ముందుకా.. వెనక్కా?

16 Aug, 2021 03:31 IST|Sakshi

ఇచ్ఛంపల్లి–కావేరి అనుసంధానంపై రేపు మరో కీలక భేటీ 

పరీవాహక రాష్ట్రాల అభిప్రాయాలు తీసుకోనున్న ఎన్‌డబ్ల్యూడీఏ 

ఇంద్రావతిలో వినియోగించని273 టీఎంసీలను తరలిస్తామనడంపై ఛత్తీస్‌గఢ్‌ అభ్యంతరం 

దీనిపై స్పష్టత ఇవ్వాలని కేంద్రాన్ని కోరుతున్న తెలంగాణ 

తమ అవసరాలు తీరాకే మిగులు నీటిని తరలించాలని సూచన 

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి–కావేరి నదుల అనుసంధాన ప్రక్రియపై మళ్లీ కదలిక వచ్చింది. జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) తెరపైకి తెచ్చిన ఇచ్ఛంపల్లి నుంచి కావేరి గ్రాండ్‌ ఆనకట్టకు నీటి తరలింపుపై పరీవాహక రాష్ట్రాల అభ్యంతరాలు, నీటి లభ్యతపై భిన్న వాదనలు జరుగుతున్న నేపథ్యంలో దీనిపై మరోమారు సమావేశం నిర్వహించేందుకు కేంద్రం సిద్ధమైంది. ఈ నెల 17న ఎన్‌డబ్ల్యూడీఏ గవర్నింగ్‌ బాడీ నదుల అనుసంధాన ప్రక్రియపై కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలతో చర్చించనుంది. మిగులు జలాల తరలింపు విషయంలో ఛత్తీస్‌గఢ్‌ లేవనెత్తుతున్న అభ్యంతరాలు, రాష్ట్ర అవసరాలు తీరాకే నీటిని తరలించాలంటున్న తెలంగాణ, ఏపీ వాదనల నేపథ్యంలో దీనిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా ఉంది. 

ఇంద్రావతిలో మిగులుందని ముందుకు పోవద్దు.. 
గోదావరి–కావేరి నదుల అనుసంధానంపై ఇప్పటికే జనంపేట, అకినేపల్లి, తుపాకులగూడెం నుంచి నీటిని తరలించే ప్రణాళికలు తెరపైకి తెచ్చిన కేంద్రం వాటిపై తెలంగాణ ఆమోదం లేని నేపథ్యంలో మళ్లీ ఇచ్ఛంపల్లి వద్ద బ్యారేజీ నిర్మించి అటునుంచి నీటిని కావేరికి తరలిస్తామన్న ప్రతిపాదనకు ప్రాణం పోస్తోంది. ఇంద్రావతి, గోదావరి జలాలు కలిపి మొత్తంగా ఇచ్ఛంపల్లి వద్ద 324 టీఎంసీల మేర లభ్యత ఉందని, ఇందులో 247 టీఎంసీల నీటిని రోజుకు 2.2 టీఎంసీల చొప్పున తరలిస్తామని కేంద్రం చెబుతోంది. దీనికి రూ.86వేల కోట్ల అంచనాతో ఇదివరకే రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదికలను రాష్ట్రాలకు పంపింది.

అయితే ఇందులో ఇంద్రావతిలో లభ్యతగా ఉన్నాయని చెబుతున్న 273 టీఎంసీల నీటిపై ఛత్తీస్‌గఢ్‌ తీవ్రంగా ఆక్షేపిస్తోంది. ఇంద్రావతిలో మిగులు జలాలున్నాయంటూ వాటి ఆధారంగా దిగువ రాష్ట్రాల్లో ప్రాజెక్టులు చేపట్టవద్దని సూచించింది. ఇంద్రావతిపై తమ ప్రభుత్వం బ్యారేజీలు, ప్రాజెక్టులు నిర్మిస్తోందని, వీటి ద్వారా 273 టీఎంసీలు వినియోగిస్తామని అంటోంది. ఒకవేళ మిగులు ఉందని చెప్పి వేల కోట్ల ఖర్చుతో అనుసంధాన ప్రక్రియ చేపడితే, భవిష్యత్తులో తాము నీటి వినియోగం మొదలుపెట్టేలా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తే నీళ్లే ఉండవని, అప్పుడు శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరేనని హెచ్చరిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌ వాదనతో తెలంగాణ సైతం ఏకీభవిస్తోంది. ఏ నదీ బేసిన్‌లోని నీటిని ఆ బేసిన అవసరాలు తీరాకే ఇతర బేసిన్‌లకు తరలించాలని ట్రిబ్యునల్స్, చట్టాలు చెబుతున్నాయని అంటోంది. ఛత్తీస్‌గఢ్‌ అవసరాలు తీరకుండా, వాటికి హక్కు ఇవ్వకుండా మిగులు నీటిని ఇతర బేసిన్‌లకు తరలించడం కష్టమేనని చెబుతోంది. ఇంద్రావతి జలాలపై స్పష్టత ఇచ్చాకే ముందుకెళ్లాలని అంటోంది.  

మరిన్ని వార్తలు