సామాజిక సేవే చేసే వాళ్లకి ఎమ్మెల్సీ ఇవ్వాలి: తమిళిసై

8 Sep, 2021 14:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై సౌందరరాజన్‌ రెండేళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆమె రాజ్‌భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. గవర్నర్‌గా రెండేళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. రెండేళ్లు గవర్నర్‌గా పూర్తి చేసుకున్న ఈ విజయాన్ని ఇటీవల చనిపోయిన తన తల్లికి అంకితమిస్తున్నట్లు ప్రకటించారు. ఆరు నెలలుగా లెఫ్టినెంట్ గవర్నర్‌గా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

తన విధులు సక్రమంగా నిర్వహిస్తున్నానని, ఇందుకు రాజ్ భవన్ సిబ్బంది సహకారం ఉందని తెలిపారు. రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోదీ, ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడికి కృతజ్ఞతలు తెలిపారు. గవర్నర్‌గా చేపట్టిన ప్రతి కార్యక్రమానికి మీడియా ఎంతగానో సహకరించిందని, అందుకే తాము ప్రజలకు మరింత చేరువ కాగలినట్లు వెల్లడించారు.

కాగా హుజురాబాద్‌కు చెందిన పాడి కౌశిక్‌రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడంపై గవర్నర్‌ తమిళిసై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సామాజిక సేవ చేసే వాళ్లకే ఎమ్మెల్సీ ఇవ్వాలని సూచించారు. కౌశిక్‌రెడ్డి విషయంలో ఆలోచించి నిర్ణయం ప్రకటిస్తానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలపై ఆలోచించాలని పేర్కొన్నారు. హుజురాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ను వీడి  టీఆర్‌ఎస్‌లో చేరిన పాడి కౌశిక్‌రెడ్డికి గవర్నర్‌ కోటాలో శాసనమండలికి మంత్రివర్గం నామినేట్‌ చేసిన విషయం తెలిసిందే.
చదవండి: Huzurabad: గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీగా కౌశిక్‌రెడ్డి

మరిన్ని వార్తలు