రామయ్య సన్నిధికి తమిళిసై: వెంట ఎవరూ లేకున్నా.. 

12 Apr, 2022 09:11 IST|Sakshi
కొత్తగూడెంలో రైలు దిగుతున్న గవర్నర్‌.. (పక్కన) రామయ్య పట్టాభిషేక మహోత్సవం

సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం: రామయ్య పట్టాభిషేకంలో పాల్గొనడంతోపాటు దమ్మపేట, మణుగూరు మండలాల పర్యటన నిమిత్తం ప్రత్యేక రైల్లో సోమవారం తెల్లవారుజామున భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చేరుకున్న గవర్నర్‌  తమిళిసై సౌందరరాజన్‌కు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులెవరూ స్వాగతం పలకలేదు. భద్రాచలంలోని శ్రీరాముడి పట్టాభిషేక వేడుకలో, తర్వాత స్థానిక కార్యక్రమాల్లో ఏ అధికారీ వెంట లేకుండానే గవర్నర్‌ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్‌ దురిశెట్టి అనుదీప్, ఐటీడీఏ పీఓ గౌతమ్‌ పొట్రు, ఎస్పీ సునీల్‌దత్‌ గవర్నర్‌ పర్యటనకు దూరంగా ఉండటం చర్చనీయాంశమైంది.  ముగ్గురు ఉన్నతాధికారులూ రెండ్రోజుల వ్యక్తిగత సెలవు పెట్టినట్లు సమాచారం.  

అంతా రాముడే చూసుకుంటాడు: గవర్నర్‌ 
రాముడి పట్టాభిషేకానికి హాజరు కావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు గవర్నర్‌  తమిళిసై సౌందరరాజన్‌  చెప్పారు. ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని రామయ్యను ప్రార్థించానన్నారు. తన పర్యటనకు జిల్లా యంత్రాంగం గైర్హాజరుపై విలేకరులు ప్రశ్నించగా ‘ఇది ఆధ్యాత్మిక పర్యటన మాత్రమే. రాముడి పట్టాభిషేకానికి వచ్చాను. అంతా రాముడే చూసుకుంటాడు’ అన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ కె.వెంకటేశ్వర్లు, దేవస్థానం ఈఓ శివాజీ తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు