Godavari River: గోదారమ్మా ఇక శాంతించు.. రికార్డులు బద్దలుకొట్టిన వరద ప్రవాహం

15 Jul, 2022 15:46 IST|Sakshi

భారీ వర్షాల నేపథ్యంలో గోదావరి మహోగ్రరూపం దాల్చింది. 36 ఏళ్ల తర్వాత మొదటిసారి రికార్డు స్థాయిలో 70 అడుగులు దాటి వరద నీరు ప్రవహిస్తోంది. శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల ప్రాంతంలో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది.

ఇదిలా ఉండగా.. గత 50 ఏళ్లలో మూడు సార్లు మాత్రమే గోదావరి నీటి మట్టం 70 అడుగులు దాటింది. ఇక, ప్రస్తుతం గోదావరిలోకి 24 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో, అధికారులు భద్రాచలం గోదావరి కరకట్టను డేంజర్‌ జోన్‌గా ప్రకటించారు. ఇప్పటికే భద్రాచలంలో పలు కాలనీలు నీటమునిగాయి. రామాలయం ప్రాంతంలోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. 2వేల కుటంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. కాగా, గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. 

ఎగువనున్న మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశాల్లో విస్తారంగా వర్షాలు కురవడంతో గోదావరి, దాని ఉప నదులు ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కడెంవాగు ఉప్పొంగుతున్నాయి. దీంతో ఉప్పెనలా గోదావరి వరదతో విరుచుకుపడుతోంది. వరద ఉధృతి ధాటికి శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం వరకూ ఉన్న తొమ్మిది ప్రాజెక్టుల గేట్లను పూర్తిగా ఎత్తేశారు. అలాగే, కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన పార్వతి, లక్ష్మీ, సరస్వతి బ్యారేజ్‌లను గోదావరి వరద ముంచెత్తింది.

లక్ష్మీ బ్యారేజ్‌ వద్దకు 28.30 లక్షల క్యూసెక్కులు చేరడంతో కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 16.72 అడుగులకు చేరుకుంది. గోదావరి చరిత్రలో 1986లో రికార్డు స్థాయిలో 35,06,338 క్యూసెక్కులు ప్రవాహం వచ్చినప్పుడు కాళేశ్వరం వద్ద వరద నీటిమట్టం 15.75 అడుగులుగా నమోదైంది. ఇప్పుడు ఆ రికార్డు చెరిగిపోవడం గమనార్హం. ఇక ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం అత్యంత ప్రమాదకర స్థాయిని దాటిపోయింది.

ఇది కూడా చదవండి: ఉగ్ర గోదారి 'హై అలర్ట్‌'

మరిన్ని వార్తలు