హైదరాబాద్‌లో అమెరికా స్వాతంత్య్ర దినోత్సవాలు 

4 Jun, 2022 03:58 IST|Sakshi
గవర్నర్‌తో ప్యాట్రి సియా, రీఫ్‌మన్‌ 

సాక్షి, హైదరాబాద్‌: అమెరికా స్వాతంత్య్ర వేడుకలను హైదరాబాద్‌లో జరుపుకోవడం సంతోషంగా ఉందని ఆ దేశ దౌత్యాధికారి ప్యాట్రి సియా లాసినా పేర్కొన్నారు. శుక్రవారం సాయంత్రం ఇక్కడ జరిగిన 246వ అమెరికా స్వాతంత్య్ర వేడుకల ఉత్సవాల్లో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్, అమెరికా కాన్సుల్‌ జనరల్‌ రీఫ్‌మన్‌లతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా లాసినా మాట్లాడుతూ అమెరికా–భారత్‌ల 75 ఏళ్ల భాగస్వామ్య ప్రయాణంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశాలు కీలకపాత్ర పోషించాయని తెలిపారు.

తమిళిసై మాట్లాడుతూ కొత్త రాష్ట్రమైన తెలంగాణకు అమెరికా కంపెనీలు, సంస్థలు, ఆ దేశ పౌరులతో ఉన్న సంబంధాలు బలాన్నిస్తాయని చెప్పారు. అంతకుముందు యూఎస్‌ నిధులతో నిర్వహిస్తున్న దేశంలోని మొదటి ట్రాన్స్‌జెండర్‌ ఆస్పత్రిని, నానక్‌రాంగూడలో నిర్మిస్తున్న నూతన అమెరికా కాన్సులేట్‌ జనరల్‌ కార్యాలయాన్ని ప్యాట్రిసియా సందర్శించారు. అక్కడ మంత్రి కేటీఆర్, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌లతో సమావేశమై నూతన కాన్సులేట్‌ జనరల్‌ నిర్మాణ పురోగతి గురించి చర్చించారు.  

మరిన్ని వార్తలు