యంగ్‌గా ఉండేందుకు యోగా

28 May, 2022 02:00 IST|Sakshi
యోగాసనాలు వేస్తున్న కేంద్రమంత్రులు శర్బానంద సోనోవాల్, కిషన్‌రెడ్డి,  గవర్నర్‌ తమిళిసై 

గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌

ఎల్బీ స్టేడియంలో ‘యోగా ఉత్సవ్‌’

హాజరైన కేంద్రమంత్రులు, సినీ ప్రముఖులు, క్రీడాకారులు 

గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్‌): నిత్యం యవ్వనంగా ఉండేందుకు యోగా చేయాలని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ సూచించారు. కేంద్ర ఆయుష్‌ మంత్రిత్వశాఖ, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం 25 రోజుల కౌంట్‌డౌన్‌ను పురస్కరించుకుని శుక్రవారం ఎల్బీ స్టేడియంలో ‘యోగా ఉత్సవ్‌’ను నిర్వహించారు. ఈ సందర్భంగా గవర్నర్‌ మాట్లాడుతూ యోగాతో శారీరకంగా ఫిట్‌గా ఉండటంతో పాటు మానసికంగా బలంగా ఉంటారని తెలిపారు.

హైపర్‌ టెన్షన్, థైరాయిడ్‌లతో పాటు పలు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయన్నారు. కేంద్రమంత్రి సర్బానంద సోనోవాల్‌ మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తమ జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని సూచించారు. కేంద్ర పర్యాటక శాఖమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ ఇస్లామిక్‌ దేశాల్లోనూ యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో కేంద్ర సహాయమంత్రి ముంజపరా మహేంద్రభాయ్, మంత్రి హరీశ్‌రావు, శాసన సభ్యుడు రాజాసింగ్, క్రీడాకారులు పీవీ సింధు, మిథాలీరాజ్, నైనా జైస్వాల్, ప్రజ్ఞాన్‌ ఓజా, హాకీ క్రీడాకారుడు ముఖేశ్, సినీ ప్రముఖులు మంచు విష్ణు, లావణ్యత్రిపాఠి, దిల్‌రాజు, పద్మశ్రీ పురస్కార గ్రహీత మొగిలయ్య పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు