దాల్‌ మే కుచ్‌ కాలా హై! 

16 Apr, 2023 01:31 IST|Sakshi

అంగన్‌వాడీ కేంద్రాలకు కందిపప్పు సరఫరా టెండర్‌లో కాంట్రాక్టర్ల గోల్‌మాల్‌ 

సిండికేట్‌గా మారి గత టెండర్‌ ధరకన్నా ఏకంగా 54%అధికంగా కోట్‌ 

గతంలో కిలో పప్పు ధర రూ.114, తాజాగా రూ.176గా కోట్‌ చేసిన వైనం 

బహిరంగ మార్కెట్‌లో కిలో పప్పు రూ. 120లోపే 

టెండర్‌ రద్దు చేసిన మహిళా, శిశుసంక్షేమ శాఖ.. ‘జెమ్‌’ద్వారా టెండర్‌ పిలిచే యోచన 

సాక్షి, హైదరాబాద్‌: అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేసే కందిపప్పు టెండర్‌ దాఖలు ప్రక్రియలో కాంట్రాక్టర్ల కుమ్మక్కు తతంగం వెలుగుచూసింది. బహిరంగ మార్కెట్‌ ధర కంటే దాదాపు 50 శాతం అధికంగా ధరను సూచించి కాంట్రాక్టును దక్కించుకొనేందుకు ప్రయత్నించారు. దీన్ని గుర్తించిన రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆ టెండర్‌ ప్రక్రియనే రద్దు చేసింది. మళ్లీ టెండర్‌ పిలవాలని యోచిస్తోంది. 

54% పెంచేశారు...: రాష్ట్రంలోని 149 ఐసీడీఎస్‌ ప్రాజెక్టుల పరిధిలో 35,700 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వాటిలోగర్భిణులు, బాలింతలు 4,57,643 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులు 6,67,783 మంది నయోదయ్యారు. వారికి ఆరోగ్యలక్ష్మి కార్యక్రమం కింద సంపూర్ణ పోషకాహారాన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో అందిస్తున్నారు. గర్భిణి/బాలింతకు రోజుకు 30 గ్రాములు, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు చిన్నారులకు రోజుకు 15 గ్రాముల చొప్పున కందిపప్పును ఆహారంలో కలిపి వడ్డిస్తున్నారు.

ఈ లెక్కన నెలకు సగటున 500 మెట్రిక్‌ టన్నుల కందిపప్పు అవసరం. పప్పు సరఫరాకు రాష్ట్ర మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ టెండర్‌ పద్ధతిలో కాంట్రాక్టర్‌ను ఎంపిక చేస్తుంది. ఒకసారి ఎంపికైన కాంట్రాక్టర్‌ ఆరు నెలలపాటు కందిపప్పును సరఫరా చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా ప్రస్తుత వార్షిక సంవత్సరం తొలి 6 నెలల కోసం గత నెల అధికారులు టెండర్‌ పిలవగా 8 మంది పాల్గొన్నారు.

అయితే వారంతా కిలో కందిపప్పు ధరను రూ. 176కు కాస్త అటుఇటుగా పేర్కొన్నారు. గత టెండర్‌ ప్రక్రియలో కాంట్రాక్టర్‌ కోట్‌ చేసిన కనిష్ట ధర రూ. 114 కాగా... ఇప్పుడు ఆ ధర రూ.176కు పెరిగింది. అంటే ఏకంగా 54 శాతం అధికంగా ధర కోట్‌ అయింది. మరోవైపు బహిరంగ మార్కెట్‌లో కిలో కందిపప్పు ధర రూ. 120లోపే ఉంది. ఈ నేపథ్యంలో అధికారులు టెండర్‌ ప్రక్రియను రద్దు చేశారు. 

భవిష్యత్తులో పెరుగుతుందనే అంచనాతో... 
టెండర్‌లో పాల్గొన్న 8 మందిని వ్యక్తిగతంగా అధికారులు పిలిచి మాట్లాడగా మార్కెట్‌లో ప్రస్తుతం కందిపప్పు ధర తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్తులో పెరుగుతుందనే ఆలోచనతో ఈ రకంగా ధర కోట్‌ చేశామని వారు పేర్కొన్నట్లు తెలిసింది. అయితే గత రెండేళ్లలో కందిపప్పు ధర ఈ స్థాయిలో లేకపోవడం, త్వరలో పంట ఉత్పత్తులు సైతం చేతికి అందే సమయం ఉన్నప్పడు ఇంత ఎక్కువ ధరను కోట్‌ చేయడాన్ని తీవ్రంగా పరిగణించిన అధికారులు ఆ టెండర్‌ను రద్దు చేశారు.

అలాగే ఈసారి కాంట్రాక్టర్ల మార్పుపైనా దృష్టి సారించినట్లు తెలిసింది. ఇందులో భాగంగా ‘జెమ్‌’(గవర్నమెంట్‌ ఈ–మార్కెట్‌ప్లేస్‌) నేషనల్‌ పోర్టల్‌ ద్వారా టెండర్లు పిలిచే అంశాన్ని పరిశీలిస్తున్నారు. ఇందుకు ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని... అప్పటివరకు పాత కాంట్రాక్టర్‌కే తాత్కాలికంగా సరఫరా బాధ్యత అప్పగించాలని భావిస్తున్నట్లు తెలిసింది.  

మరిన్ని వార్తలు