Hand Writing Tips: రాత మారితే తలరాత మారుతుంది.. సులువైన ఈ టిప్స్‌ పాటిస్తే చాలు!

10 May, 2022 13:42 IST|Sakshi

పబ్లిక్‌ పరీక్షల్లో రీడింగ్‌తో పాటు రైటింగ్‌ స్కిల్‌ అవశ్యమంటున్న నిపుణులు 

పరీక్ష పత్రాలు దిద్దే వారిని ఆకర్షించేలా రాయాలంటూ సూచన 

బాలానగర్‌/హైదరాబాద్‌: అందమైన చేతిరాతతో ఏ పబ్లిక్‌ పరీక్ష అయినా మంచి మెరుగైన మార్కులు సాధించడానికి ఉపమోగపడుతుందని చేతి రాత నిపుణులు అంటున్నారు. అక్షరాలను ముత్యాల్లాగా రాసేవారికి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చెబుతున్నారు. పరీక్ష ఏదైనా విద్యార్థులు మంచి మార్కులు సాధించాలంటే చేతిరాత ఓ ఆయుధం అని ఉపాధ్యాయులు సైతం పేర్కొంటున్నారు. విద్యార్థులకు రాతతో పాటు పరీక్ష రాసే విధానంపై  నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు. 
పాటించాల్సిన మెలకువలు... 
చదవండి👉🏻 300 మందికి పైగా ఔట్‌సోర్సింగ్‌ జేపీఎస్‌లకు ఉద్వాసన 

ప్రశ్నకు జవాబు రాసే తీరు పరీక్ష పేపర్‌ దిద్దడానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉండరాదు. విద్యార్థులు రాసే సమాధానాలు ఉపాధ్యాయుడికి తెలుసన్న సంగతి గుర్తుంచుకోవాలి. 
జవాబు పత్రాలు ఆకట్టుకోవాలంటే పేజీకి 18 నుంచి 19 లైన్ల వరకు మించి రాయకూడదు.  
మెదటి లైను రాసే సమయంలో మార్జిన్‌ చేస్తూ సమాంతరంగా రాయకపోతే మిగతా లైన్లు క్రమపద్ధతిలో రావు. 
వరుస ముగింపులోని పదం పూర్తిగా ఉండేలా చూసుకోవాలి. అలా కాకుండా ఒక అక్షరం ఒక వరుసలో వచ్చి మిగిలిన అక్షరాలు మరో వరుసలో రాయకూడదు. అలా రాస్తే పరీక్ష పత్రాన్ని దిద్దేవారికి పూర్తి పదం త్వరగా అర్ధం కాకపోవచ్చు. 
అంకెలు రాసేటప్పుడు స్పష్టత లేకపోతే ఉపాధ్యాయుడు అర్ధం చేసుకోలేక మార్కులు వేయకపొవచ్చు. 
సైన్స్‌ (సామాన్య శాస్త్రం)లో బొమ్మలు గీస్తే ఆ బొమ్మల్లోని భాగాలు గుర్తించడంలో ఒక క్రమ పద్ధతిని పాటించాలి. 
కొన్ని పాఠశాల్లో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. అటువంటి విద్యార్థులు తప్పనిసరిగా తెల్ల కాగితాలపై సాధన చేయాలి. 
జవాబు పత్రం పైభాగంలో అంగుళం స్థలం వదలాలి. ఎడమ వైపు అదే స్థాయిలో మార్జిన్‌ విడిచిపెట్టాలి. కుడివైపున అర అంగుళం ఖాళీ విడిచి రాయాలి. 
గణితంకు సంబంధించి అంకెలు సక్రమంగా రాయాలి. 
వ్యాకరణ దోషాలు లేకుండా జాగ్రత్తపడాలి. జవాబులు రాయడం మెదలు పెట్టిన స్థలం నుంచి చివరి వరకు సమాంతరంగా రాయాలి. అక్షరాలు పైకి లేదా కిందికి రాయకూడదు. ఒక వరుస ఎలా రాస్తే మిగిలిన వరుసలు కూడా అలానే రావడంతో పాటు జవాబు పత్రం కూడా చూడ ముచ్చటగా చాలా ఆకర్షణీయంగా కనపడుతుంది. పదం పదం మధ్యలో తగిన ఖాళీ ఉండాలి. 
చదవండి👉 మనీషా సాబూ ఉన్నత పదవి

ఉపాధ్యాయుడి సూచనతో చదువు, చేతి రాతపై దృష్టి సారించా.. 
అక్షరాలు నీటిగా రాస్తే మీ చేతిరాత మార్కులను తెచ్చిపెడుతుందని మా ఉపాధ్యాయులు శ్రీశైలం అంటూండే వారు. ఆయన మాటలు నమ్మిన నేను పదో తరగతిలో కాస్లు ప్రారంభం నుంచే చేతిరాత మీద దృష్టి సారించా. ప్రతి రోజు హిందీ, తెలుగు, ఇంగ్లిష్‌ ఒక్కో పేపర్‌ చొప్పున రాస్తుండే వాడిని. ఇప్పుడు నా చేతి రాత నాకే చాలా అందంగా కనిపిస్తోంది. ఇది వరకు నాకే అర్థమయ్యేది కాదు. నా రాతను చూసి మా ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు మెచ్చుకుంటున్నారు. పదో తరగతి పరీక్షల్లో మంచిగా చదవడంతో పాటు నా చేతి రాతతో మంచి మార్కులు సాధిస్తా.      
– రవిశంకర్, విద్యార్థి, బాలానగర్‌ 

చేతి రాతతోనే ఎన్నో అంశాలు గుర్తుండిపోతాయి 
ఎవరైనా ఏదైనా అంశాన్ని పదిసార్లు చదివిన దానికంటే ఒకసారి రాస్తే చాలు గుర్తుండిపోతుంది. అందుకే నేను ప్రతి రోజూ చేతి రాతను ప్రాక్టీస్‌ చేస్తున్నా. ఉపాధ్యాయులు పెట్టే పరీక్షల్లో మంచి మార్కులు వస్తుండేవి. అంతే కాకుండా వేగంగా రాయడం అలవాటైంది. మా ఉపాధ్యాయులు నా కృషికి తగ్గ విధంగా గతంలో కంటే ఇప్పుడే మంచి మార్కులు వేస్తున్నారు. నా చేతి రాత బాగుంటుందని మెచ్చుకుంటున్నారు.  
– గౌతమి, బాలానగర్‌ 

చదువుతో పాటు చేతి రాత కూడా ముఖ్యమే.. 
ప్రతి విద్యార్థికి చదువుతో పాటు అందమైన చేతి రాత కూడా ముఖ్యమే. అందుకు సంబంధించిన ప్రాథమిక సూత్రాలు పాటించాలి. చేతి రాతే భవిష్యత్‌లో ప్రభావం చూపుతుంది. మంచి మార్కులు రావటానికి దోహదపడుతుంది. అందుకే నేను నా విద్యార్థులకు ముందుగా చదువుకంటే మీరు పరీక్షల్లో రాసే జవాబులు అర్థమయినప్పుడే ఉపాధ్యాయులకు మన మీద మంచి భావం ఏర్పడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ చేతి రాతను మంచిగా నేర్చుకొనేందుకు చేయూత అందిస్తున్నా.  
– ఎం.శ్రీశైలం, చేతి రాత నిపుణులు, బాలానగర్‌  

మరిన్ని వార్తలు