ఆషాఢం వచ్చిందంటే గోరింటాకు.. ఎందుకంటారు!

19 Jul, 2021 18:00 IST|Sakshi

అందాన్నిచ్చే గోరింటాకు

ఆషాఢంలో ఆధ్యాత్మికం, ఆరోగ్యం

మైదాకులో లక్ష్మీదేవి రూపం

గోరింటాకులో యాంటీ బ్యాక్టీరియా గుణాలు

జనగామ: ఆషాఢమాసాన్ని శూన్య మాసమంటారు. ఈ మాసంలో వివాహాది శుభకార్యాలకు దూరంగా ఉంటారు. కానీ ఈ మాసం అనేక పర్వదినాలకు పెట్టింది పేరుగా నిలుస్తుంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి విష్ణు ఆరాధనకు అత్యంత ముఖ్యమైన తిథి. దీనికి తొలి ఏకాదశి అని పేరు. ఇక్కడి నుంచి ప్రతి వారం, పదిహేను రోజులకోసారి ఏదో ఒక పండగ, వ్రతం, పూజ చేసుకుంటారు. తొలి ఏకాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం ప్రారంభిస్తారు. క్షణాయనం ప్రారంభమయ్యేది ఈ మాసంలోనే. ఆషాఢమాసం అందరూ గోరింటాకు తప్పక పెట్టుకోవాలని ఆయుర్వేద శాస్త్రజ్ఞులు చెబుతుంటారు. 

ఆషాఢ మాసం వచ్చిందంటే చాలు గోరింటాకు గుర్తుకు వస్తుంది. ఆషాఢం గడిచేలోగా ఏదో ఒక రోజు గోరింటాకు పెట్టుకోవాలని పూర్వీకుల నుంచి వస్తుంది. గోరింటాకు ఎరుపు రంగును ఇస్తుంది. ఎరుపు సూర్యునికి ప్రతీక. అరచేతిలో సూర్యుడిలా గుండ్రంగా పెడతారు. నెలవంక పైన చుక్క గోరింటాకు శరీరపు ఉష్ణోగ్రతను క్రమబద్ధం చేస్తుంది. ఈ సీజన్‌లో తొలకరి మొదలై వర్ష రుతువుగా మారి జోరుగా వర్షాలు కురుస్తాయి. వర్షం నీటిలోనే పనులు చేసుకునే సీజన్‌ ఇది.

శాస్త్రీయ ప్రయోజనాలు కూడా..
ముఖ్యంగా పొలం పనులు చేసుకునే రైతు కుటుంబాలు గంటల తరబడి నీటిలోనే పనిచేయాల్సి ఉంటుంది. దీంతో చర్యవ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది. గోరింటాకు యాంటీ బ్యాక్టీరియా గుణాలు కలిగి ఉంటుంది. ఇది పెట్టుకుని పనులు చేసిన వారికి వర్షంలో తడిసిపోయినా చర్యవ్యాధులు దరిచేరవు. వాతావరణంలో అకస్మాత్తుగా వచ్చే ఈ మార్పు వల్ల శరీరంలో కఫసంబంధమైన దోషాలు కూడా ఏర్పడే అవకాశం ఉంది.

వేడిని తగ్గించే గుణం ఉన్న గోరింటాకు బయట వాతావరణానికి అనుగుణంగా మన శరీరాన్ని చల్లబరుస్తుంది. ఇక ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం వెనుక పలు శాస్త్రీయ ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందం, ఆనందం కోసం గోరింటాకు పెట్టుకోవడం మొదలైంది. కాలక్రమేణ పట్టణ ప్రాంతాల్లో వేడుకలు చేసుకోవడం ఆచారంగా మారింది. పెళ్లయిన వారైతే వారి కడుపు, కాపురం కూడా చక్కగా పండుతాయని పెద్దలు అంటుంటారు. 

కొత్త పెళ్లి కూతురుకు అందం..
ఆషాఢంలో కొత్త పెళ్లి కూతురు తమ పుట్టింటికి చేరుకోవడం అనాధి నుంచి వస్తుంది. గోరింటతో చేతులను పండించుకునే వారి సౌభాగ్యాన్ని కాంక్షిస్తుందని నమ్ముతారు. కేవలం ఆషాఢ మాసంలోనే గోరింటాకు దొరుకుతుంది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కడపడితే అక్కడ కోన్లు అందుబాటులోకి వచ్చాయి. గోరింట మన శరీరానికి తాకినప్పుడు అందులో ఉండే లాసోన్‌ అనే సహజమైన రసాయనం వల్ల ఎరుపు రంగు ఏర్పడుతుంది.

కానీ చాలా రకాల కోన్లలో కృత్రిమంగా ఎరుపు రంగుని కలిగించే రసాయనాలు మిక్సింగ్‌ చేస్తున్నారు. వీటి వల్ల ఆరోగ్యం మాట అటుంచితే చర్మవ్యాధులు ఏర్పడే ప్రమాదం పొంచి ఉంది. మహిళలు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆషాఢంలో పుష్కలంగా లభించే గోరింటాకును మాత్రమే వాడుకునేలా ప్రాధాన్యతను ఇవ్వాలి.  గోరింటాకు అందం ఆరోగ్య, సౌభాగ్యానికి చిహ్నంగా నిలుస్తుంది.

అమ్మవారికి ప్రతీకగా..
ఆషాఢంలో గోరింటాకు పెట్టుకోవడం అనాదిగా వస్తుంది. గోరింటాకు అమ్మవారికి ప్రతీకగా భావిస్తారు. ఈ మాసంలో అమ్మవారిని శాకంబరీ మాతగా అలంకరిస్తారు. మైదాకులో లక్ష్మిదేవి రూపాన్ని చూసుకుంటారు. ఆషాఢంలో శుభగడియలు లేకున్నా వ్రతాలు, పూజలు చేసుకుంటారు.
– ఆరాధ్యశర్మ, వేదపండితులు, జనగామ 

మరిన్ని వార్తలు