ప్రైవేటు చేతుల్లోకి విద్యుత్‌ పంపిణీ రంగం!

18 Feb, 2021 03:12 IST|Sakshi

విద్యుత్‌ పంపిణీ డీ లైసెన్స్‌డ్‌ చేస్తున్నాం..

ప్రస్తుత డిస్కంలు అలాగే కొనసాగుతాయి

పోటీగా ప్రైవేటు ఆపరేటర్లు వస్తారు

డిస్కంల వైర్లు వాడి వ్యాపారం చేస్తారు

కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ స్పష్టీకరణ..

‘విద్యుత్‌ బిల్లు’పై రాష్ట్రాలతో వీడియో కాన్ఫరెన్స్‌  

సాక్షి, హైదరాబాద్‌: ‘టెలికం రంగం తరహాలో విద్యుత్‌ పంపిణీ రంగాన్ని డీ లైసెన్స్‌డ్‌ చేస్తున్నాం. ప్రస్తుతమున్న విద్యుత్‌ పంపిణీ సంస్థ (డిస్కం)లు అలాగే ఉంటాయి. విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ (వైర్లు) నిర్వహణ డిస్కంల పరిధిలోనే ఉంటుంది. డిస్కంలకు పోటీగా ఎవరైనా ప్రైవేటు ఆపరేటర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీ పెట్టుకోవచ్చు. వీళ్లు ఎవరి నుంచైనా విద్యుత్‌ కొనుగోలు చేసి ఎవరికైనా అమ్ముకోవచ్చు. డిస్కంల వైర్లను వాడుకుని తమ వినియోగదారులకు విద్యుత్‌ అమ్ముకుంటారు. దీంతో విద్యుత్‌ పంపిణీ రంగంలో డిస్కంల గుత్తాధిపత్యం కనుమరుగవుతుంది..’అని కేంద్ర విద్యుత్‌ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్‌ పేర్కొన్నారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణల కోసం కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్‌ సవరణ బిల్లు–2020పై బుధవారం ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా రాష్ట్రాల విద్యుత్‌ శాఖ కార్యదర్శులు, విద్యుత్‌ సంస్థల సీఎండీలతో మాట్లాడారు.

‘ప్రైవేటు ఆపరేటర్లతో పోటీ పడి వినియోగదారులకు డిస్కంలు విద్యుత్‌ పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఎవరు తక్కువ ధరకు అమ్మితే వినియోగదారులు వారి వద్ద విద్యుత్‌ కొంటారు. పోటీతో వినియోగదారులకు తక్కువ ధరకే విద్యుత్‌ లభిస్తుంది..’అని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ‘ఇకపై డిస్కంలు రెండు రకాల వ్యాపారాలు చేయాలి. వినియోగదారులకు విద్యుత్‌ను అమ్ముకోవడంతో పాటు ప్రైవేటు ఆపరేటర్లతో వైర్ల వ్యాపారం చేయాలి. ప్రైవేటు ఆపరేటర్ల నుంచి విద్యుత్‌ కొనుగోలు చేసే వినియోగదారులపై డిస్కంలు విధించే వీలింగ్‌ చార్జీలు.. తమ సొంత వినియోగదారులతో సమానంగా ఉండాలి. వివక్షకు ఆస్కారం ఉండదు. ఫలాన వారికి వైర్లు ఇవ్వబోమని డిస్కంలు చెప్పడానికి వీల్లేదు..’అని ఆర్‌కే తెలిపారు. 

క్రాస్‌ సబ్సిడీ కోసం సెంట్రల్‌ ఫండ్‌..
ప్రస్తుతం పరిశ్రమలు, వాణిజ్యం, రైల్వే తదితర కేటగిరీల వినియోగదారులపై అధిక విద్యుత్‌ చార్జీలు విధించి, వ్యవసాయం, గృహ వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్‌ను డిస్కంలు పంపిణీ చేస్తున్నాయి. దీనిని క్రాస్‌ సబ్సిడీ అంటారు. విద్యుత్‌ టారీఫ్‌లో క్రాస్‌ సబ్సిడీని కొనసాగించడానికి ‘యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌’పేరుతో ప్రత్యేక ఫండ్‌ పెట్టనున్నామని ఆర్‌కే సింగ్‌ తెలిపారు. అదనంగా వసూలు చేసే మొత్తాన్ని ఈ ఫండ్‌లో జమా చేసి సబ్సిడీ వినియోగదారులకు ఇస్తామన్నారు. ఈ ఫండ్‌ కేంద్రం పరిధిలో ఉంటుందని వెల్లడించారు. అదనపు చార్జీలు వచ్చే ప్రాంతంలోని ఆపరేటర్లకు లాభాలు, సబ్సిడీ వినియోగదారులున్న ప్రాంతాల్లోని ఆపరేటర్లకు నష్టాలు రావచ్చు. లాభాల్లో ఉన్న ఆపరేటర్‌ నుంచి అదనపు చార్జీలను ఈ ఫండ్‌లో జమ చేసి నష్టాల్లో ఉండే ఆపరేటర్లకు బదిలీ చేస్తామని ఆయన వివరించారు. లాభాలు వచ్చే ప్రాంతాలను ఆపరేటర్లు ఎంపిక చేసుకోవడానికి అవకాశం ఉండదని, జిల్లాల వారీగా వారికి కేటాయింపులు చేస్తామని ఆయన తెలిపినట్టు సమాచారం. 

పీపీఏలన్నీ పంచుకోవాలి..
‘ప్రస్తుతం డిస్కంలు చేసుకున్న విద్యుత్‌ కొనుగోలు ఒప్పందా (పీపీఏ) లను తమ వద్దే పెట్టుకోవాలంటే అన్నింటిని పెట్టుకోవాలి. లేకుంటే ప్రైవేటు ఆపరేటర్లతో అన్నింటిని పంచుకోవాలి. అధిక విద్యుత్‌ ధరలు కలిగిన పీపీఏలను ప్రైవేటు ఆపరేటర్లకు వదులుకుని తక్కువ ధరలు కలిగిన వాటిని తమ వద్దే పెట్టుకుంటామంటే కుదరదు.. డిస్కంలు పీపీఏలను పంచుకోవడానికి ముందుకురాకుంటే ప్రైవేటు ఆపరేటర్లు కొత్త పీపీఏలు చేసుకుంటారు..’అని ఆర్‌కే సింగ్‌ వెల్లడించారు.

ప్రైవేటు గుత్తాధిపత్యానికి నో చాన్స్‌..
భవిష్యత్తులో ప్రైవేటు ఆపరేటర్లందరినీ ఓ ప్రైవేటు కంపెనీ కొనేసి ప్రైవేటు గుత్తాధిపత్యానికి తెరతీయడానికి అవకాశం ఇవ్వకుండా విద్యుత్‌ బిల్లులో ఏమైనా రక్షణ కల్పిస్తారా? అని రాష్ట్రాల అధికారులు ప్రశ్నించినట్టు తెలిసింది. ఎవరు తక్కువ ధరకు విద్యుత్‌ అమ్మితే వినియోగదారులు వారి వద్ద కొంటారని, ప్రైవేటు గుత్తాధిపత్యానికి అవకాశం ఉండదని కేంద్రమంత్రి స్పష్టం చేసినట్టు తెలిసింది. వినియోగదారులు తక్కువ ధరకు విద్యుత్‌ ఇచ్చే కంపెనీకి మారితే వారికి అదే మీటర్‌ కొనసాగిస్తారా? విద్యుత్‌ చౌర్యానికి ఎవరు బాధ్యులు? కేసులెవరు పెట్టాలి? మీటర్‌ రీడింగ్‌ ఎవరు తీస్తారు? మీటర్లను ఎవరు నిర్వహిస్తారు? అన్న అంశాలపై పరిశీలన చేస్తామని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. అప్పీలేట్‌ ట్రిబ్యునల్‌ ఫర్‌ ఎలక్ట్రిసిటీ (అప్టెల్‌) ప్రాంతీయ బెంచ్‌ను దక్షిణాదిలో ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా దక్షిణాది రాష్ట్రాలు కోరాయి.

మరి ఉద్యోగుల పరిస్థితేంటి?: ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ 
విద్యుత్‌ సవరణ బిల్లు–2020ను వ్యతిరేకిస్తూ రాష్ట్ర మంత్రి వర్గం చేసిన తీర్మానికి కట్టుబడి ఉన్నామని తెలంగాణ జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు కేంద్రమంత్రికి తెలియజేశారు. తెలంగాణ డిస్కంలలో పెద్ద సంఖ్యలో ఉద్యోగులున్నారని, ప్రైవేటు ఆపరేటర్లకు అనుమతిస్తే వారి గతేంటని ఆయన కేంద్రమంత్రిని ప్రశ్నించారు. ప్రస్తుతం మీటర్‌ రీడింగ్‌ నుంచి విద్యుత్‌ బిల్లులు వసూలు చేయడం వరకు అన్ని పనులు ప్రైవేటు/ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులే చేస్తున్నారని కేంద్రమంత్రి బదులిచ్చినట్టు తెలిసింది. ప్రైవేటు ఆపరేటర్లతో విద్యుత్‌ ఉద్యోగులపై ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేసినట్టు సమాచారం. ప్రైవేటు ఆపరేటర్లతో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలు పుట్టుకొస్తాయని, ప్రస్తుత ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు అక్కడికి వెళ్తారని ఆయన చెప్పినట్టు సమాచారం. తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్‌ కొనుగోలు నిబంధన ఆచరణలో తెలంగాణకు సాధ్యం కాదని, ఈ విషయంలో జరిమానా విధించాలన్న యోచనను వెనక్కి తీసుకోవాలని ప్రభాకర్‌రావు కేంద్రమంత్రి ఆర్‌కే సింగ్‌ను కోరారు. ఈ విషయంపై పరిశీలన చేస్తామని ఆయన హామీ ఇచ్చినట్టు తెలిసింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు