ఉద్యాన పరిశోధనలు పెరగాలి

24 Dec, 2022 01:20 IST|Sakshi
విద్యార్థినికి పట్టా ప్రదానం చేస్తున్న గవర్నర్‌ 

కొండా లక్ష్మణ్‌ ఉద్యాన వర్సిటీ స్నాతకోత్సవంలో గవర్నర్‌ తమిళిసై

ప్రజల ఆరోగ్యానికి తోడ్పడే వంగడాలను రూపొందించాలని పిలుపు

వర్సిటీ టాపర్లకు మెడల్స్‌ అందజేసిన గవర్నర్‌

సాక్షి, సిద్దిపేట: ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగడాల ఉత్పత్తే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు చేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. విద్యార్థులు వ్యవసాయ, ఉద్యాన కోర్సులు ఎంచుకుంటుండటం సంతోషకరమని.. ఔషధ పంటలపైనా పరిశోధనలు విస్తృతం కావాల్సి ఉందని పేర్కొన్నారు.

సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్‌ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ దీనిలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ సంస్కృతిలో పండ్లు, కూరగాయలు, పూలు కూడా భాగమని గవర్నర్‌ పేర్కొన్నారు.

ఆహార అలవాట్లు మార్చుకోవాలి
వ్యవసాయ రంగానికి ఉద్యాన విభాగం మూలస్తంభం లాంటిదని గవర్నర్‌ పేర్కొన్నారు. పూర్వీకులు సంప్రదాయ ఆహారం తీసుకున్నారని, అప్పట్లో జీవనశైలి వ్యాధులైన బీపీ, మధుమేహం వంటివి లేవని గుర్తు చేశారు. ‘‘తమిళనాడులో రకరకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. అదే తెలుగు నేలపై పాలిష్డ్‌ రైస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం.

బియ్యం తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. కోవిడ్‌ సమయంలో పండ్లు, కూరగాయల ప్రాధాన్యత ఏమిటో చూశాం. మానవాళికి ఆరోగ్యవంతమైన ఆహారంగా ఉపయోగపడే వంగడాల సృష్టి జరిగేలా ఉద్యాన పట్టభద్రులు నిరంతరం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.’’ అని గవర్నర్‌ తమిళిసై చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి మంచి ప్రోత్సాహం ఇస్తోందని చెప్పారు. 

పంటల ఉత్పత్తి, నాణ్యత పెంచాలి
పర్యావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తి, నాణ్యత పెంచడంలో శాస్త్ర సాంకేతికతల భాగస్వామ్యం అవసరమని భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్‌ జనరల్‌ (హార్టికల్చర్‌) ఆనంద్‌కుమార్‌ సింగ్‌ పేర్కొన్నారు. మార్కెట్‌ ఉన్న పంటలు సాగు చేయడం, కోత అనంతర నష్టాలను తగ్గించడంతోపాటు రోబోటిక్స్, డ్రోన్లు, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, జీనోమ్‌ ఎడిటింగ్, బయోటెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ చాన్స్‌లర్‌ నీరజ ప్రభాకర్‌ వర్సిటీ ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలను, జరిగిన పరిశోధనలను వివరించారు. దేశంలోనే మొదటి మహిళా వీసీగా నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

11 మందికి గోల్డ్‌ మెడల్స్‌
స్నాతకోత్సవం సందర్భంగా 11 మంది విద్యార్థులకు గవర్నర్‌ తమిళిసై బంగారు పతకాలను అందించారు. పి.సాయి సుప్రియ మూడు మెడల్స్, ఎద్దుల గాయత్రి మూడు మెడల్స్, సంధ్యారాణి, స్నేహప్రియ, మిట్టపల్లి కిశోర్, హరిక, తేజస్విని ఒక్కో గోల్డ్‌ మెడల్‌ అందుకున్నారు. మొత్తంగా 482 అండర్‌ గ్రాడ్యుయేట్, 76 పీజీ, 17 పీహెచ్‌డీ పట్టాలను అందజేశారు.

నాలుగు గోల్డ్‌ మెడల్స్‌ సాధించా..
మాది జగిత్యాల జిల్లా. ఉద్యాన కళాశాలలో 2018–2020 ఎమ్మెస్సీ (వెజిటబుల్స్‌) చేశాను. 92.9 శాతం మార్కులతో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాను. ప్రస్తుతం అగ్రికల్చర్‌ ఆఫీసర్‌గా యూనియన్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో వర్క్‌ చేస్తున్నాను. యూజీలో ఒకటి, ఇప్పుడు మూడు.. మొత్తం నాలుగు గోల్డ్‌ మెడల్స్‌ వచ్చాయి. ఇదే స్ఫూర్తితో పీహెచ్‌డీ పూర్తి చేస్తాను.
– పి.సాయి సుప్రియ, పీజీ విద్యార్థిని 

చంటి బిడ్డలతో వచ్చి పీహెచ్‌డీ పట్టా 
జనగామ జిల్లా స్టేషన్‌ ఘన్‌పూర్‌కు చెందిన కె.దివ్య పీహెచ్‌డీ పూర్తిచేసి శుక్రవారం పట్టా అందుకుంది. మూడు నెలల కవల పిల్లలు, కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్నాతకోత్సవానికి వచ్చారు. పట్టా అందుకుని రాగానే పిల్లలను దగ్గరికి తీసుకుని, ఆనందంతో మురిసిపోయింది.

మరిన్ని వార్తలు