భారీ వర్షాల వల్ల గోల్కొండ గోడలకు పగుళ్లు 

9 Dec, 2020 08:29 IST|Sakshi

ఇప్పటికే ఓ బురుజు సహా మూడు చోట్ల ధ్వంసం 

నేడో రేపో అన్నట్టుగా మరిన్ని గోడలు 

వచ్చే వానాకాలంలోగా పదిలం కాకుంటే మిగిలేది మట్టిదిబ్బే 

నిధులు కేటాయించి యుద్ధప్రాతిపదికన పనులు చేపట్టాల్సిన పరిస్థితి 

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ నగరం తొలిరూపు గోల్కొండ.. భాగ్యనగరం అనగానే ముందుగా గుర్చొచ్చే చారిత్రక నిర్మాణం. కాకతీయులు పునాది వేయగా, కుతుబ్‌షాహీలు ఆక్రమించుకుని మరింత అభివృద్ధి చేశారు. ఆ తర్వాత అసఫ్‌జాహీలు ఏలారు. ఇన్ని రాజవంశాల చేతులు మారినా.. పదిలంగా నిలిచిన ఆ మహా కోటకు ఇప్పుడు ప్రమాదం ముంచుకొచ్చింది. చాలా ఏళ్లు కావడంతో స్వతహాగా ఏర్పడుతున్న పగుళ్లు క్రమంగా పెరిగి మూలాలనే పెకిలిస్తున్నాయి. వాటికి వేగంగా మరమ్మతులు జరగక క్రమంగా కోటకు బీటలు వేస్తున్నాయి. ఇంతటి ప్రమాదపు అంచుల్లో ఉన్న కోటకు ఇటీవలి భారీ వర్షాలు పెద్ద కుదుపునే ఇచ్చాయి. రికార్డు స్థాయి వర్షంతో ఒక్కసారిగా గోడలన్నీ కదిలిపోయి నిట్టనిలువునా కూలిపోయేందుకు సిద్ధమయ్యాయి. ఆ వర్షాల సమయంలోనే ఓ బురుజు, మరో మహా కోట ప్రాకారం, నవాబులు జలకాలాడిన కటోరా హౌస్‌ ప్రహరీ నేలమట్టమైంది. మరికొన్ని గోడలు కూడా కూలే ప్రమాదం ఉంది. వాన కాదు కదా బలంగా గాలివీచినా రాళ్లు జారిపడేలా మారింది ఈ మహా కట్టడం. కేంద్రం వెంటనే స్పందించకుంటే కోటలోని చాలాప్రాంతాలు మట్టిదిబ్బగా మారటం ఖాయం. 

రూ.6 నుంచి రూ.8 కోట్లు కావాలి 
ఇటీవలి వర్షాలకు కూలిన ప్రాంతాలను పునరుద్ధరించాలంటే రూ.6 కోట్ల నుంచి రూ.8 కోట్ల వరకు అవసరం అవుతాయని సమాచారం. ప్రస్తుతం స్థానిక అధికారులు అంచనాలు రూపొందించి మరమ్మతు కోసం అనుమతి కోరుతూ ఢిల్లీకి ప్రతిపాదన పంపారు. దానికి సమ్మతిస్తూ సరిపడా నిధులు కేటాయిస్తేనే వీలైనంత తొందరలో పునరుద్ధరణ పూర్తవుతుంది. వచ్చే వానాకాలం లోపు ప్రధాన పనులు చేపట్టడంతో పాటు, బలహీనంగా ఉన్న చోట్ల మరమ్మతు చేయకపోతే ఏడాదిలో మరిన్ని గోడలు కూలడం ఖాయం. 

నిధులేవి..
ఇంతపెద్ద గోల్కొండ నిర్వహణకు కేంద్ర పురాతత్వ సర్వేక్షణ విభాగం కేటాయిస్తున్న నిధులు సంవత్సరానికి రూ.కోటిన్నర మాత్రమే. శతాబ్దాల నాటి నిర్మాణం కావటంతో అడుగడుగునా మరమ్మతు చేస్తే తప్ప నిర్మాణం పదిలంగా ఉండని పరిస్థితిలో ఈ నిధులు ఏ మూలకూ చాలట్లేదు. మరోవైపు ఏ చిన్న మరమ్మతు చేయాల్సి వచ్చినా ఢిల్లీకి అనుమతి కోసం పంపి, అక్కడి నుంచి అనుమతి వచ్చేసరికి పుణ్యకాలం కాస్తా పూర్తవుతోంది. ఇక మరమ్మతు పనుల్లో నైపుణ్యం ఉన్న పనివారు దొరక్కపోవటం జాప్యానికి మరో కారణం. నిత్యం నిశితంగా పరిశీలిస్తూ, ఎప్పటికప్పుడు మరమ్మతులు వేగంగా చేపడితేనే ఈ కట్టడం  పదిలంగా ఉంటుంది.  చారిత్రక కట్టడాలను దత్తత ఇచ్చేందుకు గతేడాది కేంద్రం శ్రీకారం చుట్టింది. గోల్కొండ బాధ్యత జీఎమ్మార్‌కు ఇస్తున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటి వరకు అది జరగలేదు. ఎవరైనా దాతలు ముందుకొస్తే దత్తత ఇచ్చేందుకు ఏఎస్‌ఐ సిద్ధంగా ఉన్నా ఎవరూ స్పందిచట్లేదు. (చదవండి: టూరిస్టుల గోల్‌కొండ)

