ఎగువన శాంతం.. దిగువన మహోగ్రం

16 Jul, 2022 02:26 IST|Sakshi
వరద నీటితో నిండిన లక్ష్మీ పంపుహౌస్‌

వర్షాలు తగ్గుముఖం పట్టడంతో గోదావరిలోకి తగ్గిన నీటి చేరిక 

సాక్షి, హైదరాబాద్‌: పరీవాహక ప్రాంతంలో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఎగువ తెలంగాణలో గోదావరి నది శాంతించింది. శుక్రవారం రాత్రి 9 గంటల సమయానికి శ్రీరాంసాగర్‌లోకి వచ్చే వరద 96,265 క్యూసెక్కులకు తగ్గింది. మధ్యలో వాగుల చేరికతో ఎల్లంపల్లికి 2,94,429 క్యూసెక్కుల వరద వస్తోంది. అయితే ప్రాణహిత, కడెం, ఇంద్రావతి ఇతర నదుల్లో భారీగా ప్రవాహం ఉండటంతో.. లక్ష్మీ బ్యారేజీ వద్ద 23,29,903 క్యూసెక్కుల భారీ వరద కొనసాగుతోంది.

సమ్మక్క బ్యారేజీ, సీతమ్మ సాగర్‌ల నుంచీ దాదాపు ఇదేస్థాయి ప్రవాహం దిగువకు వెళుతోంది. దీనికి అదనంగా మధ్యలో చేరుతున్న నీటితో భద్రాచలానికి భారీ వరద కొనసాగుతోంది. ప్రమాదకర స్థాయిలో ప్రవాహంతో భద్రాచలం జలదిగ్బంధంలో చిక్కుకుంది. శుక్రవారం రాత్రి 10 గంటలకు భద్రాచలం వద్ద 71 అడుగుల మట్టంతో 24,29,246 లక్షల క్యూసెక్కుల వరద ముందుకు వెళుతోంది. 

భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో ముంపు 
గోదావరి ఉగ్రరూపంతో జయశంకర్‌ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. ఏటూరునాగారం మండల కేంద్రంలోని చాలా ప్రాంతాలు జలమయం అయ్యాయి. మొత్తం 28 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసి 6,800 మందిని తరలించారు. తెలంగాణ–మహారాష్ట్రలను కలిపే 353(సీ) జాతీయ రహదారిపై మహారాష్ట్ర వైపు అప్రోచ్‌ రోడ్డుకు భారీ గండి పడింది. అర కిలోమీటర్‌ మేర జాతీయ రహ దారి కోతకు గురికావడంతో.. తెలంగాణ–మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు రాకపోకలు నిలిచాయి.


 ములుగు జిల్లా ఏటూరునాగారంలోని కాలనీల్లో ప్రవహిస్తున్న వరద నీరు 

నీటిలోనే లక్ష్మీ పంపుహౌస్‌
కాళేశ్వరం: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన లక్ష్మి పంపుహౌజ్‌ పూర్తిగా నీటిలోనే మునిగిపోయి ఉంది. వేగంగా వరద రావడంతో పంపుహౌజ్‌లోని ఫోర్‌బే బ్రెస్ట్‌ వాల్‌ 9వ బ్లాక్‌ వద్ద గోడ కూలి అక్కడక్కడా గండ్లు పడినట్టు అధికారులు గుర్తించారు.  ప్రస్తుతం 108 మీటర్లకుపైగా వరద నీరు ఉందని, ఇది 100 మీటర్లకన్నా తగ్గితేనే.. పంపుహౌజ్‌లోని నీటిని ప్రత్యేక మోటార్లతో డీవాటరింగ్‌ (తోడటం) చేయడానికి వీలవుతుందని ఇంజనీర్లు చెప్తున్నారు. గోదావరి వరదతో మునిగిన పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు సమీపంలోని సరస్వతి పంపుహౌస్‌ చుట్టూ చేరిన నీరు తగ్గింది. దీనితో శుక్రవారం పంపుహౌజ్‌ నుంచి నీటిని తోడేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. 

మరిన్ని వార్తలు