చిన్నపిల్లలకు వ్యాక్సిన్‌ త్వరగా తీసుకురండి: గవర్నర్‌ తమిళిసై 

23 May, 2021 03:16 IST|Sakshi

డా. రెడ్డీస్‌ ప్రతినిధులతో గవర్నర్‌ తమిళిసై 

సాక్షి, హైదరాబాద్‌: చిన్న పిల్లలకు అవసరమైన వ్యాక్సిన్‌ ప్రయోగాలు త్వరితగతిన విజయవంతం చేసి కరోనా బారి నుంచి వారిని కాపాడవలసిన ఆవశ్యకత ఉందని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యాఖ్యానించారు. కోవిడ్‌ –19పై పోరాటంలో టీకా శాశ్వత రక్షణ కవచంగా ఉపయోగపడుతుందని గవర్నర్‌ అభిప్రాయపడ్డారు. డాక్టర్‌ రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రతినిధులతో శనివారం గవర్నర్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. డా.రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ నుంచి వస్తున్న స్పుత్నిక్‌–వి వ్యాక్సిన్‌ దిగుమతి, మన దేశంలో తయారీ, పంపిణీ తదితర అంశాలపై చర్చించారు.

రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ నుంచి డీఆర్‌డీవో సంయుక్త భాగస్వామ్యంతో 2 డీజీ ఔషధం రావడం, ఇది సంపూర్ణ దేశీయ ముడిసరుకుతో తయారు చేయడం ఆత్మనిర్భర్‌ భారత్‌ ఆశయానికి అనుగుణంగా ఉందని గవర్నర్‌ ప్రశంసించారు. అయితే వ్యాక్సిన్‌ ఉత్పత్తి వేగవంతం చేయాలని తయారీదారులకు తమిళిసై సూచించారు. ఈ జూలై నెలాఖరు వరకు దాదాపు రెండు కోట్ల స్పుత్నిక్‌ వి వ్యాక్సిన్‌ డోసులు దిగుమతి చేసుకుంటామని రెడ్డీస్‌ లేబొరేటరీస్‌ ప్రతినిధులు గవర్నర్‌కు తెలిపారు. ఈ సంవత్సరం ఆఖరి వరకు దిగుమతులు, మన దేశంలో తయారీ ద్వారా దాదాపు 15 నుంచి 20 కోట్ల వరకు వ్యాక్సిన్‌ డోసులు అందుబాటులోకి తెస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో గవర్నర్‌ భర్త, ప్రముఖ నెఫ్రాలజిస్టు డా.పి.సౌందరరాజన్‌ పాల్గొన్నారు.   

మరిన్ని వార్తలు