50 ఏళ్లు దాటిన వారికే తొలి టీకా

26 Nov, 2020 02:07 IST|Sakshi

ఏడాదిలోపు పిల్లలకు.. 75 ఏళ్లు దాటినా నో టీకా

సాక్షి, హైదరాబాద్‌: కరోనా టీకాను మొదటి విడతలో యాభై ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. కరోనా టీకా అందుబాటులోకి వచ్చిన వెంటనే ఎలా పంపిణీ చేయాలనే దానిపై వైద్య, ఆరోగ్యశాఖ బుధవారం నుంచి కార్యాచరణను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా కరోనా టీకాను వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా మార్చిలో ఇచ్చే అవకాశముందని అంచనా. ప్రధాని నరేంద్రమోదీ మంగళవారం కరోనా వ్యాక్సిన్‌పై రాష్ట్రాల సీఎంలతో సమావేశమైన సంగతి తెలిసిందే. ఇందులో ఎవరెవరికి తొలుత టీకా ఇవ్వాలనే దానిపై చర్చ జరిగింది. అలాగే టీకా నిల్వ, పంపిణీ అంశాలపైనా చర్చించారు. టీకా అందరికీ ఉచితంగానే  వేస్తారని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ టీకాను అందుబాటులో ఉంచుతారని, వాటిల్లో టీకాకు ధర ఉండదని, వేసినందుకు చార్జి వసూలు చేస్తారని అంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. 

వీరికి టీకా లేదు!
75 ఏళ్లు పైబడినవారికి, ఏడాదిలోపు పిల్లలకు మాత్రం కరోనా టీకా ఇచ్చే అవకాశం లేదు. వీరికి టీకా ఇవ్వడం వల్ల దుష్ప్రభావాలు చూపే అవకాశం ఉందన్న భావనతో ఇవ్వకూడదని భావిస్తున్నారు. దీనిపై నిపుణులతో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.

టీకా వేసేది వీరే..
కరోనా టీకా వేసే బాధ్యత పూర్తిగా నర్సులు, ఏఎన్‌ఎం, ఆశ కార్యకర్తలదేనని వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు తెలిపా యి. వారికి టీకాలు వేయడంపై అవగాహన ఉన్నందున ఇబ్బందులుండవని అంటున్నారు. అయినా, వీరికి  శిక్షణ ఇవ్వనున్నారు. టీకా వేశాక ఎక్కడైనా ఎవరికైనా సమస్యలు తలెత్తితే చర్యలు తీసుకునేందుకు వీలుగా యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తారు. అందుకోసం ప్రత్యేక వైద్యదళాన్ని ఏర్పాటుచేస్తారు.

నిల్వ, పంపిణీ, రవాణా ఇలా..
టీకాను తయారుచేసే కంపెనీల నుంచి దాన్ని తెచ్చి నిల్వ ఉంచాలంటే ప్రత్యేక జాగ్రత్తలు తప్పనిసరి. కొన్ని కంపెనీలు తయారుచేస్తున్న టీకా మైనస్‌ 70 డిగ్రీల వద్ద నిల్వ ఉంటే, కొన్ని టీకాలు మైనస్‌ 20 డిగ్రీల వద్ద నిల్వ ఉంచవచ్చు. అయి తే, ఏ కంపెనీల టీకాలు మన వద్దకు వస్తాయన్న దానిపై స్పష్టత లేదు. అయితే టీకాల నిల్వకు కోల్డ్‌చైన్‌ వ్యవస్థను సిద్ధం చేసుకోవాలని వైద్య,ఆరోగ్యశాఖ టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ అధికారులను ఆదేశించింది.

