ఖమ్మంలో నూనె శుద్ధి కర్మాగారం

6 Jan, 2023 04:08 IST|Sakshi
గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ ఎండీకి జ్ఞాపికను అందజేస్తున్న కేటీఆర్‌. చిత్రంలో రంజిత్‌రెడ్డి, జయేశ్‌ రంజన్‌ 

రూ.250 కోట్లతో ఏర్పాటు చేయనున్న గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌  

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో ఆయిల్‌పామ్‌ సాగులో అతిపెద్దదైన గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ రూ.250 కోట్లతో ఖమ్మం జిల్లాలో వంట నూనెల శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. 30 టీపీహెచ్‌ (టోటల్‌ పెట్రోలియం హైడ్రోకార్బన్‌) సామర్ధ్యంతో ఏర్పాటయ్యే ఈ ఫ్యాక్టరీని క్రమంగా 60 టీపీహెచ్‌లకు విస్తరిస్తారు. ఈ ఫ్యాక్టరీ ద్వారా పామాయిల్‌ను శుద్ధి చేస్తారు. ఈ మేరకు గోద్రెజ్‌ ఆగ్రోవెట్‌ లిమిటెడ్‌ ఎండీ బలరామ్‌సింగ్‌ యాదవ్‌ గురువారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావుతో భేటీ అయ్యారు.

ఈ ఫ్యాక్టరీ 2025–26 నాటికి పూర్తి స్థాయిలో పనిచేస్తుందని, కో జనరేషన్‌ ద్వారా విద్యుత్‌ ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధిస్తుందన్నారు. పది గోద్రెజ్‌ సమాధాన్‌ సెంటర్ల ద్వారా రైతులకు అందుబాటులో ఉంటుందని, ఇప్పటికే ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సేవలు అందిస్తోందని చెప్పారు. శాటిలైట్, డ్రోన్‌ల ద్వారా సాగు విస్తీర్ణాన్ని పర్యవేక్షించడంతో పాటు వేర్వేరు యాప్‌ల ద్వారా రైతులకు సేవలు అందిస్తామన్నారు.

ఈ యూనిట్‌ ఏర్పాటు ద్వారా 250 మందికి ప్రత్యక్షంగా, 500 మందికి పరోక్షంగా ఉపాధి లభించనుంది. వంట నూనెల దిగుమతిని తగ్గించేందుకు రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహించడం ద్వారా పసుపు విప్లవం దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్నట్లు కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ భేటీలో ఎంపీ రంజిత్‌రెడ్డితో పాటు ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు