బంగారు నగలు తాకట్టు పెట్టి..వేతనాల చెల్లింపు

19 May, 2021 03:28 IST|Sakshi

పారిశుద్ధ్య కార్మికుల వేతనాల చెల్లింపు

స్ఫూర్తిమంతంగా  నిలిచిన మహిళా సర్పంచ్‌

చిట్యాల: ఓ వైపు కరోనా విలయతాండవం.. మరోవైపు ప్రాణాలను ఫణంగా పెట్టి సేవలం దిస్తున్నా 3 నెలలుగా వేతనాలు అందలేదం టూ పారిశుధ్య కార్మికుల ఆవేదన.. దీంతో ఆ గ్రామ మహిళా సర్పంచ్‌ మనసు చివుక్కు మంది. ఇంకేముంది ఏకంగా తన ఒంటి మీదున్న నగలను తాకట్టు పెట్టి మరీ వారికి వేతనమిచ్చి ఉపశమనం కల్పించారు. స్ఫూర్తి మంతంగా నిలిచారు. అందరి మన్ననలు అందుకున్నారు. కరోనా కాలంలో కార్మికులు అందిస్తున్న సేవలు వెలకట్టలేనివని ఆ సర్పంచ్‌ అన్నారు.  నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడులో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. వెలిమి నేడు గ్రామ సర్పంచ్‌ దేశబోయిన మల్లమ్మ, ఉప సర్పంచ్‌ మశ్ఛేందర్‌ నడుమ పొసగడం లేదు.

అది కాస్తా ఉపసర్పంచ్‌పై అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టే వరకు వెళ్లింది. దీంతో నెలపాటు పంచాయతీ పాలన స్తంభించింది. మరోపక్క హరితహారం మొక్కలపై నిర్లక్ష్యం వహించారని కలెక్టర్‌ తనిఖీల్లో తేలడంతో 15 రోజులపాటు సర్పంచ్‌ మల్లమ్మపై సస్పెన్షన్‌ వేటుపడింది. ఈ క్రమంలో పంచాయతీ కార్యదర్శి సైతం కార్మికుల వేతనాల బిల్లులను సకాలంలో ఎస్‌టీఓలో సమర్పించలేదు. దీంతో మూడు నెలలుగా 18 మంది కార్మికుల వేతనాలు నిలిచిపోయాయి. 

వేతనాలందక ఇబ్బంది..
ప్రస్తుత కరోనా వైరస్‌ విజృంభణ తరుణంలో గ్రామంలో రోజుకు నాలుగైదు కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ప్రాణాలను లెక్కచేయకుండా పనిచేస్తున్న తాము వేతనాలందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వెంటనే వేతనాలివ్వాలని కార్మికులు ఇటీవల పంచాయతీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పదిరోజుల్లో వేతనాలివ్వకుంటే విధులకు హాజరుకాబోమని చెప్పారు. సమస్యను పరిష్కరించాలని సర్పంచ్‌ అధికారులకు మొరపెట్టుకున్నా స్పందన కరువైంది. దీంతో సర్పంచ్‌ ఆ కార్మికులకు కొంతమేరకైనా వేతనాలు చెల్లించాలని నిర్ణయించుకున్నారు. వెంటనే తన ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను బ్యాంకులో తాకట్టుపెట్టగా రూ.90వేలు వచ్చాయి. ఆ మొత్తాన్ని పారిశుద్ధ్య కార్మికులు, ఇతర సిబ్బందికి రూ.5వేల చొప్పున పంచారు. వెంటనే వారికి వేతనాలు విడుదల చేయాలని సర్పంచ్‌ మల్లమ్మ అధికారులను కోరారు.  

మరిన్ని వార్తలు