గొర్రెలొద్దు.. డబ్బులు కావాలి

19 Sep, 2022 01:53 IST|Sakshi

సబ్సిడీ గొర్రెల పథకం కింద నగదు బదిలీ చేయాలని వక్తల డిమాండ్‌

జీఎంపీఎస్‌ ఆధ్వర్యంలో జరిగిన చర్చావేదికలో ఏకగ్రీవ తీర్మానం

సాక్షి, హైదరాబాద్‌/సుందరయ్య విజ్ఞాన కేంద్రం: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సబ్సిడీ గొర్రెల పథకం కింద తమకు గొర్రెలు వద్దని, నగదు బదిలీ చేస్తే లబ్ధిదారుడికి అనుకూలంగా ఉన్న చోట గొర్రెలు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పించాలని తెలంగాణ గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం (జీఎంపీఎస్‌) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు జీఎంపీఎస్‌ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన చర్చావేదికలో ఏకగ్రీవ తీర్మానం చేశారు.

జీఎంపీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు కిల్లె గోపాల్‌ అధ్యక్షతన జరిగిన చర్చా వేదికలో నగదు బదిలీ తీర్మానాన్ని సంఘం ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్‌ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానంపై పలువురు మాట్లాడిన అనంతరం చర్చా వేదిక ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ చర్చా వేదికలో పాల్గొన్న రాజ్యసభ సభ్యుడు ఆర్‌.కృష్ణయ్య మాట్లా­డుతూ గొర్రెలు, మేకల పెంపకందారులకు 1లక్ష 75 వేల నుంచి 5 లక్షల రూపాయల వరకు పెంచాలని, ఈ పథకం కింద నగద బదిలీ చేయాలని కోరారు.

ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లి తనవంతు ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటికే ఈ పథకం అమలులో కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలు వచ్చాయని, ఇకనైనా ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు,  సీపీఎం రాష్ట్ర  కార్యదర్శి  తమ్మినేని వీరభద్రం, టీపీసీసీ అధికార ప్రతినిధి లోకేశ్‌ యాదవ్, సమాజ్‌వాదీ పార్టీ ఉపాధ్యక్షుడు మారం తిరుపతి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన
సదస్సులో మాట్లాడుతున్న ఆర్‌.కృష్ణయ్య  

మరిన్ని వార్తలు