కర్ణాటకలో గీత వృత్తిని పునరుద్ధరించాలి 

30 Dec, 2022 01:41 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గౌడ, ఈడిగ సామాజిక వర్గాల అభివృద్దికి సీఎం కేసీఆర్‌ ఎంతో కృషి చేస్తున్నారని ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కల్లు, గీత వృత్తిని పునరుద్ధరించాలని మంగళూరు నుంచి బెంగళూరు వరకు జేడీఎస్‌ పార్టీ నిర్వహిస్తున్న పాదయాత్రకు ఆయన సంఘీభావం తెలిపారు. గురువారం ఆయన కర్ణాటకలోని గుల్బర్గాలో పాదయాత్ర వాల్‌ పోస్టర్, ఆడియో సీడీలను ఆవిష్కరించారు.

అనంతరం విలేకరుల సమావేశంలో శ్రీనివాస్‌గౌడ్‌ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తాటి, ఈత చెట్ల పన్నును పూర్తిగా రద్దు చేశామని, గీత కార్మికులు ప్రమాదవశాత్తు తాటి, ఈత చెట్లపై నుంచి పడి మరణిస్తే బాధిత కుటుంబానికి రూ. 5 లక్షల సాయం ఇస్తున్నామని తెలిపారు. దేశంలో లేక్కడా లేని విధంగా తెలంగాణలో నీరా విధానాన్ని ప్రవేశపెట్టి, నీరాను ఒక్క గౌడ కులస్తులు మాత్రమే ఉత్పత్తి చేసేలా చూసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.

ఈడిగ, గౌడ సామాజిక వర్గాల అభివృద్ధికి, ఆర్థికంగా ఎదిగేందుకు ఎక్సైజ్‌ శాఖ ఆధ్వర్యంలోని వైన్‌ షాపులలో 15 శాతం రిజర్వేషన్లు కల్పించామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేడీఎస్‌ గుల్బర్గా జిల్లా అధ్యక్షుడు బాలరాజు, తెలంగాణ గౌడ సంఘం అధ్యక్షుడు పల్లె లక్ష్మణ్‌రావుగౌడ్, గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్‌ బాలగాని బాలరాజుగౌడ్, తెలంగాణ ఫిల్మ్‌ చాంబర్‌ చైర్మన్‌ ప్రతాని రామకృష్ణగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు