128 మంది బాలురు.. బిగపట్టుకుని.. ఒకరి తరువాత ఒకరు

16 Dec, 2021 12:54 IST|Sakshi

సాక్షి, వేములవాడ(కరీంనగర్‌): విద్య, వైద్యం కోసం ప్రభుత్వం ప్రత్యేక బడ్జెట్‌ కేటాయిస్తూ ఎలాంటి లోటుపాట్లు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో ఆ దిశగా పనులు కనబడడం లేదు. చాలా ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలు ఉన్నప్పటికీ కొన్ని పాఠశాలల్లో మాత్రం ఏళ్లుగా సమస్యలు పరిష్కారం కాక విద్యార్థులు ప్రతిరోజు ఇబ్బందులు పడుతున్నారు.

ఇందుకు ఉదాహరణే వేములవాడ రూరల్‌ మండలంలోని 17 గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లోని వసతులు. ఇందులో ప్రధానంగా ఫాజుల్‌నగర్‌ మండల పరిషత్‌ పాఠశాలలో అసౌకర్యాల మధ్య పిల్లలు రోజూ ఇబ్బందులు పడుతున్నారు. 1వ తరగతి నుంచి ఐదోతరగతి వరకు 128 మంది పిల్లలు ఉన్నారు. వీరికి మూడు గదులు మాత్రమే ఉన్నాయి.

రెండు గదులు చాలా ఏళ్లుగా నిరుపయోగంగా ఉండడంతో వాటిని వినియోగించడం లేదు. ఇక బాత్‌రూంల పరిస్థితి చెప్పనక్కర్లేదు. 128 మందికి ఒకే బాత్‌రూం ఉండడంతో ఒకరి తర్వాత ఒకరు క్యూ కట్టాల్సిందే.

ఒకరు వెళ్లారంటే మిగితా వారు బిగపట్టుకుని వచ్చేవారి కోసం ఎదురుచూడాల్సిందే. ఇలా మండంలోని నమిలిగుండుపల్లి తదితర గ్రామాల్లో కూడా ఇలాంటి పరిస్థితుల మధ్య విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు దృష్టిసారించి సమస్యలు పరిష్కరించాలని చిన్నారుల తల్లిదండ్రులు, విద్యాకమిటీ చైర్మన్లు కోరుతున్నారు.   

చదవండి: నాలుగు రోజుల్లో పెళ్లి.. యువకుడి అదృశ్యం

మరిన్ని వార్తలు