Kadem Project: కడెంపై ఆ 9 మం‍ది ‘చివరి’ సెల్ఫీ..! ఉగ్ర గోదారి ఉరిమి చూస్తే!

15 Jul, 2022 15:31 IST|Sakshi

నిర్మల్‌/కడెం: గోదావరి మహోగ్రరూపాన్ని కడెం ప్రాజెక్టు సిబ్బంది కళ్లారా చూశారు. క్షణం ఆలస్యమైనా వాళ్ల ప్రాణాలకు ప్రమాదం ఏర్పడేది. ప్రాజెక్టుపై గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత కూడా డ్యామ్‌ సిబ్బంది డ్యూటీలో ఉన్నారు. అప్పటికే 5 లక్షల క్యూసెక్కులు వస్తున్నా పరిస్థితిని సమీక్షిస్తూనే ఉన్నారు. ఇంతలో వరద ఒక్కసారిగా పెరుగుతుండటంతో ఈఈ రాజశేఖర్‌.. కలెక్టర్‌ ముషరఫ్‌ అలీకి ఫోన్‌ చేసి పరిస్థితి వివరించారు. మీరందరూ వెంటనే డ్యామ్‌ వదిలి వెళ్లిపోవాలని కలెక్టర్‌ గట్టిగా ఆదేశించడంతో గురువారం రాత్రి 2 గంటల ప్రాంతంలో ఓ సెల్ఫీ ఫొటో తీసుకుని వచ్చేశారు. 

అయితే ఆ తర్వాత కొద్దిసేపటికి ఎస్‌ఈ సునీల్‌ పరిస్థితిని చూసివద్దామంటూ ఈఈ రాజశేఖర్, డీఈ భోజదాస్, గేట్‌ ఆపరేటర్లు చిట్టి, సంపత్‌లను వెంటబెట్టుకుని వెళ్లారు. తాము అక్కడికి వెళ్లిన కాసేపటికే వరద ఒక్కసారిగా పోటెత్తిందని, ప్రాజెక్టు పై నుంచి నీళ్లు ఉప్పొంగాయని, దీంతో వెంటనే తమ బైక్‌ అక్కడే వదిలేసి, ఎస్‌ఈ కారులో వచ్చేశామని గేట్‌ ఆపరేటర్లు తెలిపారు. డ్యామ్‌పై నుంచి సునామీలా వచ్చిన వరదను చూసి వణికి పోయామని చెప్పారు.

మరిన్ని వార్తలు