'కొత్త రాష్ట్రమైనప్పటికీ ఎంతో పురోగతి సాధించాం'

27 Jan, 2021 01:51 IST|Sakshi

అత్యంత చిత్తశుద్ధి, దృఢ సంకల్పంతో పునర్నిర్మాణ ప్రక్రియ

గణతంత్ర దినోత్సవ ప్రసంగంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

కోవిడ్‌ వ్యాక్సినేషన్‌ విజయవంతంగా కొనసాగుతోంది

పబ్లిక్‌ గార్డెన్స్‌లో ఘనంగా వేడుకలు

పాల్గొన్న సీఎం కేసీఆర్, మంత్రులు

సాక్షి, హైదరాబాద్‌: ‘ఆరు దశాబ్దాల వలస పాలనతో కుదేలైన తెలంగాణ రాష్ట్రంలో పునర్నిర్మాణ ప్రక్రియను ప్రభుత్వం అత్యంత చిత్తశుద్ధితో, దృఢ సంకల్పంతో చేపట్టింది. సమతుల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షే మం లక్ష్యంగా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించి, అమలు చేస్తోంది. కొత్తగా ఏర్పాటైన రాష్ట్రమైనప్పటికీ అన్ని రంగాల్లోనూ ఎంతో పురోగతి సాధించి, యావత్‌ దేశం దృష్టిని ఆకర్షించింది. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఆకలి దప్పులు, ఆత్మహత్యలు లేని, సుఖసంతోషాలు, సిరిసంపదలతో కూడిన బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన పునాదులు పడ్డాయి. ప్రజలందరి భాగస్వామ్యంతో ఈ ప్రగతి యజ్ఞాన్ని మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రభుత్వం గట్టి పట్టుదలతో పనిచేస్తుంది’ అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు.

‘కొత్త పథకాలు, కొత్త చొరవ, కొత్త ఆవిష్కరణలతో కొత్త రాష్ట్రమైన తెలంగాణ సరికొత్త రికార్డులను నెలకొల్పుతోంది. నూతనంగా ఆవిర్భవించిన తెలంగాణ దేశంలోనే ఓ శక్తి వంతమైన రాష్ట్రంగా రూపుదిద్దుకుంటోంది. భారతదేశం మునుపెన్నడూ కనీవినీ ఎరుగని వినూత్న పథకాలను, ప్రజోపయోగ కార్యక్రమాలను అమలు చేసుకుంటూ అనేక రంగాల్లో రాష్ట్రం నేడు దేశంలోనే అగ్రగామిగా నిలవడం స్ఫూర్తిదాయకం..’అని అన్నారు. నాంపల్లిలోని పబ్లిక్‌ గార్డెన్స్‌లో మంగళవారం జరిగిన 72వ గణతంత్ర దినోత్సవంలో గవర్నర్‌ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, రాష్ట్ర మంత్రులు, సీఎస్‌ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గవర్నర్‌ ప్రసంగంలోని ముఖ్యాంశాలు ఆమె మాటల్లోనే..

పదోన్నతుల తర్వాత ఒకేసారి ఖాళీల భర్తీ 
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఉద్యోగుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చింది. రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లలోనే ఉద్యోగులకు 42 శాతం ఫిట్‌మెంట్‌తో జీతాలు పెంచింది. తక్కువ వేతనాలతో పనిచేసే ఔట్‌ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు, హోంగార్డులు, పారిశుధ్య కార్మికులు, 108 సిబ్బంది తదితరుల వేతనాలు పెంచింది. తాజాగా ప్రతి ఉద్యోగికీ, ప్రతి పెన్షనర్‌కు మరోసారి వేతనాలు పెంచాలని నిర్ణయించింది. ఎన్నికల హామీ మేరకు ఉద్యోగుల పదవీ విరమణ వయో పరిమితినీ పెంచాలని నిర్ణయించింది. అన్ని ప్రభుత్వ శాఖల్లో వెంటనే పదోన్నతులు ఇవ్వాలని ప్రభుత్వం ఆయా శాఖలకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. పదోన్నతులు పూర్తయిన వెంటనే అన్ని శాఖల్లో ఏర్పడిన ఖాళీలను ఒకేసారి భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

