‘1–5’ విద్యార్థులంతా పైతరగతులకే

20 Mar, 2021 03:25 IST|Sakshi

ప్రమోట్‌ చేయాలని నిర్ణయం

సోషియో ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ నివేదికలో వెల్లడించిన ప్రభుత్వం

6, 7, 8 తరగతులపై త్వరలోనే నిర్ణయం తీసుకునే అవకాశం  

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో ఒకటి నుంచి ఐదో తరగతి వరకు చదివే విద్యార్థులను ఎగువ తరగతులకు ప్రమోట్‌ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి 1 నుంచి 9, 10 తరగతులకు, ఫిబ్రవరి 25 నుంచి 6, 7, 8 తరగతులకు ప్రత్యక్ష బోధన ప్రారంభించగా ప్రాథమిక పాఠశాలల విద్యార్థులకు ప్రత్యక్ష బోధన చేపట్టవద్దని, వారిని పైతరగతులకు పంపాలని విద్యాశాఖ నిర్ణయించి నట్లు ప్రభుత్వం పేర్కొంది. సోషియో ఎకనామిక్‌ ఔట్‌లుక్‌ నివేదికలో ఈ విషయాన్ని తెలియజేసింది.

ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతుండగా ప్రత్యక్ష బోధన కొనసాగుతున్న పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బాగాంధీ బాలిక విద్యాలయాల్లోనూ కరోనా బారిన పడుతున్న విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. ఇదే విషయాన్ని ఎమ్మెల్యేలు సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో స్కూళ్లు, గురుకులాలు, హాస్టళ్లలో కరోనా కేసులు పెరుగుతున్నాయని, 2–3 రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీలోనే చెప్పారు. ఈ మేరకు 6, 7, 8 తరగతుల ప్రత్యక్ష బోధనను నిలిపివేసేలా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. 9వ తరగతి విషయంలోనూ ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది. బోర్డు ఎగ్జామ్స్‌ అయినందున పదో తరగతి విద్యార్థులకు ప్రత్యక్ష బోధన కొనసాగించే అవకాశం ఉంది.  

మరిన్ని వార్తలు