100% టీకా లక్ష్యం 

18 Oct, 2021 04:56 IST|Sakshi
డా. శ్రీనివాసరావు 

రాష్ట్రంలో సంపూర్ణ వ్యాక్సినేషన్‌ సాధనకు సర్కారు కార్యాచరణ 

గ్రామసభల్లో తీర్మానాలు చేయాలని సర్పంచ్‌లకు విజ్ఞప్తి 

వ్యాక్సిన్‌ వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించడమే ధ్యేయం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నూటికి నూరు శాతం కరోనా వ్యాక్సినేషన్‌ దిశగా ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళిక రూపొందించింది. గ్రామ సభలు నిర్వ హించడం ద్వారా లక్ష్యం సాధించాలని భావిస్తోంది. ఈ మేరకు గ్రామ సభలు నిర్వహించాల్సిందిగా సర్పంచులకు వైద్య ఆరోగ్యశాఖ విజ్ఞప్తి చేసింది. ఆయా సభల్లో సంపూర్ణ వ్యాక్సినేషన్‌ కోసం తీర్మా నాలు చేయాలని పిలుపునిచ్చింది. అన్ని జిల్లాల్లో ఎంపీటీసీ, సర్పంచులు మొదలు ఎమ్మె ల్యేల వరకు అందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయించింది.

తద్వారా ప్రజలు పూర్తిస్థాయిలో టీకాలు వేయించుకునేలా చూ డాలని భావిస్తోంది. అందులో భాగంగా 4 రో జుల క్రితం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో అవగాహన సదస్సు లు నిర్వహించారు. గ్రామసభ  లు నిర్వహించి వ్యాక్సినేషన్‌ సంపూర్ణంగా జరిగేలా తీర్మానాలు చేయాలని కోరినట్లు డాక్టర్‌ శ్రీనివాసరావు వెల్లడించారు. అన్ని జిల్లాల్లోనూ ఇలాంటి సదస్సులు చేపడతామని తెలిపారు.

కొనసాగుతున్న థర్డ్‌వేవ్‌ హెచ్చరికలు 
నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే థర్డ్‌ వేవ్‌ తప్పదనే హెచ్చరికలు వెలువడుతూనే ఉన్నాయి. ప్రతి ఒక్కరూ మాస్కు ధారణ సహా కరోనా జాగ్రత్తలన్నీ పాటించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అందరూ టీకాలు వేయించుకునేలా చూడాలని ప్రభు త్వాలను కోరుతున్నారు. అప్పుడే కరోనాను తుదముట్టించగలమని స్పష్టం చేస్తున్నారు.  

రెండు డోసులు తీసుకుంది 38 శాతమే 
ఈ నెల మొదటి వారం వరకు చూసుకుంటే 18 ఏళ్లు పైబడిన వారిలో మొదటి డోస్‌ టీకా తీసుకున్నవారు 70 శాతం మంది ఉన్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. అత్యధికంగా హైదరాబాద్‌లో మొదటి డోస్‌ వ్యాక్సినేషన్‌ నూటికి నూరు శాతం జరిగింది. ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 91 శాతం, రాజన్న సిరిసిల్ల జిల్లాలో 81 శాతం మొదటి డోస్‌ టీకా పొందారు. కాగా జోగుళాంబ గద్వాల జిల్లాలో అత్యంత తక్కువగా 45 శాతం మంది మాత్రమే మొదటి డోస్‌ టీకా పొందారు.

అలాగే వికారాబాద్‌ జిల్లాలో 46 శాతం, నాగర్‌కర్నూలులో 50 శాతం మంది అర్హులైనవారు టీకా పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇక సెకండ్‌ డోస్‌ తీసుకున్నవారు కేవలం 38 శాతమే ఉన్నారు. సెకండ్‌ డోస్‌ తీసుకున్నవారు హైదరాబాద్‌లో 51 శాతం ఉంటే, నారాయణపేట జిల్లాలో అత్యంత తక్కువగా కేవలం 14 శాతమే తీసుకున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో 18 శాతం, కొమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో 19 శాతం మంది సెకండ్‌ డోస్‌ తీసుకున్నారు. పట్టణాలతో పోలిస్తే గ్రామీణ ప్రాంతాల్లో టీకా తీసుకున్నవారు తక్కువగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే గ్రామాల్లో సైతం నూటికి నూరు శాతం వ్యాక్సినేషన్‌ లక్ష్యంగా కార్యాచరణ రూపొందించినట్లు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు.

మరిన్ని వార్తలు