కోవిడ్‌కు కళ్లెం
రాష్ట్రంలో కరోనా వ్యాక్సినేషన్‌ విజయవంతంగా సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో కోవిడ్‌ వ్యాప్తిని, ప్రభావాన్ని, ప్రాణనష్టాన్ని గణనీయంగా అరికట్టగలిగింది. కోవిడ్‌ మరణాల రేటు జాతీయ స్థాయిలో 1.4 శాతం అయితే తెలంగాణలో 0.54 శాతం మాత్రమే. కోవిడ్‌ ఫ్రంట్‌లైన్‌ వారియర్లు అయిన వైద్య ఆరోగ్య సిబ్బంది, రేయింబవళ్లు సేవలందించిన పోలీసులు, పారిశుధ్య కార్మికులు, ఇతర ఉద్యోగులను, స్వచ్ఛంద కార్యకర్తలను మనన్ఫూర్తిగా అభినందిస్తున్నా. లాక్‌డౌన్‌తో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.52 వేల కోట్ల ఆదాయం తగ్గడంతో బడ్జెట్‌ ప్రణాళికలపై తీవ్ర ప్రభావం చూపించింది. ఆదాయం తగ్గినప్పటికీ పేదల సంక్షేమానికి చేసే ఖర్చులో ప్రభుత్వం ఒక్క పైసా కూడా కోత విధించలేదు. 

ఆదర్శ గ్రామాలుగా తెలంగాణ పల్లెలు 
పల్లె సీమల రూపురేఖలు మార్చాలనే మహదాశయంతో ప్రభుత్వం చేపట్టిన ‘పల్లె ప్రగతి’కార్యక్రమం నమ్మశక్యం కాని అద్భుత ఫలితాలు అందించింది. తెలంగాణ పల్లెలు దేశంలోనే ఆదర్శ గ్రామాలుగా రూపాంతరం చెందాయి. ప్రతినెలా రూ.308 కోట్ల చొప్పున గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం విడుదల చేస్తోంది. 

పట్టణాల్లో ప్రతి ఇంటికీ ఉచితంగా తాగునీరు 
రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ప్రతి ఇంటికీ నెలకు 20 వేల లీటర్ల వరకు ఉచితంగా ప్రభుత్వం తాగునీటిని సరఫరా చేస్తోంది. 97 శాతం మంది పట్టణ వాసులు ఉచితంగా సురక్షిత మంచినీటి సౌకర్యం పొందగలుగుతున్నారు. పట్టణాలకు ప్రభుత్వం ప్రతి నెలా రూ.148 కోట్లు విడుదల చేస్తోంది. జీహెచ్‌ఎంసీ, ఇతర కార్పొరేషన్లకు అదనంగా నిధులు ఇస్తోంది. మిషన్‌ భగీరథతో రాష్ట్రంలో మంచినీటి కష్టాలు శాశ్వతంగా దూరమయ్యాయి. రాష్ట్రంలోని 23,968 ఆవాస ప్రాంతాలకు నేడు సురక్షిత మంచినీరు ప్రతిరోజూ అందుతోంది. 98.46 శాతం ఇండ్లకు నల్లా ద్వారా మంచినీళ్లు అందిస్తూ తెలంగాణ రాష్ట్రం గొప్ప విజయం సాధించిందని కేంద్ర ప్రభుత్వ జల్‌ జీవన్‌ మిషన్‌ ప్రకటించడం మనం సాధించిన ఘనతకు దక్కిన గుర్తింపు. 

అన్నపూర్ణగా మారిన రాష్ట్రం
వరి పంట సాగు 35 లక్షల ఎకరాల నుంచి కోటి 4 లక్షల ఎకరాలకు పెరగడం రాష్ట్రంలో మారిన వ్యవసాయ పరిస్థితికి అద్దం పడుతోంది. రాష్ట్రం నేడు దేశానికి అన్నపూర్ణగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంట పొలాలకు నీరందడం ప్రారంభమయింది. పాలమూరు– రంగారెడ్డి, సీతారామ, దేవాదుల తదితర ప్రాజెక్టుల పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఉమ్మడి మహబూబ్‌ నగర్, వరంగల్, ఆదిలాబాద్, నల్గొండ, ఖమ్మం తదితర జిల్లాల్లోని పెండింగ్‌ ప్రాజెక్టుల నిర్మాణాన్ని త్వరిత గతిన పూర్తి చేయడం ద్వారా దాదాపు 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతున్నది. రైతుబంధు కింద ఈ ఏడాది ఇప్పటిదాకా రూ.7,351 కోట్లను ప్రభుత్వం అందించింది. ‘రైతుబీమా’పథకం ప్రారంభించిన నాడు ఏడాది కిస్తీ రూ.630 కోట్లు ఉంటే, నేడు రూ.1,141 కోట్లకు చేరింది. రైతు కుటుంబాల జీవన భద్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం మొత్తం కిస్తీ చెల్లించి ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ధరణి పోర్టల్‌ 100 శాతం విజయవంతమైంది. రెవెన్యూకు సంబంధించిన అన్ని సమస్యలను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరించేందుకు జిల్లాల వారీగా కలెక్టర్ల నేతృత్వంలో ప్రత్యేక డ్రైవ్‌ నడుస్తోంది.