జారిపోయిన బండరాళ్లు.. 
గోల్కొండ కోట పైభాగంలో జగదాంబ దేవాలయం వైపు వెళ్లే దారిలో 50 అడుగుల ఎత్తయిన కోట గోడ నిలువునా జారిపోయింది. గతంలో ఇక్కడ కొన్ని పగుళ్లు ఏర్పడ్డాయి. దానికి మరమ్మతు చేయటంలో జాప్యం జరిగింది. ఆ తర్వాత కూడా పైభాగంలోనే పనులు చేపట్టారు. బలహీనంగా ఉన్న కింది భాగానికి పూర్తిస్థాయి మరమ్మతు జరగలేదు. దీంతో భారీ వర్షాలకు కిందిభాగం మరింత బలహీనపడి కూలింది. దీంతో పైనుంచి రాళ్లు జారి పడిపోయాయి. ఫలితంగా గోడ వెనుక ఉండే మట్టి పూర్తిగా జారిపోయింది. 

మజ్నూ బురుజు.. దాదాపు కనుమరుగు
మజ్నూ బురుజు. నయాఖిల్లాలో ఉంది. ప్రస్తుతం దీని చుట్టూ గోల్ఫ్‌ కోర్సు అభివృద్ధి అయి ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు సరిగ్గా 20 రోజుల ముందు దీనికి పైభాగంలో భారీ పగులు ఏర్పడింది. బురుజు పైభాగంలో 18 అడుగుల పొడవైన ఫిరంగి ఉంది. ఇది ఔరంగజేబు సైన్యం ఏర్పాటు చేసింది. దాని వెనుకవైపు పిట్టగోడ తరహాలో ఓ గోడ అప్పట్లోనే కట్టారు. ఆ గోడ నుంచి పగులు మొదలైంది. భారీ వర్షాల సమయంలో ఆ పగులు నుంచి నీరు లోపలికి చేరటంతో మట్టి జారి పైనుంచి దిగువ వరకు సగం బురుజు కూలిపోయింది. సగం బురుజు కూలగా, మిగతా సగం కూడా బలహీనపడింది. దానిపై టన్నుల బరువుండే ఫిరంగి ఉంది. ప్రస్తుతం అది కొంత భాగం గాలిలో వేళ్లాడుతోంది. క్రేన్‌తో దాన్ని పదిలంగా తీసి పనులు చేపట్టాలి.  (చదవండి: గోల్కొండ కోట వద్ద నిర్మాణాలా..?)

ఇలా అయితే కష్టమే.. 
జగదాంబ దేవాలయానికి మరోవైపు వెళ్లే మార్గం. ఆ పక్కన కూలిన గోడ లాగానే ఇక్కడ కూడా ప్రధాన కట్టడానికి పైనుంచి దిగువ వరకు భారీ పగుళ్లు ఏర్పడ్డాయి. ఇప్పుడు దీనికి అత్యవసరంగా శాస్త్రీయ పద్ధతిలో మరమ్మతు అవసరం. లేకుంటే, సాధారణ వర్షాలకు కూడా అది కూలిపోయే ప్రమాదం ఉంది. ఇటీవల కురిసిన స్థాయి భారీ వర్షం భవిష్యత్తులో కురిస్తే ఈ గోడ నామరూపాల్లేకుండా పోవడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. 

రోడ్డు నిర్మాణంలో లోపం? 
కుతుబ్‌షాహీ నవాబుల కుటుంబం జలకాలాడేందుకు 460 ఏళ్ల కింద రూపుదిద్దుకున్న భారీ జలాశయాన్ని కటోరా హౌస్‌ అంటారు. దీన్ని ఆనుకునే రోడ్డు ఉంది. దానివైపు దాదాపు 5 అడుగుల ఎత్తుతో 60 మీటర్ల పొడవైన గోడ ఉంది. గతంలో రోడ్డు నిర్మించినప్పుడు, ఆ తర్వాత మరమ్మతులు చేసినప్పుడు వరద నీటి ప్రవాహ మార్గం చెదిరిపోయింది. వర్షాల వరద ప్రవాహం గతి తప్పి, గోడను ఆనుకుని ఉన్న మట్టి జారింది. ఇటీవలి వర్షాలకు ఆ గోడ దాదాపు 40 మీటర్ల మేర కటోరా హౌస్‌లోకి పడిపోయింది. ఇక్కడ నిర్వహణలో శాస్త్రీయత లోపించటం వల్లే ఈ గోడ కూలిందని స్పష్టమవుతోంది.

మరిన్ని వార్తలు