‘వ్యాక్సిన్‌’ కోసం లక్షమంది వివరాలు..

17 Nov, 2020 08:33 IST|Sakshi

కరోనా వ్యాక్సిన్‌ వస్తే.. తొలుత వారియర్స్‌కు ఇచ్చేందుకు వివరాల సేకరణ 

ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగాల్లో మొత్తంగా 7 లక్షల మంది వైద్య సిబ్బంది 

సాక్షి, రంగారెడ్డి జిల్లా: కరోనా వైరస్‌ ఉధృతి కొనసాగుతూనే ఉంది. ఒకపక్క యంత్రాంగం, ప్రజలు దీనితో పోరాడుతుండగా.. మరో పక్క దీనికి చెక్‌పెట్టే వ్యాక్సిన్‌ తయారీలో దేశవ్యాప్తంగా 9 ఫార్మా కంపెనీలు నిమగ్నమయ్యాయి. టీకాలు వచ్చే ఏడాది తొలి త్రైమాసికంలో అందుబాటులోకి వస్తాయని వైద్య నిపుణులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంచనా వేస్తున్నాయి. ఈక్రమంలో కరోనా ను ఖాతరు చేయకుండా ప్రాణాలను పణంగా పెట్టి వైద్యులు, సిబ్బంది సేవలందిస్తున్న విషయం తెలిసిందే. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాగానే తొలుత ఈ ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌కే ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగా నేషనల్‌ హెల్త్‌ మిషన్‌ (ఎన్‌హెచ్‌ఎం) ఆధ్వర్యంలో హెల్త్‌కేర్‌ వర్కర్స్‌ డేటాబేస్‌ను రూపొందిస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులు, మెడికల్‌ కాలేజీల్లో పనిచేస్తున్న డాక్టర్లు, పారామెడికల్‌ స్టాఫ్‌ తదితర సిబ్బంది సమాచారాన్ని రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సేకరిస్తున్నారు. మొత్తంగా తొమ్మిది కేటగిరీల్లో వివిధ క్యాడర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు తీసుకుంటున్నారు. 

ఇప్పటికే ప్రభుత్వ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న అన్ని క్యాడర్లలో కలిపి సుమారు లక్ష మంది వివరాలను సేకరించారు. జనరల్, జిల్లా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్‌సెంటర్లు, పీహెచ్‌సీలు, యూపీహెచ్‌సీలు, హెల్త్‌ అండ్‌ వెల్‌నెస్‌ సెంటర్లు, డిస్పెన్సరీలు, ఆయుష్‌ ఆస్పత్రులు, మథర్‌ అండ్‌ చైల్డ్‌ కేర్‌ సెంటర్లు తదితరాల్లో పనిచేస్తున్న వీరందరి వివరాలు ఆరా తీస్తున్నారు. ఈ డేటాను వెబ్‌సైట్‌లో నమోదు చేస్తున్నారు. ఇక ప్రైవేటు రంగంలోని వివిధ స్థాయిల ఆస్పత్రులు, మెడికల్‌ కళాశాలలు, నర్సింగ్‌ హోంలు, పాలిక్లినిక్‌లు, ఎన్‌జీఓ వసతి కేం ద్రాల్లోని స్టాఫ్‌ వివరాల సేకరణ కొనసాగు తోంది. ఈ ప్రక్రియను వచ్చేనెల 10లోపు పూర్తిచేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నారు. (చదవండి: కీలక దశకు దేశీయ కరోనా వ్యాక్సిన్)

నాలుగంచెల్లో సమన్వయం 
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యులు, పారా మెడికల్‌ తదితర కేటగిరీల్లోని మొత్తం 7 లక్షల మంది వివరాలను వైద్య ఆరోగ్యశాఖ సేకరిస్తోంది. ఇందులో ప్రైవేటు రంగంలోనే అత్యధికంగా 6 లక్షల మంది ఉండొచ్చని అంచనా. వివరాల సేకరణ ప్రక్రియ సమన్వయానికి 4 అంచెల్లో ప్రత్యేక కమిటీలు ఏర్పాటయ్యాయి. నేషనల్‌ స్టీరింగ్‌ కమిటీ, రాష్ట్ర స్టీరింగ్‌ కమిటీ, స్టేట్‌ టాస్క్‌ఫోర్స్, జిల్లా టాస్క్‌ఫోర్స్‌.. ఇవి సమన్వయం చేస్తున్నాయి. ఫ్రంట్‌లైన్‌ హెల్త్‌ వర్కర్స్‌ అయిన ఏఎన్‌ఎంలు, ఆశ కార్యకర్తలు, సూపర్‌వైజర్లు, అంగన్‌వాడి టీచర్లు, నర్సులు/సూపర్‌వైజర్లు, మెడికల్‌ ఆఫీసర్లు, పారామెడికల్‌ స్టాఫ్, సపోర్ట్‌ స్టాఫ్, మెడికల్‌ విద్యార్థులు, సైంటిస్టులు/రిసెర్చ్‌ స్టాఫ్, క్లరికల్‌/అడ్మినిస్ట్రేటివ్‌ స్టాఫ్, ఇతర ఆరోగ్య వైద్య సిబ్బంది కేటగిరీల్లో పనిచేస్తున్న వారినీ పరిగణనలోకి తీసుకున్నారు. ఒక్కో మెడికల్‌ స్టాఫ్‌కు సంబంధించి 24 అంశాల్లో వివరాలు సేకరిస్తున్నారు. వ్యక్తి పేరు, పుట్టిన తేదీ, గుర్తింపు కార్డు, మొబైల్‌ నంబర్, పోస్టల్‌ కోడ్, గుర్తింపు కార్డు, పనిచేస్తున్న ఆస్పత్రి పేరు, ఏరియా, కేటగిరీ తదితర సమాచారాన్ని తీసుకుంటున్నారు. 

>
మరిన్ని వార్తలు