విమోచనమే నిజమైన స్వాతంత్య్ర దినం 

18 Sep, 2022 01:22 IST|Sakshi

రాజ్‌భవన్‌లో జరిగిన విమోచన దినోత్సవంలో గవర్నర్‌ తమిళిసై  

సాక్షి, హైదరాబాద్‌: ‘హైదరాబాద్‌ విమోచన దినం జరుపుకోవడం ద్వారా మనం నిజమైన స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఈ రోజు నిజాం రాజు తలవంచిన రోజు. క్రూరమైన రజాకార్లు పారిపోయిన రోజు. హైదరాబాద్‌ విలీనంతో భారత చిత్రపటం సంపూర్ణమైన రోజు’అని రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ పేర్కొన్నారు. నిజాం, రజాకార్ల నుంచి విముక్తి కోసం వేరే ఏ రాష్ట్రం ఇంత పోరాడలేదన్నారు.

నిజాం కాలంలో బతుకమ్మ ఆడేందుకు మహిళలు ఎన్ని సవాళ్లు ఎదుర్కొన్నారో తెలుసన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవంలో భాగంగా శనివారం ఆమె రాజ్‌భవన్‌లో వర్శిటీల విద్యార్థులకు వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...తొలిసారిగా విమోచన దినోత్సవాన్ని ఇంత ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు.

ఈ రోజు కోసం 74 ఏళ్లు ఎదురుచూశామన్నారు. విమోచన దినోత్సవాల ద్వారా మన అమరవీరుల పోరాటాలకు, వారి త్యాగాలకు గొప్ప నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. ఈ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నందుకు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో గవర్నర్‌ తమిళిసై తెలంగాణ విమోచన పోరాటయోధులు, వారి కుటుంబ సభ్యులను ఘనంగా సత్కరించారు.   

మరిన్ని వార్తలు