టీఎస్‌పీఎస్‌సీ వ్యవహారం.. 48 గంటల్లో నివేదిక ఇవ్వాలి.. ప్రభుత్వానికి గవర్నర్‌ తమిళిసై ఆదేశం 

24 Mar, 2023 10:22 IST|Sakshi
ఫైల్‌ ఫోటో

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(టీఎస్‌పీఎస్సీ) పేపర్‌ లీకేజీపై గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ మరోసారి తీవ్రంగా స్పందించారు. మొదటిసారి పేపర్‌ లీక్‌ అయినప్పుడు కమిషన్‌ కార్యదర్శిని 48 గంటల్లో లీకేజీకి సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆదేశిస్తూ కమిషన్‌కు లేఖ రాసిన సంగతి విదితమే.

తాజాగా గురువారం మరో లేఖను ప్రభుత్వానికి, కమిషన్‌కు రాశారు. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పోటీపరీక్షలకు హాజరైన కమిషన్‌ రెగ్యులర్‌ ఉద్యోగులు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు ఎవరు? కమిషన్‌ నుంచి అనుమతితో, అనుమతి లేకుండా హాజరైన వారెవరెవరు? పరీక్షల్లో సాధించిన మార్కులు ఎన్ని? పరీక్షల తర్ఫీదుకు సెలవులు తీసుకున్నారా? వంటి వివరాలతో టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ కేసు దర్యాప్తు తాజా పురోగతిపై 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్‌ ఆదేశించారు.

గవర్నర్‌ ఆదేశాలతో ఈ మేరకు రాజ్‌భవన్‌ గురువారం ప్రభుత్వ ప్రధానకార్యదర్శి, డీజీపీ, టీఎస్‌పీఎస్‌సీకి లేఖలు రాసింది. సిట్‌ దర్యాప్తులో పురోగతిని సైతం నివేదికలో తెలపాలని కోరింది. 
చదవండి: సిట్‌కు బండి సంజయ్‌ లేఖ.. ‘విచారణకు హాజరుకాలేను’

మరిన్ని వార్తలు