సమస్యలు నాకు వదిలేయండి.. గవర్నర్‌ తమిళిసై హామీ

8 Aug, 2022 02:00 IST|Sakshi

చదువుపై దృష్టి పెట్టండి 

బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులకు గవర్నర్‌ తమిళిసై సూచన

తొలిసారి క్యాంపస్‌కు రాక.. అణువణువూ పరిశీలన

విద్యార్థులతో కలిసి అల్పాహారం.. అండగా ఉంటానని హామీ 

బాసర సరస్వతీదేవి దర్శనం

ఆపై తెలంగాణ వర్సిటీ సందర్శన.. స్టూడెంట్స్‌తో ముఖాముఖి

భైంసా: ‘మీ డిమాండ్లు న్యాయమైనవి. అవన్నీ పరిష్కరించదగ్గవే. సమస్యలను నాకు వదిలేయండి.. చదువుపై దృష్టిపెట్టండి. మీ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా’అని రాష్ట్ర గవర్నర్, యూనివర్సిటీల చాన్స్‌లర్‌ తమిళిసై సౌందరరాజన్‌ బాసర ట్రిపుల్‌ ఐటీ (ఆర్జీయూకేటీ) విద్యార్థులకు హామీ ఇచ్చారు. 

తమ సమస్యలు పరిష్కరించాలంటూ విద్యార్థులు కొన్ని రోజులుగా ఆందోళన చేస్తున్న నేపథ్యంలో వర్సిటీ సందర్శన కోసం హైదరాబాద్‌ (కాచిగూడ) నుంచి శనివారం రాత్రి 11:30 గంటలకు రామేశ్వరం–ఓఖా సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరిన గవర్నర్‌ తమిళిసై.. అర్ధరాత్రి 2:40 గంటలకు నిజామాబాద్‌ స్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ఆదివారం వేకువజామున 4 గంటలకు బాసర చేరుకొని తొలుత వర్సిటీ గెస్ట్‌హౌస్‌లో 3 గంటలపాటు విశ్రాంతి తీసుకున్నారు. అనంతరం జ్ఞాన సరస్వతీదేవి ఆలయంలో అమ్మవారి దర్శనం చేసుకొని తిరిగి వర్సిటీకి చేరుకున్నారు.

6 గంటలు వర్సిటీలో..
క్యాంపస్‌లోని పరిసరాలను గవర్నర్‌ తమిళిసై తొలుత పరిశీలించారు. విద్యార్థుల వసతిగృహాలు, బాత్రూంలలో వసతులను చూశారు. విద్యార్థులతో కలసి తిరుగుతూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్‌లో వండిన వంటకాలను పరిశీలించారు. విద్యార్థులతో కలిసి అల్పాహారం చేశారు. తర్వాత అధికారులతో భేటీ అయ్యారు. ఆపై విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించారు. సుమారు 6 గంటలపాటు వర్సిటీలోనే గడిపారు.

మంచి భోజనం, వసతి, మెరుగైన బోధన కోరుతున్నారు.. 
వర్సిటీ నుంచి తిరుగు ప్రయాణంలో క్యాంపస్‌ ప్రధాన ద్వారం వద్ద గవర్నర్‌ తమిళిసై మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల ఇబ్బందులు న్యాయమైనవేనని.. వారంతా మంచి భోజనం, వసతి, మెరుగైన బోధన కావాలని అడుగుతున్నారని చెప్పారు. అవన్నీ కల్పించడం పెద్ద విషయమేకాదన్నారు. 2017 నుంచి ఇప్పటివరకు ప్రభుత్వం ల్యాప్‌టాప్‌లు ఇవ్వడంలేదని.. క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించడం లేదన్నారు. వర్సిటీలో సిబ్బంది కొరత, భద్రతాపరమైన ఇబ్బందులు తన దృష్టికి వచ్చాయన్నారు. విద్యార్థులకు తన వంతుగా నైతిక స్థైర్యం అందించానని గవర్నర్‌ తెలిపారు. విద్యార్థులకు తరచూ మెడికల్‌ చెకప్‌లు నిర్వహించాలని ఆదేశించినట్లు చెప్పారు. ఇకపై ఒక్కో సమస్య తీరుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు.

తెలంగాణ వర్సిటీలో పరిశోధనలు పెరగాలి..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్‌: తెలంగాణ విశ్వవిద్యాలయంలో పరిశోధనలు మరింత పెరగాలని గవర్నర్‌ తమిళిసై సూచించారు. నూతన ఆవిష్కరణలతోనే జాతీయ స్థాయిలో పేరు వస్తుందని, పరిశోధనలు అత్యున్నత స్థాయిలో ఉంటే తెలంగాణ యూనివర్సిటీని దేశంలోనే ఉన్నత స్థాయికి తీసుకుళ్లడానికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. ‘న్యాక్‌’ఏ–గ్రేడ్‌ ర్యాంకు సాధించేందుకు కృషి చేయాలన్నారు. ఆదివారం బాసర ట్రిపుల్‌ ఐటీ సందర్శన అనంతరం ఆదివారం మధ్యాహ్నం 12 గంటలకు నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీని గవర్నర్‌ సందర్శించారు. 

ఈ సందర్భంగా ఆమెకు ఎన్‌ఎస్‌ఎస్‌ కేడెట్లు, పోలీస్‌ సిబ్బంది గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఎంసీఏ కళాశాలలో విద్యార్థులతో తమిళిసై సమావేశమయ్యారు. అధ్యాపకులు, భవనాల కొరత గురించి విద్యార్థులు చెప్పగా అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. అనంతరం లైబ్రరీని, బాలికలు, బాలుర వసతిగృహాలను గవర్నర్‌ పరిశీలించారు. వర్సిటీ అతిథిగృహంలో భోజనం చేశారు. మధ్యాహ్నం 3:28 గంటలకు డిచ్‌పల్లి రైల్వేస్టేషన్‌ నుంచి అకోలా–తిరుపతి ఎక్స్‌ప్రెస్‌లో తిరిగి హైదరాబాద్‌కు బయలుదేరి వెళ్లారు. కాగా, గవర్నర్‌ పర్యటనలో కలెక్టర్‌ సహా ఇతర ఉన్నతాధికారులు ప్రొటోకాల్‌ పాటించలేదు.

వర్సిటీల సందర్శన తొలిసారి...
2008లో బాసర ట్రిపుల్‌ ఐటీ ఏర్పాడ్డాక విద్యార్థుల సమస్యలు తెలుసుకొనేందుకు ఒక గవర్నర్‌ క్యాంపస్‌ను సందర్శించడం ఇదే మొదటిసారి. అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించుకున్న తొలి గవర్నర్‌ తమిళిసై కావడం విశేషం. తెలంగాణ యూనివర్సిటీ ఏర్పాటయ్యాక క్యాంపస్‌కు వచ్చిన తొలి చాన్స్‌లర్‌ సైతం తమిళిసై సౌందరరాజనే కావడం గమనార్హం.

ఇది కూడా చదవండి: యాదాద్రి నిజాభిషేకంలో హైకోర్టు న్యాయమూర్తి

మరిన్ని వార్తలు