హైదరాబాద్‌ నగరంలో 17 శతాబ్దం నాటి అరుదైన బావి

28 Jan, 2022 19:43 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: భాగ్యనగర చరిత్రలోనే ప్రఖ్యాతి గాంచింది బన్సీలాల్‌పేటలోని పురాతన కోనేరు బావి. పదిహేడో శతాబ్దంలో తాగునీటి అవసరాల నిమిత్తం నిర్మించారు. కాలగమనంలో శిథిలావస్థకు చేరుకోవడంతో దీని పునరుద్ధరణకు ప్రభుత్వం నడుం కట్టింది. నగరంలోని పురాతన కట్టడాలను పరిరక్షించి వాటిని పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దటానికి ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. ( చదవండి: మూడు రోజులు ఇంటి ఎదుటే మృతదేహం.. గల్ఫ్‌ నుంచి భర్త రాకతో.. )

సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని బన్సీలాల్‌పేట్‌ కోనేరు బావి పునరుద్ధరణ పనులను గురువారం ఆయన మున్సిపల్‌ పరిపాలన శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్‌ కుమార్, సహిత స్వచ్ఛంద సంస్ధ ప్రతినిధి కల్పనా రమేష్‌తో పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. చరిత్రకు సాక్ష్యాలుగా నిలిచే పురాతన కట్టడాలకు పూర్వవైభవం తీసుకురావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారన్నారు. బన్సీలాల్‌పేట్‌లో ఈ ప్రాంత ప్రజల నీటి అవసరాలను తీర్చడానికి 17వ దశాబ్దంలో కోనేరు బావిని నిర్మించారని, చెత్తాచెదారంతో నిండిన ఈ బావిని పునరుద్ధరించడానికి పనులు ప్రారంభించామన్నారు.

ఆగస్టు 15 నాటికి కోనేరు బావి పూర్తిస్ధాయిలో అభివృద్ధి చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు.  అరవింద్‌కుమార్‌ మాట్లాడుతూ.. కోనేరు బావి సమగ్రాభివృద్ధి కోసం ఇప్పటి వరకు 50 లక్షలు ఖర్చు చేశామని, మరో రూ. కోటి ఖర్చు చేసిన ఈ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్‌ హేమలత, జీహెచ్‌ఎంసీ జోనల్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌రెడ్డి, సికింద్రాబాద్‌ ఆర్డీఓ వసంత, జలమండలి జీఎం రమణారెడ్డి, విద్యుత్తు శాఖ డీఈ శ్రీధర్‌ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు