూ మెరుగయ్యే అవకాశాలు లేవని, దీర్ఘకాలంలో అంటే రానున్న పదేళ్ల వరకూ కూడా వాతావరణ మార్పులపై పోరు మందగమనం ప్రపంచానికి ఒక సమస్యగానే మిగలనుందని అంచనా. టర్కీలో ఇటీవలి భారీ భూకంపం, గతేడాది అకాల వర్షాలు, వరదలు, కరవులు అన్నీ వాతావరణ మార్పులను సూచిస్తున్నా ధనిక దేశాలిప్పటికీ మేలుకోకపోవడం ఆందోళనకరమేనని గ్లోబల్‌ రిస్క్‌ పర్‌సెప్షన్‌ సర్వేలో పాల్గొన్న స్టాన్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయ పర్యావరణ విభాగం అధిపతి క్రిస్‌ ఫీల్డ్‌ అన్నారు. 
- కంచర్ల యాదగిరిరెడ్డి

మరిన్ని వార్తలు