కొండపోచమ్మ టు నిజాంసాగర్‌

17 Feb, 2021 03:20 IST|Sakshi
సంగారెడ్డి కాలువ 

సంగారెడ్డి కెనాల్‌ నుంచి క్రాస్‌ రెగ్యులేటర్‌ ద్వారా హల్దీవాగుకు... అటు నుంచి నిజాంసాగర్‌కు గోదావరి జలాల మళ్లింçపు

1.3 కిలోమీటర్ల లింక్‌ కెనాల్‌ పనుల పూర్తి... మరో 10–15 రోజుల్లోనే నీటిని తరలించే యోచన

సాక్షి, హైదరాబాద్‌: కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మరో కొత్త ప్రణాళికను రాష్ట్ర ప్రభుత్వం శరవేగంగా అమల్లోకి తెచ్చే కసరత్తు చేస్తోంది. ప్రాజెక్టులో భాగంగా ఉన్న మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నుంచి సింగూరుకు అటు నుంచి నిజాంసాగర్‌కు నీటిని తరలించే ప్రణాళికలు ఇప్పటికే ఉన్నప్పటికీ, భారీ టన్నెళ్ల నిర్మాణాలతో నీటి తరలింపులో జాప్యం జరుగుతుండటంతో మరో కొత్త ప్రణాళికను తెరపైకి తెచ్చి.. దాని పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయిస్తోంది. కొండపోచమ్మ సాగర్‌ రిజర్వా యర్‌ నుంచి తవ్వుతున్న సంగారెడ్డి కాల్వల నుంచి హల్దీవాగు మొదలయ్యే ఖాన్‌ చెరువుకు లింక్‌ కెనాల్‌ను తవ్వి నీటి మళ్లింపు లక్ష్యంగా పనులు కొనసాగుతున్నాయి. 

ఒకటి కాకుంటే.. ఇంకొక మార్గం
కాళేశ్వరం ద్వారా గోదావరి జలాలను సింగూరు ప్రాజెక్టుకు తరలించే విషయంలో చాన్నాళ్లూ సందిగ్ధత ఉన్నా, చివరికి మల్లన్నసాగర్‌ నుంచి గ్రావిటీ పద్ధతిన హల్దీ వాగు ద్వారా సింగూరుకు నీటిని తరలించేందుకు మొగ్గుచూపారు. మల్లన్న సాగర్‌ నుంచి గ్రావిటీ పద్ధతిన నీటిని కొంతదూరం తీసుకెళ్లి, మధ్యన 32 మీటర్ల లిఫ్టు ద్వారా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న సింగూరుకు పంపేలా రూ.2,500 కోట్లతో ప్యాకేజీ–17, 18, 19లను చేపట్టారు. ప్యాకేజీ–17లో ఉన్న 18.62 కిలోమీటర్ల టన్నెల్‌ పనుల్లో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఆ పనులు ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేదు. ప్యాకేజీ–17లోని ఈ టన్నెల్‌ నిర్మాణం పూర్తి కాకుండా మల్లన్నసాగర్‌ నుంచి హల్దీకి, అటు నుంచి సింగూరుకు నీటిని తరలించే అవకాశం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయా లను ఆలోచించిన ప్రభుత్వం కొత్తగా కొండ పోచమ్మ నుంచి తవ్వుతున్న సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీకి నీటిని తరలించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

సంగారెడ్డి కాల్వ 6.25వ కిలోమీటర్‌ వద్ద క్రాస్‌ రెగ్యులేటర్‌ నిర్మాణం చేసి అక్కడి నుంచి ఖాన్‌చెరువు మీదుగా హల్దీవాగుకు నీటిని తరలించేందుకు 1.3 కిలోమీటర్ల లింక్‌ కెనాల్‌ తవ్వాలని నిర్ణయించారు. ఈ కెనాల్‌ పనులు ఇప్పటికే చివరి దశలో ఉన్నాయి. మరో పది పదిహేను రోజుల్లోనే ఈ లింక్‌ కెనాల్‌ ద్వారా నిజాంసాగర్‌కు నీటిని తరలించే యోచనలో ప్రభుత్వం ఉంది. ఈ లింక్‌ కెనాల్‌ పూర్తయితే కొండపోచమ్మ నుంచి తరలించే నీరు సంగారెడ్డి కాల్వ ద్వారా హల్దీ వాగులో కలిసి... అటునుంచి గ్రావిటీతో మంజీరాలో కలిసి నేరుగా నిజాంసాగర్‌కు చేరుతాయి. ప్రస్తుతం కొండపోచమ్మ సాగర్‌లో 8 టీఎంసీల మేర నీటి నిల్వ ఉంది. ఇందులోంచి 1,600 క్యూసెక్కుల నీటిని లింకు కాల్వ ద్వారా నిజాంసాగర్‌కు పంపాలన్నది ప్రస్తుతం లక్ష్యంగా ఉంది. నిజాంసాగర్‌లో ప్రస్తుతం 17.80 టీఎంసీలకు గానూ 13 టీఎంసీల మేర నీటి నిల్వలున్నాయి. ప్రస్తుతం దీనికింద 2 లక్షల ఎకరాలకు అవసరమైన నీటి విడుదల జరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులో నీటి లభ్యత పెంచేందుకు వీలుగా హల్దీవాగుకు గోదావరి జలాలను తరలించి అటునుంచి నిజాంసాగర్‌కు మళ్లించే ప్రయత్నం చేస్తోంది. 

మరిన్ని వార్తలు