ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడనే పరిస్థితి దాపురించింది

19 Mar, 2023 01:43 IST|Sakshi

జేఎన్టీయూహెచ్‌ 11వ స్నాతకోత్సవంలో గవర్నర్‌ తమిళిసై వ్యాఖ్యలు 

పరోక్షంగా పోటీ పరీక్షల లీకేజీ అంశం ప్రస్తావన

సమాజానికి ఉపయోగపడని డిగ్రీలు వ్యర్థమే 

పద్మవిభూషణ్‌ డాక్టర్‌ కృష్ణస్వామి కస్తూరి రంగన్‌కు గౌరవ డాక్టరేట్‌ ప్రదానం

కేపీహెచ్‌బీకాలనీ: విద్యార్థులు గతంలో పరీక్షలంటే ఎలా చదవాలని అడిగే వారని.. ప్రస్తుతం ప్రశ్నపత్రం ప్రచురణ ఎక్కడ జరుగుతోందని అడిగే పరిస్థితి దాపురించిందని రాష్ట్ర గవర్నర్, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ చాన్సలర్‌ తమిళిసై సౌందరరాజన్‌ వ్యాఖ్యానించి పరోక్షంగా పోటీ పరీక్షల లీకేజీ అంశాన్ని ప్రస్తావించారు. పదేళ్ల కిందట మెడికల్‌ కళాశాలలో తాను విద్యార్థులకు క్లాస్‌ తీసుకుంటుండగా పరీక్షలు రాసేందుకు సర్వ సన్నద్ధమైన ఓ విద్యార్థి తనను ప్రశ్న పత్రాలు ఎక్కడ తయారవుతాయంటూ ప్రశ్నించడం  ఆ నాడు జోక్‌గా ఉంటే ప్రస్తుతం అది వాస్తవరూపం దాల్చడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. 

జేఎన్టీయూహెచ్‌ 11వ స్నాతకోత్సవం శనివారం వర్సిటీ ఆవరణలోని ఆడిటోరియంలో జరిగింది. ఈ సందర్భంగా పీహెచ్‌డీ, ఎంటెక్, ఎం.ఫార్మ్‌. ఎంబీఏ, ఎంఎస్‌ఐటీ, ఎమ్మెస్సీ, ఎంసీఏ, ఎంఎస్, ఫార్మ్‌–డి, ఫార్మ్‌ డి (పీబీ), పీజీ డిప్లొమా, బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ అండ్‌ ఎంఓయూ కోర్సులు పూర్తి చేసిన విద్యార్ధులకు పట్టాలతో పాటు పతకాలను ప్రదానం చేశారు. విద్యార్ధులను ఉద్దేశించి గవర్నర్‌ మాట్లాడుతూ గురువుల ద్వారా ఆర్జించిన జ్ఞానాన్ని వ్యక్తిగత ప్రయోజనాలకు కాకుండా సమాజ వికాసానికి పంచినప్పుడే సార్ధకత లభిస్తుందన్నారు.

సమాజానికి ఉపయోగపడని విద్యా డిగ్రీలు, పతకాలు ఎన్ని సాధించినా వ్యర్ధమేనని వ్యాఖ్యానించారు. నిత్యం టెక్నాలజీతో సహజీవనం చేస్తున్న ప్రస్తుత రోజుల్లో ఆ సాంకేతికతను సన్మార్గంలో వినియోగించుకున్నప్పుడే మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఇంటా, బయటా ఎన్నో సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో కొంతమంది విద్యార్ధులు ఆత్మహత్యలకు పాల్పడటం బాధాకరమన్నారు. ఉద్యోగాలు వెతుక్కునే స్థితి వద్దని, ఉద్యోగాలు ఇచ్చే స్థాయిలో ఉండాలని పిలుపునిచ్చారు. ఎప్పుడూ కరెన్సీ మాత్రమే లెక్కబెట్టడం కాదని, కేలరీస్‌ను కూడా లెక్కించాలని పేర్కొంటూ ఆరోగ్య ప్రాధాన్యతను తెలియజేశారు. మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఉద్భోదించారు. 

మరిన్ని వార్తలు