జోరుగా బంగారం బిస్కెట్ల దందా

29 Jul, 2021 08:24 IST|Sakshi

సాక్షి, చెన్నూర్‌(ఆదిలాబాద్‌): నాణ్యమైన బంగారానికి చెన్నూర్‌ పేట్టింది పేరు. ఇక్కడ నాణ్యమైన బంగారం లభిస్తుందనే నమ్మకంతో మంచిర్యాల జిల్లా వాసులే కాక పక్కనే ఉన్న మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు చెందిన వారంతా చెన్నూర్‌లోనే బంగారం కొనుగోలు చేస్తుంటారు. దీంతో చెన్నూర్‌ పట్టణంలో శుభకార్యాల సమయంలో నెలకు కోట్లాది రూపాయల బంగారం వ్యాపారం సాగుతుంది. కొనుగోలుదారుల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు అక్రమ బంగారు బిస్కెట్ల తయారీకి తెరతీశారు. అసలు బంగారాన్ని పోలిన రెండో రకం బంగారం బిస్కెట్లు తయారీ చేసి తక్కువ ధరకు విక్రయిస్తూ కొనుగోలుదారులను మోసం చేస్తున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ధనార్జనే ధ్యేయంగా..
ధనార్జనే ధ్యేయంగా కొనుగోలుదారుల నమ్మకాన్ని సొమ్ము చేసుకునేందుకు కొందరు వ్యాపారులు బంగారం బిస్కెట్ల తయారీకి పూనుకున్నారు. గత 10 ఏళ్లుగా కొనుగోలు చేసిన పాత బంగారం కరిగించి బిస్కెట్ల రూపంలో తయారీ చేస్తున్నారు. దీనిని అసలు బంగారం ధర కంటే రూ.వెయ్యి నుంచి రెండు వేలు తక్కువకు విక్రయించి కొందరు స్వర్ణకారులు సోమ్ము చేసుకుంటున్నారని తెలిసింది. తక్కువ ధరకు బంగారు బిస్కెట్లను విక్రయిస్తుండటంతో స్వర్ణకారులు ఉపాధి కోల్పోతున్నారు. దీనినే అసలు బంగారంగా అంటగట్టి కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. 

సీపీకి ఫిర్యాదు చేసిన స్వర్ణకారుల సంఘం...
చెన్నూర్‌ పట్టణంలో కొందరు బంగారం వ్యాపారులు తానాజీ తేజ్‌ బట్టిలో పని చేస్తున్న మహారాష్ట్రకు చెందిన సోమ్‌నాధ్‌ చౌహాన్‌ అనే వ్యక్తి పాత బంగారం కరిగించి బిస్కెట్లు తయారీ చేసి అసలు బంగారం మాదిరిగా ముద్రలు వేస్తున్నారని ఈనెల 24న స్వర్ణకారుల సంఘం నాయకులు రామగుండం సీపీ సత్యనారాయణకు ఫిర్యాదు చేశారు. స్పందించిన సీపీ దీనిపై విచారణ జరపాలని జైపూర్‌ ఏసీపీకి ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. 

అసలు బంగారం బిస్కెట్లు ఇలా...
అసలు బంగారం బిస్కెట్లపై మూడు రకాల ముద్రాలు ఉంటాయి. కొన్ని బంగారం బిస్కెట్లపై 999.0 ముద్రించి ఉండడంతోపాటు కింద కంప్యూటర్‌ బార్‌కోడ్‌ ఉంటుంది. ఇక రెండో రకం 916 కేడీఏం, 85 కేడీఏం అనే ముద్రలతో పాటు హాల్‌మార్క్‌ ఉంటుంది. చెన్నూర్‌ పట్టణానికి చెందిన బంగారం వ్యాపారులు అసలు బంగారం బిస్కెట్లపై ఉండే కంప్యూటర్‌ హాల్‌మార్క్‌లను కరిగించిన పాత బంగారం బిస్కెట్లపై ముద్రించి మార్కెట్‌ ధర ఆధారంగా విక్రయాలు జరిపి ఒకపక్క  ప్రభుత్వాన్ని, మరో పక్క కొనుగోలుదారులను మోసం చేస్తున్నారు. ఈ వ్యవహారం చెన్నూర్, మంచిర్యాలతో పాటు గోదావరిఖని పట్టణాలు కేంద్రంగా సాగుతున్నట్లు తెలిసింది.  

నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
నిబంధనలకు విరుద్ధంగా బంగారం బిస్కెట్ల రూపంలో తయారు చేసి విక్రయిస్తే చర్యలు తీసుకుంటాం. బిస్కెట్‌ బంగారం తయారు చేస్తున్నట్లు మాకు ఫిర్యాదు అందలేదు. ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటాం.           

– ప్రవీణ్‌కుమార్, సీఐ, చెన్నూర్‌ 

మరిన్ని వార్తలు