తొలి విడతలో వీరికే..
 తొలి విడతలో యాభై ఏళ్లు దాటిన వారందరికీ ఇవ్వాలని తెలంగాణ సర్కారు సూత్రప్రాయంగా నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోని వైద్యులు, నర్సులు, పారామెడికల్‌ సిబ్బంది సహా పారిశుద్ధ్య కార్మికులకూ ఇవ్వనుంది. కరోనాపై ముందుండి పోరాడుతున్న పోలీసులు, జర్నలిస్టులు, మున్సిపల్‌ సిబ్బంది సహా పలు శాఖల్లోని వారికీ తొలి విడతలోనే ఇవ్వనున్నారు. ఇంకా, వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతున్న యాభై ఏళ్లలోపు వారికీ తొలి విడతలోనే ఇవ్వాలని నిర్ణయించినట్లు అధికారులు చెబుతున్నారు. 

రెండో విడతలో అందరికీ..
మొదటి విడతలో టీకా ఇచ్చిన తర్వాత మిగిలిన వారందరికీ రెండో విడతలో ఇస్తారు. మరోవైపు మొదటి విడతలో మనకంటే ముందు టీకాను తీసుకునే దేశాల నుంచి వచ్చే ఫీడ్‌బ్యాక్‌ ఆధారంగా మార్పుచేర్పులు జరిగే అవకాశం ఉంది. ఇక దేశవ్యాప్తంగా మొదటి విడతలో 30 కోట్ల మందికి టీకా వేస్తారు. తెలంగాణలో దాదాపు 70 నుంచి 75 లక్షల మందికి మొదటి విడతలో వేసే అవకాశాలున్నాయి. ప్రతి ఒక్కరికీ రెండు డోసుల టీకా వేస్తారు. ఒకసారి వేసిన తర్వాత సరిగ్గా నాలుగు వారాలకు అంటే నెలకు మరో డోస్‌ వేస్తారు. దీన్ని ఇంజక్షన్‌ రూపంలోనే ఇస్తారు. 

ఆ వయసు వారికి ఇవ్వకపోవడమే మంచిది..
ఇప్పటికే ఉన్న సమాచారం ప్రకారం ట్రయల్స్‌లో ఉన్న పలు కోవిడ్‌ వ్యాక్సిన్ల సామర్థ్యం ఎక్కువే అయినా.. ప్రతి వ్యాక్సిన్‌కు ఉండే ప్రాణాంతక రియాక్షన్లు దీనికీ ఉండొచ్చు. కాబట్టి వివిధ శారీరక సామర్థ్యాలు తక్కువుండే ఏడాదిలోపు పిల్లలు, 75 ఏళ్లు పైబడిన వృద్ధులకు తొలిదశలో వ్యాక్సిన్‌ ఇవ్వకపోవడం ఉత్తమం. అందులోనూ వీరిలో చాలామంది ఇంటికే పరిమితమై ఉంటారు కనుక వైరస్‌ సోకే అవకాశమూ తక్కువే.
– డాక్టర్‌ కిరణ్‌ మాదల, క్రిటికల్‌ కేర్‌ విభాగాధిపతి, నిజామాబాద్‌ ప్రభుత్వ మెడికల్‌ కళాశాల

టీకా ఏ కంపెనీదో తెలిస్తే..
కరోనా వ్యాక్సిన్‌ ఏ కంపెనీది వస్తుందనే స్పష్టత ఉంటే అప్పుడు ఎలాంటి కోల్డ్‌చైన్‌ వ్యవస్థ అవసరమో అర్థమవుతుంది. కొన్ని వ్యాక్సిన్లను తక్కువ శీతలీకరణలో భద్రపరచవచ్చు. కొన్నింటిని ఎక్కువ శీతలీకరణలో భద్రపరచాలి. ఆ స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాం. ఇప్పటికే వివిధ రకాల టీకాలను భద్రపరిచే శీతలీకరణ వ్యవస్థ మన వద్ద ఉంది. వాటిలో కూడా కరోనా వ్యాక్సిన్‌ను నిల్వ ఉంచడానికి అవకాశం ఉండొచ్చు. వ్యాక్సిన్‌ నిల్వ, రవాణాకు సంబంధించి ఏం చేయాలనే దానిపై కసరత్తు జరుగుతోంది. వీటికి సంబంధించి మాకు ఆదేశాలొచ్చాయి.    
– చంద్రశేఖర్‌రెడ్డి, ఎండీ, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు