ఉద్యోగాలిచ్చే స్థాయికి విద్యార్థులు ఎదగాలి

27 Feb, 2022 04:50 IST|Sakshi
జేఎన్టీయూహెచ్‌ స్నాతకోత్సవంలో విద్యార్థినికి గోల్డ్‌ మెడల్‌ అందజేస్తున్న గవర్నర్‌ తమిళిసై 

గవర్నర్‌ తమిళిసై 

బాలానగర్‌: విద్యార్థులు ఉద్యోగాల కోసం ఎదురుచూడటం కాదు.. మీరే ఉద్యోగాలిచ్చే స్థాయికి ఎదగాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పిలుపునిచ్చారు. శనివారం జవహర్‌లాల్‌ సాంకేతిక విశ్వ విద్యాలయంలో (జేఎన్టీయూ) నిర్వహించిన యూనివర్సిటీ 10వ స్నాతకోత్సవం కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. గోల్డ్‌ మెడల్స్‌ సాధించిన విద్యార్థినీ, విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు.

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి విద్యార్థులను తీర్చిదిద్దారన్నారు. దీనికి తోడుగా విద్యార్థుల శ్రమ, పట్టుదల తోడై గోల్డ్‌ మెడల్స్, డాక్టరేట్‌ సాధించారని ప్రశంసించారు. కొన్ని రోజులుగా యువత ఆత్మహత్యలకు పాల్పడుతున్న విషయం తనను తీవ్రంగా కలచివేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. వివాహంతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థినీ చదువుకోవాలని, దీనిలో భాగంగానే ప్రభుత్వం పెళ్లి వయోపరిమితిని పెంచిందని తెలిపారు.

కేంద్ర సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకార్యదర్శి చంద్రశేఖర్‌కు గవర్నర్‌ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. అనంతరం విద్యార్థులకు గోల్డ్‌ మెడల్స్‌ అందజేశారు. కార్యక్రమంలో వర్సిటీ ఉప కులపతి కట్టా నర్సింహారెడ్డి, రెక్టార్‌ గోవర్ధన్, రిజిస్ట్రార్‌ మంజూర్‌ హుస్సేన్, ఈసీ కమిటీ మెంబర్, డైరెక్టర్లు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు