ప్రభుత్వ ఆస్పత్రుల్లో సత్వరం పోస్టుల భర్తీ 

8 Aug, 2021 04:53 IST|Sakshi

జిల్లా ఆస్పత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్ల ఏర్పాటు

వైద్య, ఆరోగ్యశాఖ సమీక్షలో సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌

సాక్షి, హైదరాబాద్‌: కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీపై ప్రభుత్వం దృష్టి సారించింది. వెంటనే పోస్టులన్నింటినీ భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ వైద్య, ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు. శనివారం సచివాలయంలో వైద్య, ఆరోగ్య శాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆస్పత్రుల్లో మౌలిక వసతులు, సదుపాయాలను బలోపేతం చేయాలని సూచించారు. రాష్ట్రంలోని ప్రధాన ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ఉత్పత్తి ప్లాంట్లు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు గదుల నిర్మాణాల ఆవశ్యకతను సమీక్షించి ఇప్పటికే పనులు ప్రారంభించిన వాటి పురోగతి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్రంలోని అన్ని బోధనాస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో పీడియాట్రిక్‌ ఆక్సిజన్, పీడియాట్రిక్‌ ఐసీయూ పడకలను పెంచాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, వ్యాక్సినేషన్‌ కోసం మిగిలిన వారందరినీ గుర్తించేందుకు ప్రత్యేకంగా ‘‘మాప్‌ అప్‌ డ్రైవ్‌’’నిర్వహించాలని సూచించారు. సమావేశంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్‌.ఏ.ఎం.రిజ్వీ, ప్రజారోగ్య విభాగం సంచాలకుడు డాక్టర్‌ శ్రీనివాసరావు, వైద్య, విద్య సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డి, టీఎస్‌ఎంఐడీసీ ఎండీ చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు