కేసీఆర్‌ ‘ముందస్తు’ వ్యూహంపై తమిళిసై కీలక వ్యాఖ్యలు

26 Jul, 2022 03:01 IST|Sakshi

ఆయన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లే అవకాశం లేదు

రాజ్‌భవన్, ప్రగతిభవన్‌ మధ్య గ్యాప్‌ బహిరంగ రహస్యమే

హెలికాప్టర్‌ సహా ప్రొటోకాల్స్‌ గురించి పట్టించుకోవడం మానేశా

డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత

ఢిల్లీలో మీడియాతో చిట్‌చాట్‌లో తెలంగాణ గవర్నర్‌ తమిళిసై

సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణలో ప్రస్తుతం క్షేత్రస్థాయిలో మారుతున్న పరిస్థితుల కారణంగా సీఎం కేసీఆర్‌ ముందస్తు ఎన్నికలకు వెళ్లకపోవచ్చని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అభిప్రాయపడ్డారు. జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కేసీఆర్‌ భావిస్తున్నారని, అందుకే ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని విమర్శిస్తున్నారని అందరూ భావిస్తున్నట్లు చెప్పారు. కానీ తన వ్యక్తిగత అభిప్రాయం ప్రకారం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లబోరని, వెళ్లే అవకాశం లేదని తమిళిసై తేల్చిచెప్పారు. సోమవారం ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్‌ హాల్‌లో జరిగిన నూతన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ప్రమాణస్వీకార కార్యక్రమానికి హాజరైన అనంతరం గవర్నర్‌ తమిళిసై తెలంగాణ భవన్‌లో మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు.

ప్రొటోకాల్‌ గురించి అడిగి లేదనిపించుకోను..
ప్రగతిభవన్, రాజ్‌భవన్‌ మధ్య ఏర్పడిన దూరం బహిరంగ రహస్యమేనని, ఆ విషయంలో కొత్తదనం ఏమీ లేదని గవర్నర్‌ తమిళిసై చెప్పారు. ఇటీవల రాజ్‌భవన్‌లో కేసీఆర్‌ తనను కలిశాక కూడా ప్రభుత్వం ప్రొటోకాల్‌ ఇవ్వట్లేదన్నారు. ఇటీవల వరదల సమయంలో కనీసం కలెక్టర్‌ కూడా తన వెంట రాలేదని గుర్తుచేశారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు అర్థమైనందున చాలాకాలంగా పర్యటనలకు వెళ్లేందుకు ప్రోటోకాల్, హెలికాప్టర్‌ సహా ఇతర సదుపాయాలను అడిగి లేదనిపించుకోవడం ఎందుకని పట్టించుకోవడం మానేసినట్లు గవర్నర్‌ పేర్కొన్నారు. కానీ సీఎం కేసీఆర్‌ ఇప్పటికీ తనకు సోదరుడేనని చెప్పారు. తనను ఎప్పుడు ఎవరు ఆహ్వానించినా వారి ఆహ్వానాన్ని గౌరవిస్తానని కేసీఆర్‌ని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు.

వరద ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రభుత్వానికి ఇబ్బందేంటి?
ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే స్పందించడం తన బాధ్యత అని, వరద ప్రాంతాల్లో పర్యటిస్తే ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఏమిటని గవర్నర్‌ తమిళిసై ప్రశ్నించారు. ప్రజలతో మమేకం కావడమే తనకు ముఖ్యమని స్పష్టం చేశారు. భద్రాచలం ప్రాంతంలో తాను దత్తత తీసుకున్న కొన్ని గ్రామాల గిరిజనులు వరద ప్రభావానికి గురయ్యారని తెలిసి అక్కడికి వెళ్లినట్లు వివరించారు. తన పర్యటనకు రాజకీయ ఉద్దేశమేదీ లేదన్నారు. గవర్నర్‌ అంటే కేవలం రాజ్‌భవన్‌లోని నాలుగు గోడలకే పరిమితం కావాలన్న ఉద్దేశం సరికాదన్నారు. క్లౌడ్‌ బరస్ట్‌ సహా అనేక అంశాలపై తాను మాటిమాటికీ బరస్ట్‌ కాలేనని వ్యంగ్యాస్త్రం సంధించారు.

ప్రజలు ‘డబుల్‌’ఇళ్లు అడుగుతున్నారు..
డబుల్‌ బెడ్రూం ఇళ్ల విషయంలో రాష్ట్ర ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని గవర్నర్‌ తెలిపారు. ఇటీవల వరద ప్రాంతాల్లో తన పర్యటన సందర్భంగా చాలా మంది డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం ఆందోళన చేశారని చెప్పారు. అయితే వరద ప్రాంతాల్లో సమస్యలను గుర్తించి రాష్ట్ర ప్రభుత్వానికి సలహాలు, సూచనలు చేసినట్లు తమిళిసై వివరించారు.

తెలంగాణకు నిరంతరం కేంద్ర ప్రభుత్వ మద్దతు...
తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం నిరంతరం మద్దతు తెలుపుతోందని గవర్నర్‌ తమిళిసై చెప్పారు. విభజన హామీలపై ఇప్పటికే చాలా వరకు నెరవేరాయని, సమయానుకూలంగా అన్ని హామీలు పరిష్కారం అవుతాయని తెలిపారు. అయితే మిగిలిన హామీల పరిష్కారం, ఇతర మద్దతు పూర్తిగా రాజకీయపరమైన అంశమని వ్యాఖ్యానించారు. వరద ప్రాంతాల్లో పర్యటించి వచ్చాక కేంద్ర హోంమంత్రి అమిత్‌ షాకు నివేదిక పంపానని.. కేంద్రం కూడా నష్టం అంచనా కోసం రాష్ట్రానికి అధికారులను పంపించిందని గవర్నర్‌ వివరించారు.

దేశ మహిళలందరికీ ముర్ము రోల్‌ మోడల్‌..
‘అణగారిన వర్గాలకు చెందిన ఒక మహిళ రాష్ట్రపతి పదవిని అలంకరించడం కేవలం భారత్‌లోనే సాధ్యం. ప్రజల కోసం నిబద్ధతతో పనిచేసే ఒక వ్యక్తిని అత్యున్నత స్థానానికి ఎంపిక చేయడంతో దేశంలో గొప్ప ప్రజాస్వామ్యం ఉందని మరోసారి రుజువైంది. దేశంలోని మహిళలందరికీ ముర్ము ఒక రోల్‌ మోడల్‌. ఒక మహిళా గవర్నర్‌గా మహిళా రాష్ట్రపతి వద్ద పనిచేయడం ఒక మంచి అవకాశం. ఒక గొప్ప గౌరవం. నేను ఎప్పటికీ ప్రజల వెంటే ఉంటాను’అని అన్నారు.  

మరిన్ని వార్తలు