మేడిగడ్డ ఇంజనీర్లపై త్వరలో వేటు

4 Mar, 2024 01:29 IST|Sakshi

వర్క్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్ల జారీపై సర్కారు సీరియస్‌ 

ఈఈ, ఎస్‌ఈలకు త్వరలో షోకాజ్‌ నోటీసులు.. ఆపై సస్పెన్షన్‌కు నిర్ణయం 

తప్పుడు మార్గంలో సర్టిఫికెట్ల జారీతో సర్కారుకు తలనొప్పులు 

బ్యారేజీ పునరుద్ధరణ పనుల ఖర్చు భరించేందుకు నిరాకరిస్తున్న ఎల్‌ అండ్‌ టీ 

సాక్షి, హైదరాబాద్‌: మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం పూర్తయిందని ధ్రువీకరిస్తూ నిర్మాణ సంస్థ ఎల్‌ అండ్‌ టీకి తప్పుడు మార్గంలో వర్క్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్లు జారీ చేసిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ (ఈఈ), సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ (ఎస్‌ఈ)లపై చర్యలకు నీటిపారుదల శాఖ సిద్ధమైంది. తొలుత షోకాజ్‌ నోటీసులు జారీ చేసి సంజాయిషీ కోరాలని, ఆ తర్వాత సస్పెన్షన్‌ వేటు వేయాలని నిర్ణయం తీసుకుంది. ఒప్పందంలోని నిబంధనల మేరకు నాణ్యత, రక్షణా ప్రమాణాలు పాటిస్తూ బ్యారేజీ నిర్మాణ పనులను పూర్తి చేసినట్లు ధ్రువీకరిస్తూ 2019 సెప్టెంబర్‌ 10న మహదేవపూర్‌ డివిజన్‌–1 ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తిరుపతిరావు ఎల్‌ అండ్‌ టీకి ‘సబ్‌స్టాన్షియల్‌ కన్‌స్ట్రక్షన్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌’ను జారీచేశారు.

దానిపై నాటి సూపరింటెండింగ్‌ ఇంజనీర్, ప్రస్తుత మహబూబ్‌నగర్‌ జిల్లా చీఫ్‌ ఇంజనీర్‌ రమణారెడ్డి కౌంటర్‌ సంతకం చేశారు. నిర్మాణ సంస్థ విజ్ఞప్తి మేరకు 2021 మార్చి 15న పనులు పూర్తయినట్లు ధ్రువీకరిస్తూ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ తిరుపతిరావు మళ్లీ సర్టిఫికెట్‌ జారీ చేశారు. మరోవైపు ఒప్పందం గడువును 2022 మార్చి 31 వరకు పొడగిస్తూ ఈఎన్‌సీ ఆరోసారి పొడిగింపు ఉత్తర్వులు జారీచేశారు. పలు అంశాల్లో నిబంధనలకు అనుగుణంగా పనులు చేయనందుకుగాను నిర్మాణ సంస్థకు జారీ చేసిన నోటిసులను పట్టించుకోకుండా రూ. 159.72 కోట్ల సెక్యూరిటీ డిపాజిట్‌ను సైతం విడుదల చేశారు.

2020 ఫిబ్రవరి 29 నుంచి డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ వర్తిస్తుందని నాటి ఈఎన్‌సీ రామగుండం నల్లా వెంకటేశ్వర్లు జారీ చేసిన ఉత్తర్వులకు విరుద్ధంగా సెక్యూరిటీ డిపాజిట్‌ను ని ర్మాణ సంస్థకు తిరిగి ఇచ్చేశారు. విజిలెన్స్‌ దర్యాప్తు ఆధారంగా నాటి ఈఎన్‌సీ సి.మురళీధర్, రా మగుండం ఈఎన్‌సీ నల్లా వెంకటేశ్వర్లు ను ప్రభు త్వం తొలగించడం తెలిసిందే. వర్క్‌ కంప్లీషన్‌ సర్టిఫికెట్‌ జారీ వెనక మతలబు ఉందని విజిలెన్స్‌ విభాగం తేల్చినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రకటించారు.

ఈ సర్టిఫికెట్లను ఆధారంగా చూపి డిఫెక్ట్‌ లయబిలిటీ పీరియడ్‌ ముగిసిందంటూ మేడిగడ్డ పునరుద్ధరణను సొంత ఖర్చులతో చేపట్టేందుకు ఎల్‌ అండ్‌ టీ నిరాకరిస్తోంది. ఒప్పందం ప్రకారం కాంట్రాక్టర్‌కు తుది బిల్లు జారీ కాకపోయినా ఈ సర్టిఫికెట్లను జారీ చేసినట్లు ఆరోపణలు రావడం నీటిపారుదల శాఖకు అప్రతిష్టగా మారింది. ఇద్దరు అధికారులు చేసిన తప్పులకు మొత్తం శాఖ బద్నాం అయిందని, వారిపై చర్య లు తీసు కోవాల్సిందేనని ఉన్నతస్థాయి అధికార వర్గాలు ప్రభుత్వానికి సిఫారసు చేసినట్లు తెలిసింది.  

whatsapp channel

మరిన్ని వార్తలు