విద్యుత్, వైద్య రంగాల్లో పురోగతి
అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. తెలంగాణ ఏర్పడిన నాడు స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం కేవలం 7,888 మెగావాట్లు కాగా, నేడు 16,245 మెగావాట్లకు చేరింది. తలసరి విద్యుత్‌ వినియోగం వృద్ధి రేటులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచింది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్‌ సెంటర్లు, డయాగ్నస్టిక్‌ సెంటర్లు, ఐసీయూలు ఏర్పాటయ్యాయి. కేసీఆర్‌ కిట్‌ పథకం.. గర్భిణీలకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు, ప్రసవ సమయంలో జరిగే మరణాలు గణనీయంగా తగ్గించగలిగింది. రాష్ట్రంలో పదివేల బెడ్లకు ఆక్సిజన్‌ సౌకర్యం కల్పించారు. ప్రభుత్వ వైద్యశాలల్లో మెరుగైన వైద్య సేవలు అందించడంలో.. తెలంగాణ వరుసగా మూడో ఏడాది కూడా మూడో స్థానంలో నిలిచిందని నీతి ఆయోగ్‌ ప్రకటించడం వైద్యరంగంలో రాష్ట్రం సాధించిన పురోగతికి నిదర్శనం. 

3.67 శాతం పెరిగిన పచ్చదనం
వచ్చే విద్యా సంవత్సరం కోసం జరిగే పోటీ పరీక్షలు, ఎంట్రెన్స్‌ టెస్టులకు సిద్ధం చేసే విధంగా 9, ఆపై క్లాసుల విద్యార్థులకు ఫిబ్రవరి 1 నుంచి తరగతులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. హరితహారం ద్వారా 230 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే 210.68 కోట్ల మొక్కలను నాటడం జరిగింది. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో పచ్చదనం 3.67 శాతం పెరిగిందని ఫారెస్ట్‌ సర్వే ఆఫ్‌ ఇండియా వెల్లడించింది. 

14.59 లక్షల మందికి ఉపాధి
టీఎస్‌–ఐపాస్‌ చట్టం వచ్చిన తర్వాత రాష్ట్రానికి 14,338 పరిశ్రమలు వచ్చాయి. 14,59,639 మందికి ఉద్యోగ అవకాశం లభించింది. ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రోత్సాహక ఐటీ విధానం వల్ల విశ్వ విఖ్యాత ఐటీ కంపెనీలు తెలంగాణలో కార్యాలయాలు ప్రారంభించాయి. అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ సంస్థ రూ. 20,761 కోట్ల పెట్టుబడితో హైదరాబాద్‌లో డేటా సెంటర్‌ రీజియన్‌ ఏర్పాటుకు ముందుకు వచ్చింది.

దుష్ట శక్తులపై ఉక్కుపాదం
రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణలో ప్రభుత్వం రాజీలేని వైఖరి అవలంభిస్తోంది. సంఘ విద్రోహ శక్తులు, మహిళలను వేధించే దుష్టుల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. దేశ వ్యాప్తంగా ఉన్న సీసీ కెమెరాల్లో 65 శాతం తెలంగాణలోనే ఉండడం గమనార్హం. పోలీస్‌ కమాండ్‌ అండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ త్వరలోనే ప్రారంభం కానుంది. 

సైనిక వందనం స్వీకరించిన గవర్నర్‌
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని భారత వాయుసేనకు చెందిన ఎయిర్‌ వార్‌ఫేర్‌ కళాశాల బలగాలు, టీఎస్‌ఎస్పీ 8వ బెటాలియన్‌ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సైనిక కవాతు ఆకట్టుకుంది. గవర్నర్‌ తమిళిసై జాతీయ జెండాను ఆవిష్కరించి సైనిక వందనం స్వీకరించారు.  

మరిన్ని వార్తలు