టీచర్ల బదిలీలకు చిక్కులెన్నో!

1 May, 2022 04:11 IST|Sakshi

317 జీవో అప్పీళ్లు ఇంకా పెండింగే 

ఇప్పటికీ తేలని స్పౌజ్‌ కేసులు 

జూన్‌లో టీచర్ల బదిలీలపై సందేహాలు 

ఆందోళనలో ఉపాధ్యాయులు 

సాక్షి, హైదరాబాద్‌: ఉపాధ్యాయ బదిలీల ప్రక్రియకు అనేక చిక్కుముళ్లు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం భావించినట్టు జూన్‌లో బదిలీలు జరగకపోవ చ్చనే ఆందోళన ఉపాధ్యాయవర్గాల్లో కన్పిస్తోంది. దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బదిలీలను పూర్తిచేయాలని ఉపాధ్యాయ సంఘాల నుంచి కొంతకాలంగా పెద్దఎత్తున డిమాండ్‌ వస్తోంది.

కొత్త జిల్లాల వ్యవస్థ కూడా అందుబాటులోకి రావడం, మన ఊరు–మనబడి, ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన ప్రవేశపెట్టాలని భావించిన ప్రభుత్వం ఈసారి పకడ్బందీగా బదిలీలు, పదోన్నతులూ చేపట్టాలని భావించింది. అయితే, న్యాయపరమైన చిక్కులు, వివిధ సంఘాల అభ్యంతరాలను ఈ నెలరోజుల వ్యవధిలో పరిష్కరించడం కష్టమని అధికార వర్గాలు భావిస్తున్నాయి.  

ఎక్కడి సమస్యలు అక్కడే... 
కొత్త జిల్లా ఏర్పాటు, స్థానికతకు ప్రాధాన్యమిస్తూ ఇటీవల 317 జీవో తెచ్చారు. ఈ నేపథ్యంలో సీనియారిటీ చూడలేదని, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లను పట్టించుకోలేదని, భార్యాభర్తల కేసులు సరిగా పరిగణనలోనికి తీసుకోలేదనే వాదనలు తెరమీదకొచ్చాయి. జీవో అమలు ప్రక్రియ ముగించినా టీచర్ల నుంచి వచ్చే అప్పీళ్లను పరిశీలించి పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇచ్చారు.

కానీ, ఇప్పటికీ 6 వేలకుపైగా అప్పీళ్లు పాఠశాల విద్యాశాఖ వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. స్పౌజ్‌ కేసులు 4 వేల వరకూ ఉన్నాయి. మొత్తం 3 వేల కేసులు న్యాయబద్ధంగా లేవని కొట్టిపారేసిన విద్యాశాఖ 500 అప్పీళ్లను మాత్రమే పరిష్కరించింది. మిగతావాటిపై అనేక దఫాలు సమీక్షలు జరిపినా కొలిక్కిరాలేదు. బదిలీలకు ముందే తమ సమస్యలు పరిష్కరించాలని పలువురు ఉపాధ్యాయులు విద్యాశాఖ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు.  

ఆందోళన తప్పదు: జంగయ్య, యూటీఎఫ్‌ నేత 
బదిలీలకు మార్గాన్ని సుగమం చేయడంపై ప్రభుత్వం శ్రద్ధ పెట్టడం లేదు. ఇప్పుడున్న సమస్యలను పరిష్కరించకుండా సాధారణ బదిలీలు చేపట్టడం అసాధ్యం. పరిష్కరించగల చొరవ ప్రభుత్వమే తీసుకోవాలి. తాత్సారం చేస్తే బలమైన ఉద్యమానికి యూటీఎఫ్‌ సిద్ధమవుతుంది. 

పరస్పర బదిలీలూ అంతే.. 
317 జీవో అమలు నేపథ్యంలో ఇతర జిల్లాలకు వెళ్లిన, దీర్ఘకాలంగా వేరే జిల్లాలకు వెళ్లాలనుకునేవారి కోసం ప్రభుత్వం పరస్పర బదిలీలకు అవకాశం కల్పించింది. దీంతో దాదాపు 4 వేల మంది పరస్పర బదిలీలు కోరుకున్నారు. కొత్త జిల్లాలకు వెళ్లినవారు పరస్పర బదిలీ కోరుకుంటే సర్వీసును పరిగణనలోనికి తీసుకోబోమని తొలుత మార్గదర్శకాల్లో ప్రభుత్వం పేర్కొంది. ఉపాధ్యాయుల్లో ఆందోళన వ్యక్తం కావడంతో గైడ్‌లైన్స్‌ను సవరించి సర్వీసును పరిగణనలోనికి తీసుకునేందుకు అంగీకరించింది.

అయితే, దీనిపై కొంతమంది కోర్టును ఆశ్రయించారు. కోర్టు దీనిని పరిష్కరించకుండా, పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వకుండా సాధారణ బదిలీలు చేపట్టడం కుదిరేపని కాదని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. మరోవైపు పదోన్నతుల విషయంలోనూ జిల్లా పరిషత్‌ ఉపాధ్యాయులు, ప్రభుత్వ టీచర్ల మధ్య వివాదం కొనసాగుతోంది. ఎంఈవో, డీఈ వో పోస్టులు నిబంధనల ప్రకారం తమకే దక్కాలని ప్రభుత్వ టీచర్లు డిమాండ్‌ చేస్తున్నారు. కాదంటే కోర్టుకు వెళ్లే యోచనలో ఉన్నారు. ఈ సమస్యలన్నీ ఉపాధ్యాయ బదిలీలకు చిక్కుముడులుగా మారాయి. 

మరిన్ని వార్తలు