వ్యాధులపై అవగాహన పెరగాలి

3 Feb, 2023 02:55 IST|Sakshi

ఆ దిశగా ఐఏపీఎస్‌ఎం మరింత కృషి చేయాలి 

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 

సాక్షి, హైదరాబాద్‌/లాలాపేట: వ్యాధుల సమర్థ నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడం ఒక్కటే మేలైన మార్గమని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇండియన్‌ అసోసియేషన్‌ ఫర్‌ ప్రివెంటివ్‌ అండ్‌ సోషల్‌ మెడిసిన్‌ (ఐఏపీఎస్‌ఎం) అవిశ్రాంత కృషి చేస్తోందని కొనియాడారు. వ్యాధుల నివారణకు తీసుకోవాల్సిన చర్యలు.. సామాజిక, ఆర్థిక అంశాల ప్రభావం ఆరోగ్యంపై ఎలా ఉంటుందో పరిశోధించే సోషల్‌ మెడిసిన్‌ రంగాల్లో ఐఏపీఎస్‌ఎం పనిచేస్తోంది.

ఐఏపీఎస్‌ఎం ఏర్పాటై 50 ఏళ్లు అవుతున్న సందర్భంగా బీబీనగర్‌లోని ఎయిమ్స్‌ ఆసుపత్రి, జాతీయ పోషకాహార సంస్థ సంయుక్తంగా ‘ఐఏపీఎస్‌ఎంకాన్‌’పేరుతో సదస్సును నిర్వహిస్తున్నాయి. మూడు రోజులపాటు జరగనున్న ఈ సదస్సు గురువారం ఎన్‌ఐఎన్‌లో ఘనంగా ప్రారంభమైంది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన గవర్నర్‌ మాట్లాడుతూ కోవిడ్‌ మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనే విషయంలో ఐఏపీఎస్‌ఎం వంటి సంస్థలు, ప్రజారోగ్య సిబ్బంది కీలకపాత్ర పోషించారని అన్నారు.

వ్యాధుల గురించి, వాటి నివారణకు తీసుకోవాల్సి చర్యలు.. అందుబాటులోకి వస్తున్న కొత్త కొత్త చికిత్స పద్ధతులను జన సామాన్యంలోకి తీసుకెళ్లేందుకు ఐఏపీఎస్‌ఎం మరింత కృషి చేయాలని సూచించారు. ప్రజలకు దీనిపై అవగాహన ఏర్పడితే సమస్య సగం పరిష్కారమైనట్లేనని అన్నారు. కోవిడ్‌ మహమ్మారి సమస్య దాదాపుగా సమసిపోయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి సాంక్రమిక వ్యాధులు మరికొన్నింటిని ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావచ్చని గవర్నర్‌ హెచ్చరించారు. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఫ్లోరోసిస్‌ సమస్య, మరికొన్ని చోట్ల మూత్రపిండాల సమస్యలు ఎక్కువగా ఉన్నాయని.. ఇలా వివిధ ప్రాంతాల్లో వ్యాధులు ఎందుకు ప్రబలుతున్నాయో పరిశోధించాలని గవర్నర్‌ కోరారు.  

యంగెస్టు స్టేట్‌కు యంగ్‌ గవర్నర్‌ను  
‘భారతదేశంలోనే యంగెస్టు స్టేట్‌ తెలంగాణ. దానికి దేశంలోని అందరు గవర్నర్‌లతో పోలిస్తే నేనే యంగ్‌ గవర్నర్‌’అని గవర్నర్‌ తమిళిసై అన్నారు. నూతన రాష్ట్రాన్ని నూతన గవర్నర్‌ ఏవిధంగా మెనేజ్‌ చేస్తుందని అందరూ అనుకుంటున్నారని, అయితే తాను వృత్తి రీత్యా గైనకాలజిస్టును అయినందున కొత్తగా పుట్టిన బిడ్డను ఎలా జాగ్రత్తగా చూసుకుంటామో అదే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నానని పేర్కొన్నారు.

పైగా పుదుచ్ఛేరి లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌గా అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నానని.. దీంతో తాను కవల పిల్లలను చూసుకుంటున్నట్లు రెండు రాష్ట్రాల్లో గవర్నర్‌గా విధులు నిర్వహిస్తున్నానని వివరించారు. ఐఏపీఎస్‌ఎంకాన్‌ ఆర్గనైజింగ్‌ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ వికాస్‌ భాటియా, ఉపాధ్యక్షురాలు డాక్టర్‌ రష్మీ కుందాపూర్, ఐఏపీఎస్‌ఎం ప్రెసిడెంట్‌ ఎలెక్ట్‌ డాక్టర్‌ ఎ.ఎం.ఖాద్రీ పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు