జనగామ: బయటపడ్డ లంకె బిందె.. బంగారం, వెండి లభ్యం!

9 Apr, 2021 14:31 IST|Sakshi

జనగామ మండలం పెంబర్తిలో వెంచర్‌ కోసం తవ్వకాలు

నిజాం కాలం నాటి ఆభరణాలుగా తొలుత ప్రచారం 

యాభై ఏళ్ల క్రితం నాటివేనని నిర్ధారించిన పురావస్తు అధికారులు

సాక్షి, జనగామ: వెంచర్‌ ఏర్పాటు కోసం భూమిని చదును చేస్తుండగా బంగారు, వెండి ఆభరణాలతో కూడిన లంకె బిందె బయటపడింది. ఐదు కిలోల బరువైన బిందె బయటపడగా, అందులో మూడు కిలోలకుపైగా మట్టి ఉంది. మిగతా బంగారు, వెండి ఆభరణాలు ఉండగా, అధికారులు వాటిని స్వాధీనం చేసుకుని ట్రెజరీకి తరలించారు. శుక్రవారం నుంచి ఆ ప్రాంతంలో తవ్వకాలు చేపట్టాక, హైదరాబాద్‌లో పరిశీలన అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు. తొలుత ఇవి నిజాం కాలం నాటి ఆలయాల్లోని ఆభరణాలుగా ప్రచారం జరిగినా, పురావస్తు శాఖ అధికారులు మాత్రం 50 ఏళ్ల క్రితం నాటివేననే నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది.  

వెంచర్‌ కోసం భూమి కొనుగోలు 
జనగామ మండలం పెంబర్తి శివారు టంగుటూరు క్రాస్‌ రోడ్డు 399, 409 సర్వే నంబర్‌లోని 11.06 గుంటల భూమిని సంకటి ఎల్లయ్య, ప్రవీణ్, నర్సయ్య. పర్శరాములు, దేవరబోయిన యాదగిరి, రాంచందర్, సత్తెయ్య తదితరులు ఇటీవల అమ్మారు. మేడ్చల్‌ జిల్లా కీసర మండలం బోగారం గ్రామానికి చెందిన మెట్టు నర్సింహ, దుర్గాప్రసాద్, నాగరాజులు ఈ భూమిని కొనుగోలు చేయగా, కొంతమొత్తంలో నగదు అందజేసి వెంచర్‌ కోసం బుధవారం పనులు ప్రాంభించారు. తొలుత జేసీబీ సాయంతో భూమిలో ఉన్న బండరాళ్లను తొలగిస్తుండగా చిన్న బిందె కనపడటంతో పెద్దగా పట్టించుకోలేదు. మళ్లీ గురువారం ఉదయం పనులు ప్రారంభించగానే ఆ బిందె పగిలి అందులో నుంచి ఆభరణాలు బయటపడడంతో గుప్త నిధులుగా భావించి పోలీసులు, అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అదనపు కలెక్టర్‌ ఎ.భాస్కరరావు, ఏసీపీ వినోద్‌ కుమార్, ఇతర అధికారులు అక్కడికి చేరుకున్నారు 

అమ్మవారి అలంకరణ నగలని కొందరు.. 
రాగి బిందెలో బయటపడిన బంగారం, వెండి ఆభరణాలు అమ్మ వారికి అలంకరణ కోసం ఉపయోగించిన నగలుగా, మొత్తంగా 5 కిలోల బంగారం బయల్పడినట్లుగా తొలుత ప్రచారం జరిగింది. నిజాం కాలం నాటి ఆభరణాలుగా మరికొందరు చెప్పుకొచ్చారు. స్వర్ణకారుడు మాచర్ల బాలకృష్ణను పిలిపించి పంచనామా చేయించగా.. 18.7 తులాల బంగారు ఆభరణాలతో పాటు కిలోన్నర వెండి ఆభరణాలు, ఏడు గ్రాముల పగడాలు ఉండడంతో ప్రత్యేక బాక్స్‌లో భద్రపరిచి కలెక్టరేట్‌కు తరలించారు. హారాలు, చెవి కమ్మలు, కాళ్ల కడియాలు, నాగపడిగెలు, పూజలు చేసే సమయంలో చేతి వేళ్లకు పెట్టుకునే శివలింగంతో కూడిన ఉంగరాలు ఈ ఆభరణాల్లో ఉన్నాయి. వీటిని చూసేందుకు అనేక గ్రామాల నుంచి వందలాది మంది తరలిరావడంతో వారిని అదుపు చేసేందుకు పోలీసులు శ్రమించాల్సి వచ్చింది
 
ట్రెజరీ స్ట్రాంగ్‌ రూమ్‌కు తరలింపు 
జిల్లా కలెక్టర్‌ కె.నిఖిల వాటిని పరిశీలించిన అనంతరం, వరంగల్‌ అర్బన్‌ జిల్లా ట్రెజరీ స్ట్రాంగ్‌ రూంలో భద్రపరిచేందుకు పోలీసు బందోబస్తు మధ్య పంపించారు. అంతకుముందే హైదరాబాద్‌ నుంచి పురావస్తు శాఖకు చెందిన డిప్యూటీ డైరెక్టర్‌ రాములునాయక్‌ తదితరులు తవ్వకాలు చేపట్టిన ప్రాంతాన్ని పరిశీలింన అనంతరం కలెక్టర్‌తో సమావేశమయ్యారు. అక్కడ ఆభరణాలను పరిశీలించి ఇవి యాభై ఏళ్ల క్రితం నాటివేనని నిర్ధారణకు వచ్చినట్లు తెలిసింది. స్థానికుల్లో స్థితిమంతులెవరైనా వీటిని తమ పిల్లల కోసం దాచి పెట్టి ఉంటారనే అభిప్రాయానికి వచ్చినట్లు సమాచారం.  

చదవండి: బయటపడ్డ 1100 ఏళ్ల నాటి బంగారు నాణేలు

మరిన్ని వార్తలు