మహిళ వివస్త్ర ఘటనపై గవర్నర్‌ సీరియస్‌

10 Aug, 2023 03:30 IST|Sakshi

నిందితులపై చర్యలకు ఆదేశం  

సాక్షి, హైదరాబాద్‌/జవహర్‌నగర్‌: హైదరాబాద్‌ నగర శివారులోని జవహర్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో ఓ యువతిని నడిరోడ్డుపై వివస్త్రను చేసిన ఘటనను గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ తీవ్రంగా పరిగణించారు. ఈ ఘటనపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకుని నివేదిక సమర్పించాలని గవర్నర్‌ బుధవారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఆదేశించారు.   

దాడి చేసి.. దుస్తులు చించి.
జవహర్‌నగర్‌కు చెందిన పెద్ద మారయ్య (30) ఆదివారం రాత్రి 8.30 గంటలకు మద్యం మత్తులో రోడ్డు మీద వెళ్తున్న స్థానిక యువతితో అసభ్యంగా ప్రవర్తించాడు. బాధితురాలు ప్రతిఘటించడంతో ఆమెపై దాడి చేసి దుస్తులను చించి లాగేశాడు. ఆ సమయంలో నిందితుని తల్లి అక్కడే ఉన్నా అడ్డుకోలేదు. స్థానికులు ఫోన్లతో వీడియోలు తీశారు తప్ప ఎవరూ ఆమెను రక్షించడానికి ముందుకు రాలేదు. దాదాపు 15 నిమిషాల పాటు ఆ యువతి రోడ్డుపై నగ్నంగా రోదిస్తూ కూర్చుండిపోయింది. నిందితుడు వెళ్లిపోయాక స్థానికులు వచ్చి ఆమెను కవర్లతో కప్పి పోలీసులకు సమాచారం అందించారు.   

బాధితురాలిని ఆదుకుంటా: మంత్రి మల్లారెడ్డి 
జవహర్‌నగర్‌ సంఘటన బాధితురాలిని కారి్మక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బుధవారం మేయర్‌ కావ్య, డిప్యూటీ మేయర్‌ రెడ్డిశెట్టి శ్రీనివాస్‌తో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ సంఘటన తనను ఎంతగానో కలచివేసిందన్నారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చేస్తానని స్పష్టం చేశారు. బాధిత మహిళ చదువుకు అనుగుణంగా ఉపాధి అవకాశం కలి్పస్తానని, అన్ని విధాలుగా ఆదుకుంటానని భరోసా ఇచ్చారు. 

డీజీపీకి జాతీయ మహిళా కమిషన్‌ నోటీసులు 
సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని జవహర్‌నగర్‌లో యువతిని వివస్త్రను చేసిన సంఘటనపై నివేదిక పంపాలని జాతీయ మహిళా కమిషన్‌ (ఎన్‌సీడబ్ల్యూ) తెలంగాణ డీజీపీ అంజనీకుమార్‌ను ఆదేశించింది. ఈ సంఘటనపై ఏడు రోజుల్లో నివేదిక సమర్పించాలని కమిషన్‌ కోరింది.   

మరిన్ని వార్తలు