మల్లన్నసాగర్:‌ కన్నీరు తుడవంగ..

10 Apr, 2021 11:00 IST|Sakshi

గజ్వేల్‌ మున్సిపాలిటీ పరిధిలోకి ముంపు గ్రామాల ప్రజలు

ఇప్పటికే రెండువేలకుపైగా కుటుంబాల రాక 

ఉద్విగ్న పరిస్థితుల మధ్య జీవనం

సాక్షి, గజ్వేల్‌: కన్నతల్లిలాంటి ఊరు.. అక్కడి మట్టితో బంధాన్ని తెంచుకుని.. కన్నీళ్లను దిగమింగుకుని మల్లన్నసాగర్‌ నిర్వాసితులు కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్నారు. పాత జ్ఞాపకాల స్థానే కొత్త ఆశలు.. ఆకాంక్షలతో సిద్దిపేట జిల్లా గజ్వేల్‌-ప్రజ్ఞాపూర్‌ మున్సిపాలిటీ పరిధిలోని ముట్రాజ్‌పల్లి ఆర్‌అండ్‌ఆర్‌ (రిహాబిలిటేషన్‌  అండ్‌ రీసెటిల్‌మెంట్‌) కాలనీలోకి చేరుకుంటున్నారు. ఇప్పటికే 2000కుపైగా కుటుంబాలు ఇక్కడికి వచ్చాయి. నిన్నమొన్నటి వరకు పచ్చని పంట పొలాలు, ప్రాణాధారంలాంటి చెరువులు, కుంటలు, పాడిపశువుల మధ్య స్వేచ్ఛగా గడిపిన వీళ్లంతా కాంక్రీటు వనంలో కొత్త అనుభవాలను ఎదుర్కోబోతున్నారు. నిర్వాసితుల ఉద్విగ్న పరిస్థితులపై ‘సాక్షి’ గ్రౌండ్‌ రిపోర్ట్‌.. 

ఉపాధిపై ఆందోళన 
మల్లన్నసాగర్‌ భూ నిర్వాసితుల కోసం గజ్వేల్‌ మున్సిపాలిటీలోకి వచ్చే ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌ గ్రామాల పరిధిలో రూపుదిద్దుకున్న ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీలో ఉద్విగ్న పరిస్థితులు నెలకొన్నాయి. మల్లన్నసాగర్‌ రిజర్వాయర్‌ నిర్మాణంతో తొగుట మండలం పల్లెపహాడ్, వేములఘాట్, ఏటిగడ్డ కిష్టాపూర్, లక్ష్మాపూర్, రాంపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లి, కొండపాక మండలం సింగారం, ఎర్రవల్లి గ్రామాలు పూర్తిగా ముంపునకు గురవుతున్న విషయం తెలిసిందే.

ప్రస్తుతం నిర్వాసితులంతా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీకి తరలివస్తున్నారు. ముంపు గ్రామాల ప్రజలు ఇప్పుడు కొత్త బతుకును వెతుక్కుంటున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సహాయ పునరావాసం పక్కనపెడితే... ఇకపై తమ ఉపాధి పరిస్థితి ఏమిటనే అంశంపై అనేకమంది ఆందోళన చెందుతున్నారు. ఇదే ఆవేదనతో చాలామంది కన్నీరు పెట్టుకుంటున్నారు.  

గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో.. 
ముంపు గ్రామాల ప్రజలకు 650 ఎకరాల్లో 6 వేల మందికి ఇళ్లు ఇవ్వాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ఇందుకోసం ముట్రాజ్‌పల్లి, సంగాపూర్‌లో గతంలో 300 ఎకరాలు సేకరించగా.. ఇటీవల మరో 350 ఎకరాలను సేకరించారు. నిర్వాసితులు కోరిన ప్రకారం ఇళ్లను ఎంత మందికి అవసరమైతే అంత మందికి నిర్మించి ఇవ్వడానికి గేటెడ్‌ కమ్యూనిటీ తరహాలో ముందే నిర్మాణ పనులను చేపట్టారు. ప్రభుత్వం కట్టే ఇళ్లు వద్దనుకునేవారికి ఇంటి నిర్మాణానికి అవసరమయ్యే రూ.5.04 లక్షలను అందిస్తున్నారు.

ఇప్పటికే 2,400 ఇళ్ల నిర్మాణం పూర్తికాగా 2 వేలకుపైగా పంపిణీ చేశారు. మరో 3,400 మందికి ఓపెన్‌ ప్లాట్లు పంపిణీ చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఇదిలా ఉండగా ఒక్కో ఇంటిని 250 గజాల్లో సుమారు 563 ఎస్‌ఎఫ్‌టీ వైశాల్యంతో నిర్మించారు. ఇంటి నిర్మాణానికి పోగా మిగిలిన భూమిలో రోడ్లు, ప్రభుత్వ కార్యాలయాలు, రెండు ఫంక్షన్‌ హాళ్లు, ఒక మార్కెట్, 8 అంగన్‌ వాడీ కేంద్రాలు, 3 ప్రాథమికోన్నత పాఠశాలలు, 2 జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలు నిర్మిస్తున్నారు. ఇళ్ల నిర్మాణాల కోసం రూ. 250 కోట్లు, ఇతర వసతుల కల్పన కోసం మరో రూ. 200 కోట్లకుపైగా ప్రభుత్వం వెచ్చిస్తోంది.

కొన్ని నెలలుగా నివాసం 
ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీని సకల సౌకర్యాలతో రూపొందిస్తున్నారు. ఇప్పటికే రాంపూర్, లక్ష్మాపూర్, ఎర్రవల్లి, సింగారం గ్రామస్తులు ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పక్కనే ఉన్న డబుల్‌ బెడ్‌రూమ్‌ మోడల్‌ కాలనీలో కొన్ని నెలలుగా నివాసముంటున్నారు. ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పనులు తుది దశకు చేరుకోవడంతో త్వరలోనే లక్ష్మాపూర్‌కు చెందిన 175 ఇళ్లు, ఎర్రవల్లికి చెందిన 553, సింగారానికి చెందిన 181 ఇళ్లలో కొత్తగా గృహ ప్రవేశాలు జరుగనున్నాయి.

కొన్ని రోజులుగా వేములఘాట్, పల్లెపహాడ్, ఏటిగడ్డ కిష్టాపూర్, బ్రాహ్మణ బంజేరుపల్లికి చెందిన నిర్వాసితులు ఇక్కడికి చేరుకుంటున్నారు. శుక్రవారం నాటికి దాదాపు 986 కుటుంబాలు కొత్త ఇళ్లలో గృహ ప్రవేశాలు చేశాయి. ఇదిలా ఉండగా ఆర్‌అండ్‌ఆర్‌ కాలనీ పనులను జిల్లా కలెక్టర్‌ వెంకట్రామిరెడ్డి నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. కాలనీలో పెండింగ్‌లో ఉన్న పనులను పూర్తి చేయడానికి ప్రత్యేక బృందాలు కృషి చేస్తున్నాయి.
చదవండి:  వైద్య సిబ్బందిని కిడ్నాప్ చేసిన మావోయిస్టులు
‌‌

మరిన్ని వార్తలు