‘తగ్గేదేలే..’ అంటున్న ఏజెన్సీవాసులు

13 Jul, 2022 00:43 IST|Sakshi
ఒడ్డుకు తీసుకొచ్చిన కలప

సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘పుష్ప.. పుష్పరాజ్‌.. తగ్గేదేలే!’ అంటూ ఫారెస్టు అధికారుల కళ్లు కప్పి ఎర్ర చందనం దుంగలను నీటి ప్రవాహంలో విడిచి, డ్యామ్‌ దగ్గర సేకరించే సినిమా సీన్‌కు ప్రేక్షకులు సీటీలు కొట్టారు. అయితే స్మగ్లింగ్‌తో సంబంధం లేకుండా గోదావరికి భారీ వరదలు వచ్చినప్పుడు ఏజెన్సీ వాసులు కూడా ‘తగ్గేదేలే..’ అంటూ సాహసాలు చేస్తుంటారు. వర్షానికి నేల కూలిన భారీ చెట్లు, అడవుల్లో ఎప్పుడో పడిపోయి ఎండిపోయిన చెట్లదుంగలు వరదనీటిలో కొట్టుకొస్తుంటాయి. స్మగ్లర్లు దాచిపెట్టిన కలప దుంగలు కూడా అప్పుడప్పుడు ప్రవాహంలో కలుస్తుంటాయి.

ఇచ్చంపల్లి దగ్గర ఇంద్రావతి నది గోదావరిలో కలిసిన తర్వాత ఇలాంటి దుంగలు కొట్టుకొస్తాయి. ఆ కలపకోసం ఏజెన్సీవాసులు ప్రాణాలకు తెగించి మరబోట్లపై వెళ్తున్నారు. కొట్టుకొచ్చే దుంగలను పట్టుకుని బోటులో వేయడమో లేదా తాడుకు కట్టో ఒడ్డుకు చేరుస్తారు. వరద సమయంలో చర్ల మొదలు రాజమహేంద్రవరం వరకు ఈ తరహా దృశ్యాలు కనిపిస్తాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం తదితర ప్రాంతాల్లో మంగళవారం కలప కోసం, సుమారు 52 అడుగుల ఎత్తున ప్రవహిస్తున్న గోదావరిలో  కొందరు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ కనిపించారు. టేకు దుంగలు అరుదుగా కొట్టుకొస్తాయని చెబుతున్నారు.

మరిన్ని వార్తలు