గోదావరిలో కొనసాగుతున్నవరద ఉద్ధృతి

18 Aug, 2022 08:21 IST|Sakshi

జలదిగ్బంధంలో గ్రామాలు

ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు

కాటన్‌ బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి

కృష్ణాలో తగ్గుతున్న వరద

ప్రకాశం బ్యారేజి నుంచి 3,17,250 క్యూసెక్కులు కడలిలోకి.. 

సాక్షి, అమరావతి/చింతూరు/కూనవరం/పోలవరం రూరల్‌/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్ట్‌/విజయపురిసౌత్‌/గాంధీనగర్‌ (విజయవాడ సెంట్రల్‌): ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీవర్షాలతో గోదావరిలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. బుధవారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం కాటన్‌ బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీరు సముద్రంలోకి వెళుతోంది. బుధవారం సాయంత్రానికి భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక, ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నాయి. మరోపక్క కృష్ణానదిలో వరద తగ్గుముఖం పడుతోంది. బుధవారం రాత్రి ఏడుగంటలకు ప్రకాశం బ్యారేజి నుంచి 3,17,250 క్యూసెక్కుల నీరు దిగువకు ప్రవహిస్తోంది. గోదావరి, శబరి నదుల్లో వరద ఉద్ధృతి పెరగడంతో విలీన మండలాల్లోని పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రాచలం వద్ద గోదావరి తగ్గుముఖం పట్టినా విలీన మండలాల్లోకి నీరు చేరుతోంది. బుధవారం ఉదయం భద్రాచలం వద్ద 54.6 అడుగులున్న గోదావరి నీటిమట్టం రాత్రి ఏడుగంటలకు 54.4 అడుగులకు తగ్గింది. 

ఎటపాక, కూనవరం, వీఆర్‌పురం, చింతూరు మండలాల్లో బుధవారం రాత్రి వరకు వరద పెరుగుతూనే ఉంది. ఎటపాక మండలంలో ప్రధాన రహదారులపైకి వరదనీరు చేరడంతో భద్రాచలంతో పాటు ఇతర మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం మండలంలో కూనవరం, టేకులబోరు, శబరి కొత్తగూడెం, చినార్కూరు, కొండ్రాజుపేట, పూసుగూడెం, ముల్లూరు, తాళ్లగూడెం గ్రామాల్లోకి నీరు చేరింది. వీఆర్‌పురం మండలంలో పలు గ్రామాల్లోకి వరదనీరు చేరడంతో ప్రజలు ఇళ్లను ఖాళీచేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళుతున్నారు. గోదావరి ఎగపోటు కారణంగా శబరినది కూడా క్రమేపీ పెరుగుతోంది. చింతూరు వంతెన వద్ద శబరినది బుధవారం రాత్రి 45 అడుగులకు చేరుకుంది. దీంతో వరదనీరు గ్రామాల్లోకి ప్రవేశిస్తోంది. చింతూరులోని శబరిఒడ్డు, సంతపాకలు, టోల్‌గేట్, లారీ ఆఫీస్, పంచాయతీ రహదారి, వీఆర్‌పురం రహదారి ప్రాంతాలతో పాటు ఏజీకొడేరులో ఇళ్లల్లోకి వరదనీరు రావడంతో ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లారు. ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం 34.200 మీటర్లకు చేరింది. స్పిల్‌వే 48 గేట్ల నుంచి 12,36,429 క్యూసెక్కుల వరద నీరు కిందికి వెళుతోంది. తూర్పు గోదావరి జిల్లాలో కాటన్‌ బ్యారేజి వద్ద బుధవారం రాత్రి ఏడుగంటలకు నీటిమట్టం 15.20 అడుగులకు చేరింది. గోదావరి తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాలువలకు 11 వేల క్యూసెక్కుల నీటిని వదిలారు. బ్యారేజి నుంచి 15,12,848 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు.

శ్రీశైలం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల విడుదల 
కృష్ణానదిపై ఆల్మట్టి జలాశయంలోకి 2.15 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 1.32 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్‌లోకి  1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 1.28 లక్షల క్యూసెక్కులు, జూరాలకు 2.47 లక్షల క్యూసెక్కులు వస్తుండగా 2.46 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం జలాశయానికి 2,96,431 క్యూసెక్కుల వరద వస్తోంది. రిజర్వాయర్‌ 10 రేడియల్‌ క్రస్ట్‌ గేట్లను 15 అడుగులు ఎత్తి నీరు విడుదల చేస్తున్న అధికారులు గేట్లను బుధవారం ఉదయం ఆరుగంటలకు 12 అడుగులకు, మధ్యాహ్నం 12 గంటలకు 10 అడుగులకు దించారు. జలాశయం గేట్ల నుంచి 2,75,700 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌కు విడుదల అవుతోంది. రెండు విద్యుత్‌ కేంద్రాల్లో ఉత్పాదన చేస్తూ 62,570 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు.

ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 209.5948 టీఎంసీల నీరు ఉంది. నీటిమట్టం 883.90 అడుగులకు చేరుకుంది. తుంగభద్రకు 51 వేల కూస్కెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. మొత్తం సాగర్‌ జలాశయానికి 3,39,214 క్యూసెక్కుల నీరు చేరుతోంది. సాగర్‌ ఆరుగేట్లను ఐదడుగులు, 18 గేట్లను పదడుగులు ఎత్తి 2,98,596 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుదుత్పాదనతో 32,927 క్యూసెక్కులు నదిలోకి వదులుతున్నారు. నాగార్జునసాగర్‌ నీటిమట్టం 585.30 అడుగులు ఉంది. జలాశయంలో 298.3005 టీఎంసీల నీరు ఉంది. పులిచింతలలోకి 3.56 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే మొత్తంలో విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీకి బుధవారం రాత్రి ఏడుగంటలకు 3,32,636 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది. కృష్ణాడెల్టా కాలువలకు 15,386 క్యూసెక్కులు వదిలారు. బ్యారేజి 30 గేట్లను ఎనిమిదడుగులు, 40 గేట్లను ఏడడుగులు ఎత్తి 3,17,250 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలేస్తున్నారు.

వరద నీటిలో మునిగి రైతు మృతి
కూనవరం మండలం కరకగూడెంలో కరక జోగయ్య(48) ప్రమాదవశాత్తు గోదావరిలో మునిగి మృతిచెందాడు. తన దుక్కిటెద్దులు కనిపించకపోవడంతో వెదుక్కుంటూ వెళ్లిన ఆయన తిరిగివచ్చే సమయంలో కొండాయిగూడెం–కరకాయిగూడెం మధ్యలో కాజ్‌వేపైన గోదావరి వరద నీటిని దాటుతూ  మునిగిపోయాడు. 

ఇదీ చదవండి: పొంగుతున్న గోదావరి,  శబరి  నదులు

మరిన్ని వార్తలు