‘సీతారామ’ కొత్త ఆయకట్టు కొంతేనా?

29 Oct, 2021 04:01 IST|Sakshi

ప్రాజెక్టు విద్యుత్‌ వాడకం లెక్కల్లోతేడాలు ఎందుకున్నాయి?

హెడ్‌ రెగ్యులేటర్‌ పనుల్లో‘గరిష్ట వరద’ను పరిగణించలేదేం?

పాక్షిక వివరాలతో డీపీఆర్‌నుఆమోదించలేం.. పూర్తి వివరాలివ్వండి

రాష్ట్ర ప్రభుత్వానికి గోదావరి బోర్డు మరో లేఖ  

సాక్షి, హైదరాబాద్‌: గోదావరి జలాల గరిష్ట నీటి వినియోగం లక్ష్యంగా చేపట్టిన సీతారామ ఎత్తిపోతల పథకంపై గోదావరి బోర్డు ప్రశ్నల వర్షం కురిపి స్తోంది. ఇప్పటికే పలు దఫాలుగా రాష్ట్రం నుంచి స్పష్టత కోరిన బోర్డు తాజాగా మరో లేఖను సంధిం చింది. గతంలో గరిష్ట వరద వచ్చినప్పుడు ఉండే ముంపు సమస్యలు, ప్రాజెక్టు డిజైన్‌లపై పలు ప్రశ్నలు లేవనెత్తిన బోర్డు.. తాజాగా కొత్త ఆయ కట్టుకు ప్రతిపాదించిన నీటి వినియోగం, విద్యుత్‌ లెక్కలపై ప్రశ్నలు వేసింది. పాక్షిక వివరాలతో నివేదికను ఆమోదించలేమని, పూర్తి వివరాలను వీలైనంత త్వరగా తమకు సమర్పించాలని రాష్ట్రాన్ని ఆదేశించింది.

బోర్డు సంధించిన ప్రశ్నలు ఇలా..
పాత ఇందిరాసాగర్, రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టుల ద్వారా 33 టీఎంసీలను వినియోగిస్తూ 4.10 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ప్రతిపాదిం చారు. తదనంతరం సమీకృత దుమ్ముగూడెం ప్రాజెక్టును 50 టీఎంసీల నీటిని వినియోగిస్తూ 5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టుకు నీళ్లిచ్చేలా ప్రతి పాదించారు. కానీ ప్రస్తుతం సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా 70 టీఎంసీల నీటిని తీసుకుంటూ కేవలం 3.35 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టునే ఎందుకు ప్రతిపాదించారో కారణాలు చెప్పాలి.
► కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) లెక్కల ప్రకారం దుమ్ముగూడెం వద్ద గరిష్ట వరద 36 లక్షల క్యూసెక్కులుగా ఉన్నప్పుడు గోదావరి నీటిమట్టం 62.86 మీటర్లుగా ఉంది. 50 ఏళ్ల గరిష్ట వరద చూసినప్పుడు గరిష్ట నీటిమట్టం 60.43 మీటర్లుగా ఉంది. కానీ ప్రాజెక్టు హెడ్‌ రెగ్యులేటర్‌ను 56.5 మీటర్ల ఎత్తులోనే నిర్మిస్తున్నారు. దీన్నిబట్టి చూస్తే గరిష్ట వరద నమోదైనప్పుడు హెడ్‌వర్క్‌ పనులు ముంపునకు గురయ్యే అవకాశాలున్నాయి. ఈ అంశానికి సంబంధించి అన్ని వరద లెక్కల వివరాలు సమర్పించాలి.
► గోదావరిలో వరద ఉన్న 90–120 రోజుల్లోనే గోదావరి నుంచి 70 టీఎంసీల నీటిని వినియోగిస్తామని తెలిపారు. మరి వరద ముగిశాక రబీకి అవసరమైన 29.42 టీఎంసీలను ఎక్కడి నుంచి మళ్లిస్తారో వెల్లడించాలి.
► ఇక 70 టీఎంసీలను తరలిస్తున్నా ఆ నీటిని నిల్వ చేసేందుకు రిజర్వాయర్లు లేవా?
► ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న హెడ్‌రెగ్యు లేటర్‌ను 400 క్యూసెక్కుల నీటిని తీసుకొనేలా డిజైన్‌ చేయగా కాల్వ సామర్థ్యాన్ని మాత్రం 256 క్యూసెక్కులకే డిజైన్‌ చేశారు. దీనిపై తేడాలెందుకో తెలపాలి.
► ప్రాజెక్టు అప్రైజల్‌ కమిటీకి ఇచ్చిన నివేదికలో ప్రాజెక్టు విద్యుత్‌ అవసరాలు 694 మెగావాట్లుగా పేర్కొనగా డీపీఆర్‌లో వాటిని 725 మెగావాట్లుగా పేర్కొన్నారు. ఏది సరైనదో వివరణ ఇవ్వాలి.
► స్టేట్‌ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ అథారిటీ నిర్ధారించిన ఒక్కో యూనిట్‌ విద్యుత్‌ ధర, డీపీఆర్‌లో పేర్కొన్న యూనిట్‌ ధరలు వేర్వేరుగా ఉన్నాయి. ఇందుకుగల కారణాలు తెలపాలి.
► ఉమ్మడి రాష్ట్రానికి  ఉన్న 1,480 టీఎంసీల గోదావరి లభ్యత జలాల్లో 900 టీఎంసీలు తమవేనని తెలంగాణ చెబుతోంది. కానీ డీపీఆర్‌లో సాంకేతికంగా 1,480 టీఎంసీల నీటికి ఆమోదం లభించలేదని వ్యాప్కోస్‌ తెలిపినట్లుగా పేర్కొ న్నారు. అలాంటప్పుడు ఏ ప్రాతిపదికన తెలంగాణ నీటిని వినియోగిస్తుందో స్పష్టత ఇవ్వాలి.

మరిన్ని వార్తలు