కొండా లక్ష్మణ్‌ బాపూజీ గొప్ప సామాజిక వేత్త 

28 Sep, 2021 04:27 IST|Sakshi
కొండా లక్ష్మణ్‌ బాపూజీ చిత్రపటానికి నివాళులర్పిస్తున్న బండారు దత్తాత్రేయ, శ్రీనివాస్‌గౌడ్, గంగుల   

ఘనంగా బాపూజీ జయంతి 

హాజరైన హరియాణా గవర్నర్‌ దత్తాత్రేయ, మంత్రులు గంగుల, శ్రీనివాస్‌ గౌడ్‌

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): కొండా లక్ష్మణ్‌ బాపూజీ గొప్ప సామాజిక వేత్త అని హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్‌ 106వ జయంతి ఉత్సవాలను రవీంద్రభారతిలో ఘనంగా నిర్వహించారు. స్వాతంత్య్ర ఉద్యమం, నిజాం వ్యతిరేక పోరాటం, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొన్న గొప్ప వ్యక్తి బాపూజీ అని దత్తాత్రేయ కొనియాడారు. అలాంటి వ్యక్తితో కలసి పనిచేసే అవకాశం రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు.

ఆయన విగ్రహాన్ని ట్యాంక్‌బండ్‌పై ఏర్పాటు చేయాలని, ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు. మంత్రులు గంగుల కమలాకర్, శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బాపూజీ తీవ్రంగా కృషి చేశారని కొనియాడారు. ఆయన స్ఫూర్తితో బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కొండా లక్ష్మణ్‌ బాపూజీ సేవలను, గొప్పదనాన్ని భవిష్యత్‌ తరాలకు తెలిపే రీతిలో అధికారికంగా కార్యక్రమాలను నిర్వహిస్తామని తెలిపారు. కార్య క్రమంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్ర వెంకటేశం పాల్గొన్నారు.

స్పీకర్‌ నివాళి 
స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ వాది కొండా లక్ష్మణ్‌ బాపూజీ 106వ జయంతి వేడుక శాసనసభ భవనంలోని ఆడిటోరియం హాల్‌లో సోమవారం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ బాపూజీ చిత్ర పటానికి అసెంబ్లీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి పూలమాల వేసి నివాళి అర్పించారు.


శాసనసభ వ్యవహారాల మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్, తలసాని శ్రీనివాస్‌ యాదవ్, అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్‌ వి.నర్సింహాచార్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు