6లోగా అదనపు సమాచారమివ్వండి

25 Sep, 2021 01:10 IST|Sakshi

ఆరు ప్రాజెక్టుల డీపీఆర్‌లపై తెలంగాణకు స్పష్టం చేసిన గోదావరి బోర్డు

ఇప్పటికే డీపీఆర్‌ల పరిశీలన చివరి దశకు.. 

సాక్షి, హైదరాబాద్‌:  గోదావరి నదీబేసిన్‌ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం సమర్పించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)లపై ఇతర సమాచారంగానీ, పరిశీలనలనుగానీ తమకు అక్టోబర్‌ 6వ తేదీలోగా సమర్పించాలని తెలంగాణకు గోదావరి బోర్డు సూచించింది. ఈలోగా అందించిన సమాచారం మేరకే ప్రాజెక్టుల అనుమతుల విషయమై ముందుకు వెళతామని, ఎలాంటి అదనపు సమాచారం ఇవ్వకుంటే తెలంగాణ తరఫున చెప్పడానికి అదనంగా ఏమీ లేదన్నట్లుగానే భావిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

ఈ మేరకు రెండ్రోజుల కిందట బోర్డు సభ్యకార్యదర్శి బీపీ పాండే ఒక్కో ప్రాజెక్టుపై విడివిడిగా రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. సీతారామ, తుపాకులగూడెం, చిన్న కాళేశ్వరం, మోదికుంటవాగు, చౌట్‌పల్లి హన్మంత్‌రెడ్డి ఎత్తిపోతల, చనాకా–కొరట ప్రాజెక్టుల డీనీఆర్‌లను తెలంగాణ ఇదివరకే సమర్పించగా, దీనిపై బోర్డు స్క్రూటినీ మొదలుపెట్టింది. ఒక్కో ప్రాజెక్టుకు కేటాయించిన నీరు, ప్రాజెక్టు వ్యయం, వృధ్ధిలోకి తెచ్చే ఆయకట్టుతోపాటు తాగు, పారిశ్రామిక అవసరాలకు వినియోగించనున్న వివరాలను రాష్ట్ర ప్రభుత్వం డీపీఆర్‌లలో వివరించింది.

అయితే సీతారామసహా కొన్ని ప్రాజెక్టులపై గోదావరి బోర్డు అదనపు సమాచారం కోరింది. సీతారామ ప్రాజెక్టు కారణంగా ఆంధ్రప్రదేశ్‌లోని పోలవరం ప్రాజెక్టుకు నీటి లభ్యత తగ్గే అవకాశాలున్నాయా అంటూ పలు ప్రశ్నిలు సంధించినట్లు తెలిసింది. దీంతోపాటే చనాకా–కొరటకు సంబంధించి మహారాష్ట్రకు దక్కే జలాలు, ఆ ప్రాంతంలో ఆయకట్టు వివరాలను సేకరించినట్లుగా తెలిసింది. తాము కోరుతున్న సమాచారంతోపాటు ఇతరత్రా ఎలాంటి సమాచారాన్నైనా అక్టోబర్‌ 6లోగా తమకు అం దించాలని కోరింది. ఈ వివరాలను సైతం పరిశీలనలోకి తీసుకొని డీపీఆర్‌లను మదింపు చేస్తామని తెలిపింది.  

చనాకా–కొరటపై సీడబ్ల్యూసీకి ప్రజెంటేషన్‌ 
చనాకా–కొరట ప్రాజెక్టుపై శుక్రవారం హైదరాబాద్‌లోని కేంద్ర జలసంఘం ఇంజనీర్లకు ఆదిలాబాద్‌ సీఈ శ్రీనివాస్‌రెడ్డి పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు. ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీ నిర్మాణం, ఇప్పటివరకు చేసిన పనులు, వ్యయం, భూసేకరణ, మహారాష్ట్ర సహకారం, తెలంగాణ, మహారాష్ట్రలో వృద్ధిలోకి వచ్చే ఆయకట్టు తదితరాలపై వివరణ ఇచ్చారు.  

28న కృష్ణా బోర్డు సబ్‌ కమిటీ మరోమారు భేటీ 
గెజిట్‌ నోటిఫికేషన్‌ అంశాల అమలుపై చర్చించేందుకు కృష్ణాబోర్డు సబ్‌కమిటీ మంగళవారం మరోమారు భేటీ కానుంది. ప్రాజె క్టుల సమాచారం, సిబ్బంది, భద్రత వంటి అంశాలపై కమిటీ చర్చించనుంది. తెలంగాణ ఇప్పటికే కొంత సమాచారాన్ని బోర్డుకు అందించగా, మరికొంత సమాచారాన్ని మం గళవారం నాటి భేటీలో సమర్పించనుంది.   

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు