ఓబీసీల హక్కులకు బాసటగా నిలవాలి

27 Sep, 2021 04:45 IST|Sakshi
తమిళిసైకి జ్ఞాపికను అందజేస్తున్న తల్లోజు ఆచారి. చిత్రంలో దత్తాత్రేయ, కిషన్‌రెడ్డి 

ఎన్‌సీబీసీ జాతీయ సదస్సులో రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై 

రిజర్వేషన్ల కేటాయింపు బాధ్యత రాష్ట్రాలకే: కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి 

సాక్షి, హైదరాబాద్‌: వెనకబడిన తరగతుల హక్కుల రక్షణ బాధ్యత జాతీయ బీసీ కమిషన్‌(ఎన్‌సీబీసీ)పై ఉందని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యాఖ్యానించారు. బీసీల అభ్యున్నతికి ఈ కమిషన్‌ మరింత పాటుపడాలని సూచించారు. ఎన్‌సీబీసీ రెండేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఆదివారం ఇక్కడి ఖైరతబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో ఆ కమిషన్‌ చైర్మన్‌ భగవాన్‌లాల్‌ సహానీ అధ్యక్షతన జరిగిన జాతీయ సదస్సులో తమిళిసై మాట్లాడారు.

ఎన్‌సీబీసీ పనితీరు మెరుగ్గా ఉందని, దీంతో క్షేత్రస్థాయిలో ఓబీసీల్లో ధైర్యాన్ని నింపిందని కొనియాడారు. ప్రధాని మోదీ వల్లే ఎన్‌సీబీసీకి చట్టబద్ధత, రాజ్యాంగ హోదా దక్కాయని అన్నారు. కేంద్రమంత్రి జి.కిషన్‌రెడ్డి మాట్లాడుతూ మోదీ కేబినెట్‌లో 27 మం ది బీసీలకు ప్రాతినిధ్యం కల్పించి బీసీల పట్ల బీజేపీ తన ప్రేమను చాటుకుందన్నారు. రిజర్వేషన్ల అంశం కేంద్ర పరిధిలో కాకుండా రాష్ట్రాలకే ఇచ్చిందని, నాగాలాండ్‌లో గిరిజనులకు అక్కడ 85 %ఎస్టీ రిజర్వేషన్లు అమలవుతున్నాయని గుర్తుచేశారు.

విద్యతోనే భవిష్యత్తు: దత్తాత్రేయ 
హరియాణ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ గొర్లు, బర్లు పంపిణీ చేస్తే లాభం ఉండదని, విద్యతోనే ఉత్తమ భవిష్యత్తుకు బాట వేసిన వాళ్లమవుతామని అభిప్రాయపడ్డారు. బీసీలకు కేటాయించిన 27 % రిజర్వేషన్లు పక్కాగా అమలయ్యేలా ఎన్‌సీబీసీ కఠినంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రభుత్వ రంగంతో సమానంగా ప్రైవేటు రంగంలో కూడా దళిత, బహుజనులు విజయం సాధించాలని ఆకాంక్షించారు. ప్రతి రంగంలో మహిళలకు సముచితస్థానం క ల్పించాల్సిన అవసరముందన్నారు.ఈ సందర్భంగా గవర్నర్‌ చేతుల మీదుగా ఎన్‌సీబీసీ రెండేళ్ల పురోగతి పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి ఎన్‌సీబీసీ రెండేళ్ల విజయాలను సభలో వివరించారు.  

బీసీ గణనపై రగడ 
జనగణనలో బీసీ కులాలవారీగా గణాంకాలు సేకరించాలని తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం కార్యకర్తలు సభలో నినాదాలు చేశారు. దీంతో సభ కొంతసేపు గందరగోళంగా మారింది. పోలీసులు జోక్యం చేసుకుని ఆందోళనాకారులను అదుపులోకి తీసుకోవడంతో సభ సాఫీగా సాగింది.   

మరిన్ని వార్తలు